మూడు జిల్లాల్లో పూర్తయిన మరో ప్రజాప్రస్థానం

మహబూబ్‌నగర్ :

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరీ అయిన షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ మూడు జిల్లాలను దాటింది. గురువారం తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఘనంగా అడుగుపెట్టింది. పెద్ద సంఖ్యలో  తరలి వచ్చిన తెలంగాణ ప్రజలు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. ఉదయం కర్నూలులో యాత్ర చేసిన షర్మిల.. మధ్యాహ్నం 3.28 నిమిషాలకు కర్నూలు జిల్లా సరిహద్దులోని తుంగభద్ర వంతెన దాటి మహబూబ్‌నగర్ జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో వీడ్కోలు పలికేందుకు రాయలసీమ ప్రజలు, మహబూబ్‌నగర్ జిల్లాలోకి ఆహ్వానించేందుకు తెలంగాణ ప్రజలు వంతనె మీదకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ఇసకేస్తే రాలనంత జనం తరలి వచ్చారు. రెండు ప్రాంతాల ప్రజలు ఒకేసారి వంతెన మీదకు రావడంతో తీవ్రంగా తోపులాట చోటుచేసుకుంది.  షర్మిల వ్యక్తిగత సిబ్బంది, కర్నూలు, మహబూబ్‌నగర్ పోలీసులు అతికష్టం మీద తోపులాటను అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ప్రజలు తెలంగాణ సంప్రదాయ వాయిద్యం ‘డిల్లెంబెల్లెం’ మోగిస్తూ వీరుని నృత్యం చేస్తూ షర్మిలను పుల్లూరు గ్రామం గేటు వరకు తీసుకొచ్చారు. ఇక్కడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ స్వాగతం పలికారు. ఇప్పటిదాకా ఐదున్నర రోజుల పాటు వైయస్ఆర్ జిల్లాలో, పదిహేను రోజులు అనంతపురం జిల్లాలో, పద్నాలుగున్నర రోజులు కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్ర చేశారు. గురువారం  కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలిపి మొత్తం 15.30 కిలో మీటర్లు షర్మిల నడిచారు.

Back to Top