జైల్లో పెడతామంటూ ముఖ్యమంత్రి బెదిరించడం దారుణం

చిత్తూరు(తిరుమల): సొంత జిల్లాలో మన్నవరం ప్రాజెక్టు ను కాపాడుకోలేని అస‌మ‌ర్థ సీఎం చంద్ర‌బాబు నాయుడ‌ని చిత్తూరు జిల్లా న‌గిరి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు.  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జ‌లంతా ఎక‌తాటిపై న‌డుస్తుంటే వారిని జైలులో పెడ‌తామ‌ని చంద్ర‌బాబు బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం సిగ్గు చేట‌న్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం... ప్ర‌జ‌ల కోసం ఒక ముఖ్య‌మంత్రి చేయాల్సిన పోరాటాల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉంటూ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేస్తున్నార‌ని ఆమె వివ‌రించారు. ప్ర‌త్యేక హోదా కోసం ముందుకు వ‌స్తున్న యువ‌త‌ను అణిచివేయాల‌నుకోవ‌డం చంద్ర‌బాబు అస‌మ‌ర్థత‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 

ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ చెబితే కాదు ప‌దేళ్లు కావాల‌ని వెంక‌య్య‌నాయుడు, కాదుకాదు ప‌దిహేనేళ్లు కావాల‌ని చంద్ర‌బాబు అడిగిన విష‌యం ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తుకు చేశారు. అధికారంలోకి రాక‌ముందు ఒక మాట‌... అధికారంలోకి వ‌చ్చాక మ‌రొక మాట మాట్లాడ‌డం దారుణ‌మ‌న్నారు. అధికారంలో ఉన్న వారే అబ‌ద్దాల‌డుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిరంత‌రం పోరాటాలు చేస్తు చంద్ర‌బాబు అవినీతి, అక్ర‌మాల‌ను నిల‌దీస్తున్నార‌ని రోజా పేర్కొన్నారు. 
Back to Top