ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు..

విశాఖ‌: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వేదికగా ఏపీ ప్రతిపక్షనేత, వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌ వెయిటర్‌ కాఫీ ఇచ్చి.. సెల్ఫీ అడిగి చేరువగావచ్చి పందెంకోళ్లకు ఉపయోగించే పదునైన కత్తితో జగన్‌పై దాడిచేశాడు. గొంతు లక్ష్యంగా దాడి జరిగినా జగన్‌ అప్రమత్తమై పక్కకు తిరగడంతో ఎడమ భుజంలో కత్తి దిగింది. నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అరెస్టు చేసి ఏపీ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స అనంతరం వైయ‌స్ జగన్‌ హైదరాబాద్‌ పయనమయ్యారు. హైదరాబాద్‌లో ఆయనకు శస్త్రచికిత్స చేసి 9 కుట్లు వేసినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ కత్తికి విషపూరిత రసాయనాలు ఏమైనా పూసి ఉంటారా అన్న అనుమానంతో పరీక్షలు జరుపుతున్నారు. అభిమాన నేతకు ఏం జరుగుతుందోనన్న భయంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

దాడి ఘటన జరిగిన గంటలోపే ఏపీ డీజీపీ విలేకరుల ముందుకు వచ్చి నిందితుడి గురించి ఉద్దేశపూర్వక ప్రకటనలు చేయడంతో ఈ వ్యవహారం ఏయే మలుపులు తిరుగుతుందో ముందే వెల్లడయిపోయింది. పబ్లిసిటీ కోసమే నిందితుడు ఆ ప్రయత్నం చేశాడని, వాస్తవానికి అతను జగన్‌ అభిమాని అని డీజీపీ ప్రకటించేశారు. అదే పల్లవిని మంత్రులు అందుకున్నారు. మధ్యలో హాస్యనటుడు శివాజీ రచించిన ‘గరుడపురాణం’ కూడా వచ్చి చేరింది. నిందితుడి జేబులో ఓ లేఖను సృష్టించారు.. నిందితుడితో వీడియో వాంగ్మూలం ఇప్పించారు. అది  మధ్యాహ్నం డీజీపీ చెప్పినట్లే అచ్చుగుద్దినట్లు వచ్చింది. ఇక రాత్రికి ఏపీ ముఖ్యమంత్రి తెర ముందుకు వచ్చారు. తలాతోకా లేని వాదనలతో అందరినీ నిశ్చేష్టులను చేశారు. రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధినేతపై హత్యాయత్నం జరిగితే పరామర్శించడం కనీస సంప్రదాయం.

కానీ ఏపీ ముఖ్యమంత్రి ఆ విషయం వదిలేశారు. పైగా వెకిలిగా నవ్వుతూ ఎద్దేవా చేయడానికి ప్రయత్నించడం శోచనీయం. ఇలాంటి ఘటన జరిగినపుడు భద్రతా లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యతను మరచి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎదురుదాడి చేయడం.. లేనిపోని అబద్దపు సాక్ష్యాలు సృష్టించి ఈ వ్యవహారాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం చూసి ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. కాగా, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు ముక్తకంఠంతో ఈ ఘటనను ఖండించారు. 


తాజా వీడియోలు

Back to Top