అగ్రవర్ణాలతో సమానంగా ఎస్సీ,ఎస్టీల అభివృద్ది

హైదరాబాద్, 1 డిసెంబర్ 2012:

రాష్ట్ర ప్రభుత్వం శనివారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక తీర్మానాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. ఈ అంశంపై పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి అయిన శ్రీమతి వైయస్ విజయమ్మ శాసన సభలో ప్రసంగించారు. అగ్రవర్ణాలతో సమానంగా దళిత, గిరిజనులు ఎదిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె దుయ్యబట్టారు. గడచిన మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాజకీయ లబ్ధికోసమే ఇపుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టం తెస్తున్నారని ఆమె ఆరోపించారు.

     రాష్ట్రంలో దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఉప ప్రణాళిక అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని శ్రీమతి వైయస్ విజయమ్మ సూచించారు. ప్రభుత్వం అన్ని ధరలూ పెంచి పేదల నడ్డి విరుస్తోందన్నారు. ఈ ప్రభావం దళితుల మీద ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో దళితులకు న్యాయం జరిగిందని శ్రీమతి విజయమ్మ  పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఆయన ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఆయన పాలన కొనసాగిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు దళితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ రుణాలు, ఉద్యోగ అవకాశాలు అందడంలేదన్నారు. దళిత, గిరిజన హాస్టళ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు.

     రాష్ట్రంలో ఎస్టీ, ఎస్టీలు అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నారనీ, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని శ్రీమతి విజయమ్మ సూచించారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్ల నిర్మాణంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా వారి సక్రమ అభివృద్ధికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమన్నారు.

     రాష్ర్ట ప్రభుత్వ విధానాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా దళితులకు అందకుండా పోతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లును చివరి వరకు దాచాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతోందని శ్రీమతి విజయమ్మ చెప్పారు. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి పాలన చంద్రబాబు నాయుడుకు  కొనసాగింపుగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, శాసన సభాపక్ష నేత శ్రీమతి వైయస్ విజయమ్మ విమర్శించారు.

Back to Top