పంచాయతీలను జగన్‌కు కానుకగా ఇద్దాం

తిరుపతి, 14 జూన్ 2013:

ఎన్నికల నగారా ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పార్టీ కార్యకర్తలకు, నేతలకు  పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో ఏర్పాటైన  వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సదస్సు సాయంత్రం ముగిసింది. ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో విజయం సాధించి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామని చెప్పారు. ప్రతి కార్యకర్త పట్టుదలతో కృషి చేసి పార్టీ గెలుపొందేలా కృషిచేయాలన్నారు. దేవుని దయవల్ల శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ విజయోత్సవ సభలో ఆయన మీతో కలిసి పాల్గొనే అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడని శ్రీమతి విజయమ్మ అభిలషించారు.

ప్రభుత్వం రైతులకు క్రాప్‌ హాలీడే, పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించిందనీ, తత్కారణంగా వేలాది మంది అన్నదాతలు, కార్మికులు రోడ్డున పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలకు మనం హాలీడే ప్రకటించాలని కోరారు. ప్రతీ పంచాయతీ కార్యాలయం మీద వైయస్ఆర్‌ కాంగ్రెస్  జెండా రెపరెపలాడించాలన్నారు. జగన్‌బాబు ఆధ్వర్యంలో రాజశేఖర్‌రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి మనమంతా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు విజయమ్మ పిలుపునిచ్చారు.

Back to Top