జనం గుండెల్లో జననేత జగన్‌ : కొణతాల

చోడవరం, ‌అనకాపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైల్లో కాదని ప్రజల గుండెల్లో ఉన్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ‌అభివర్ణించారు. శ్రీ జగన్‌ జైలు నుంచి బయటకు వచ్చాక కాంగ్రెస్, ‌టిడిపిల అడ్రస్సులు గల్లంతవుతాయని ఆయన హెచ్చరించారు. చోడవరం యువజన విభాగం కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానుల మధ్య కొణతాల కేక్ క‌ట్‌ చేసి, మిఠాయిలు పంచారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ, మూడు రోజులు జిల్లాలో పర్యటించిన సిఎం కిరణ్ ప్రజ‌లు, రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2008లోనే చెరకు రైతులకు టన్నుకు రూ.2200 ఇచ్చారని, ఇప్పుడు ఆ ధర కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి సుగర్సు రైతులకు ఇప్పటికీ గత ఏడాది బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పుట్టిన రోజు నాటికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం కావడం ఖాయమన్నారు.

శ్రీ జగన్మోన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో పెద్దసంఖ్యలో యువకులు, మహిళలు రక్తదానం చేశారు. రోటరీక్లబ్‌ వారు శిబిరంలో సేవలు అందించారు.

వైయస్ పథకాలు జగ‌న్‌తోనే సాధ్యం :
దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని కొణతాల రామకృష్ణ తెలిపారు. అనకాపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం శ్రీ జగన్మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పిల్లలచేత కేక్‌ను కట్ చేయించారు. పిల్లలకు పెన్నులు, పుస్తకాలు, కార్మికులకు తువ్వాళ్లు పంపిణీ చేశారు.‌ అనంతరం ఆయన మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం సిబిఐని అడ్డుపెట్టుకొని శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపిందని ధ్వజమెత్తారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలు నుంచి త్వరగా విడుదల కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రామకృష్ణ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top