రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దురదృష్టకరం

హైదరాబాద్:

పరిపాలన సాగించలేని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజల జీవితాలను ఛిద్రం చేసి, చివరికి చేతులెత్తేసి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం దురదృష్టకరం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో, కేంద్రంలో కూడా సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేయమని మన రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీ ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్ర పురోభివృద్ధిని కుక్కలు చింపిన విస్తరిలా మార్చి, చివరికి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం దారుణమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘నాలుగున్నరేళ్లుగా టీడీపీ మద్దతు, కుమ్మక్కు వల్లే కాంగ్రెస్‌ పార్టీ తన ప్రభుత్వాన్ని నిలుపుకోగలిగింది. లేకపోతే ఎప్పుడో కూలిపోయేది. పడవ మునిగేటప్పుడు ప్రాణ రక్షణ కోసం పరుగులు తీసినట్టు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మునిగిపోతుండటంతో ఇతర పార్టీల్లోకి పరుగులు తీస్తున్నారు. దాంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వారం రోజులుగా అనేక డ్రామాలాడారు.‌ ఫలానా వ్యక్తి సీఎం అంటూ లీకులిచ్చారు. కానీ ఎవరూ నిలబడలేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ పలాయనమంత్రం పఠించింది. గవర్నర్ పాలనకు మొగ్గుచూపింది’ అని మైసూరారెడ్డి ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడమని కర్ణాటకకు చెందిన ఒక పెద్దమనిషిని రెండుసార్లు రాజ్యసభకు మనం పంపిస్తే, ఆ వ్యక్తే మూడు ప్రాంతాల్లోని తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారని కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ను ఉద్దేశించి మైసూరా వ్యాఖ్యానించారు.

మూడు నెలల తర్వాత దేశంలో నామరూపాలు కూడా లేకుండా పోయే పార్టీ చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుందని మైసూరారెడ్డి ప్రశ్నించారు. తుమ్మితే ఊడిపోయే ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటనలకు విలువే లేదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత సోనియా, రాహుల్‌ పెట్టె సర్దుకుని ఇటలీకి వెళ్లాల్సిందే అన్నారు.

‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 60కి మించి లోక్‌సభ సీట్లొచ్చే పరిస్థితే లేదని లోకం కోడై కూస్తోంది. కానీ మతిభ్రమించిన చంద్రబాబు మాత్రం వైయస్ఆర్‌సీపీ పట్ల పిచ్చిపిచ్చిగా అవాకులు పేలుతున్నారు. దేశంలో బిచాణా ఎత్తేసి కనుమరుగయ్యే కాంగ్రెస్‌తో మేమెందుకు జతకడతాం? తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన వారితో ఎట్టి పరిస్థితిలోనూ కలిసే ప్రసక్తే లేదు. తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చే వారికి మాత్రమే కేంద్రంలో వైయస్ఆర్‌సీపీ మద్దతిస్తుంది’ అని మైసూరారెడ్డి చెప్పారు.

ఆపద్ధర్మ మంత్రి టీజీ వెంకటేశ్‌తో ఇప్పటిదాకా తాను ఏ ఒక్కరోజు కూడా నేరుగా గానీ, ఫోన్‌లో గానీ మాట్లాడిన దాఖలాలు లేవని మైసూరారెడ్డి స్పష్టంచేశారు. టీజీని టీవీల్లో తప్పితే ఇప్పటిదాకా నేరుగా కూడా చూడలేదన్నారు. టీజీని వైయస్ఆర్‌సీపీలోకి రావాలని తాను కోరినట్టుగా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని విలేకరులు ప్రస్తావించగా మైసూరా ఇలా స్పందించారు. తమ పార్టీపై, తమ అధినేత శ్రీ జగన్‌పై ఆ పత్రిక ఏం రాస్తుందో, ఎలా రాస్తుందో, ఎందుకలా రాస్తుందో తెలుగు ప్రజానీకానికి తెలుసనన్నారు. వైయస్ఆర్‌సీపీలో స్థానం దొరకని, అవకాశంలేనివారే ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని చెప్పారు.

Back to Top