జగన్ విడుదల కోరుతూ అర్ధనగ్న ప్రదర్శన

మైలవరం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌ రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయలేరని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్‌బాబు తెలిపారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా మైలవరంలోని ప్రధాన రహదారిలో పార్టీ ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. పార్టీ కార్యాలయంలో మహానేత డాక్టర్ వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, భద్రాచలం రోడ్డులోని హనిమిరెడ్డి కాంప్లెక్సులో ఏర్పాటుచేసిన వైయస్ కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లనీ,  ధర్మాన్ని కాపాడాలనీ, న్యాయాన్ని నిలబెట్టాలనీ కోరారు. జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ప్రజా సమస్యలపైనే నిర్విరామంగా పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజాభిమానం పొందుతున్న ఆయన్ని ప్రజల నుంచి దూరం చేసేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టాయన్నారు. నియోజకవర్గంలోని మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాల నుంచి సుమారు రెండువేల మంది నాయకులు, కార్యకర్తలు ఈ అర్ధనగ్న ప్రదర్శనలో పాల్గొన్నారు.

Back to Top