'జగనన్న వస్తే పంటలకు గిట్టుబాటు ధరలు'


మూలమల్ల (మహబూబ్ నగర్ జిల్లా):

'మరో ప్రజా ప్రస్తానం'  పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రజల కష్టాలు విని చలించిపోయారు.  మహానేత అధికారంలో ఉన్నప్పుడు తామెంతో సంతోషంగా ఉన్నామని, ఇపుడు తమను పట్టించుకున్న నాథుడేలేడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు కూడా తీరే పరిస్థితులు లేవని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

      పాలమూరు జిల్లాలోని మూలమల్ల గ్రామ శివారులో వడ్లు తూర్పారపడుతున్న రైతుల చెంతకు వెళ్లి వారి కష్టాలను శ్రీమతి షర్మిల అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు తనే స్వయంగా వడ్లు తూర్పారపట్టారు. తమ కష్టాల్లో పాలుపంచుకున్న శ్రీమతి షర్మిలను చూసి రైతులు కంట కన్నీరు పెట్టుకున్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుంటే రాష్ర్టంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారని అన్నారు. ప్రస్తుతం కరెంటు సరఫరా సక్రమంగా లేదని, శ్రమటోడ్చి పండించిన పంటకు గరిష్ట మద్దతు ధర కూడా ఇవ్వడంలేదని అన్నారు.

      మహబూబ్ నగర్ జిల్లాలో ఎనమిదో రోజు పాదయాత్ర కొనసాగించిన  శ్రీమతి షర్మిల రైతులనుద్దేశించి మాట్లాడారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని, రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు వస్తారని అన్నారు. అప్పటి వరకు ఎవరూ అధైర్యపడొద్దని ఆమె సూచించారు. రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయిస్తారని, మీ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. మీరంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని శ్రీమతి షర్మిల కోరారు.

జగనన్న సాయం కోసం...

మహానేత అకాల మరణాన్ని తట్టుకోలేక మూలమల్ల గ్రామంలో మృతి చెందిన కృష్ణ అనే రైతు కుటుంబ సభ్యులు  శ్రీమతి షర్మిల ఎదుట భోరున విలపించారు. ఇంటి యజమాని మృతితో తాము వీధిన పడ్డామని,  పూట గడవడం కష్టమవుతోందని ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. కృష్ణ కుటుంబం గాధ విన్న శ్రీమతి షర్మిల చలించిపోయారు. వారి వివరాలు తీసుకోవాలని పార్టీ నేతలను పురమాయించారు. జగనన్న బయటకు రాగానే కుటుంబాన్ని ఆదుకుంటారని, తగిన సాయం చేస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

Back to Top