ఈ ప్రభుత్వం ప్రజలు హింసిస్తోంది

దొడ్డిమేకల(మంత్రాలయం):

మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల గురువారం సాయంత్రం దొడ్డిమేకల ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో మాట్లాడారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. వారంతా తమకు కరవు పనికింద రూ. 30 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కష్టాలు విన్న షర్మిల.. ఇది శ్రమదోపిడీ అనీ, రాబందుల రాజ్యమనీ, ఈ ప్రభుత్వం మహిళలను హింసిస్తోందనీ తీవ్రంగా విమర్శించారు. వారితో సాగిన సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి.

షర్మిల: కరవు పని దొరుకుతోందా?

మహిళలు: కొద్దిరోజులే దొరుకుతుంది. దొరికినా కూలీ రూ. 30 మాత్రమే ఇస్తున్నారు. పనులు లేక వలసలు పోవాల్సి వస్తోంది.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు రూ. 120 వరకూ వచ్చేది. ఇప్పుడు రూ. 30 మాత్రమే ఇస్తున్నారు. దీన్నే శ్రమదోపిడీ అంటారు. ఇది రాబందుల రాజ్యం. ఈ ప్రభుత్వం మహిళలను హింసిస్తోంది. కరవు పనులు ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. పైగా వడ్డీ లేని రుణాలంటారు.

మహిళలు: పావలా వడ్డీ కింద రుణాలు రావడం తగ్గింది. వచ్చినా రూ.2 వడ్డీ పడుతోంది. బయట తెచ్చుకోవాలంటే రూ.5 వడ్డీ వసూలు చేస్తున్నారు.

మరో మహిళ: నా భర్త ఆర్నెల్ల క్రితం విద్యుదాఘాతంతో చనిపోయారు. ప్రమాదవశాత్తూ చనిపోతే రూ. 50 వేలు వస్తాయన్నారు. అవి రావడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేసినా ఇంతవరకు ఆ డబ్బులే రాలేదు. వితంతు పింఛను కూడా అందడం లేదు.

షర్మిల: బాధపడకమ్మా.. జగనన్న సీఎం అయ్యాక వృద్ధులు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1,000 పెన్షన్ ఇస్తాడు. పిల్లలను చదివిస్తే పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ అయితే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1,000 చొప్పున తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. పిల్లలను చదివించడం మాత్రం ఆపొద్దు. మీ కుటుంబాలు బాగుపడాలంటే పిల్లలను చదివించాలి.

మహిళలు: ఈ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండడం లేదు. పురుగులు వస్తున్నాయి. దాదాపు 200 మంది పిల్లలు వేరే ఊళ్లకు వెళ్లి చదువుకుంటున్నారు. వారికి బస్సులు లేవు.

షర్మిల: ఎమ్మెల్యే ఈ విషయం మాట్లాడి భోజనం సరిగ్గా ఉండేలా చూస్తారు. బస్సుల గురించి ఎమ్మెల్యే ఇప్పటికే మాట్లాడారట. కానీ ఈ సర్కారు సామాన్యుడి సంగతి పట్టించుకునే పరిస్థితి లేదు. కరెంటు పరిస్థితి ఎలా ఉంది?

మహిళ: బిల్లులెక్కువ. కరెంటు తక్కువ.
షర్మిల: ఎంతొస్తుంది బిల్లు.. కరెంటు ఎంతసేపు వస్తోంది?
మహిళ: బిల్లు రూ. 200 వస్తుంది. కరెంటు మాత్రం నాలుగు గంటలు కూడా ఉండదు.
షర్మిల: పంటల పరిస్థితి ఏంటి?
మహిళ: మీ నాయన ఉన్నప్పుడు వానలు బాగా పడేవి. పంటలు బాగా పండేవి. ఇప్పుడు పంటలు లేవు. తినడానికి తిండి లేదు. వానలు లేక బుడ్లు(వేరుశనగ) ఎండిపోయాయి. పత్తి ఎండిపోయింది.
షర్మిల: రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. వర్షాలు కూడా బాగా పడతాయి.

Back to Top