కేంద్రం నిర్ణయాలతో 'వ్యవసాయం' కుదేలు

హైదరాబాద్ 28 జూన్ 2013:

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచే చర్యలు లేవని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎమ్.వి.ఎస్. నాగిరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతాంగాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 82 శాతం మద్దతు ధర పెరిగింది కానీ ఎరువుల ధరలు మాత్రం పెరగలేదన్నారు.  2013-14 మద్దతు ధర అరవై రూపాయలు పెంచారు. 2010 నుంచి 250 శాతం వరకూ ఎరువుల ధరలు పెరిగాయని తెలిపారు. అదే మద్దతు ధర మాత్రం కేవలం 31శాతమేనన్నారు. ఈ ఏడాది 4.8శాతం ధాన్యం మద్దతుధర పెరిగిందన్నారు. కొన్ని పంటలకు మాత్రమే ధరలు పెంచారన్నారు. మెట్ట పంటల్లో సజ్జకు పెంచి రాగికి పెంచలేదన్నారు. పప్పుదినుసులలో కంది, పెసరకు మద్దతు ధర పెంచి, మినుముకు పెంచలేదని తెలిపారు. నూనె గింజలలో సోయాకు పెంచారు.. సన్ ఫ్లవర్ పంటకు పెంచలేదన్నారు. ఖర్చుకు తగినట్లుగా మద్దతు ధరలు నిర్ణయం కాలేదన్నారు. దిగుమతులు, విదేశాల్లో ఉన్న ధరలకు అనుగుణంగానే ఈ పెంపు ఉందని ఆయన విశ్లేషించారు. దేశ రైతాంగం ఏమై పోయినా కేంద్రానికి పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. పీవీ నరసింహారావుగారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇప్పటి ప్రధాని ఆర్థిక మంత్రిగానూ, రాష్ట్రపతి ప్రణబ్ వాణిజ్య మంత్రిగానూ ఉన్నారని చెప్పారు. అప్పట్లో విదేశాలలో ధరలు ఎక్కువగా ఉన్నందున వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసుకుంటే బాగుంటుందని భావించారన్నారు. విదేశాలలో ఖర్చు తక్కువగా ఉండి.. మన దేశానికి ఎగుమతి చేసినప్పుడు ఎక్సయిజ్ సుంకం విధిస్తామని చెప్పారన్నారు. ఈ రోజు మాత్రం ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా రైతులనుంచి వ్యవసాయోత్పత్తులు వెళ్ళిపోయిన తర్వాత ఎగుమతులకు అనుమతించడం వల్ల వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మినుములుకు కిందటేడాది క్వింటాలుకు 4200 రూపాయలుంటే ఇప్పటికీ 3400కు కూడా అమ్ముకోలేకపోతున్నారనీ, ఈ కారణంగా లక్షలాది టన్నుల మినుము రైతుల వద్ద ఉండిపోయిందనీ నాగిరెడ్డి చెప్పారు. అయినప్పటికీ మినుములను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారనీ ఇదేం విధానమనీ ఆయన ప్రశ్నించారు. దీనిని విశ్లేషించుకుంటే రైతు వ్యతిరేక విధానం వెల్లడవుతోందని పేర్కొన్నారు.

మరోవంక గ్యాస్ ధర పెంపు.. మిలియన్ యూనిట్ల గ్యాస్ ధరను 4.2 డాలర్ల నుంచి 8.2 డాలర్లకు పెంచారన్నారు. ఈ చర్య కారణంగా యూనిట్ విద్యుత్తు ధర రెండు రూపాయలు పెరగబోతోందని ఆయన అంచనా వేశారు. ఈ పెంపును పేద వర్గాలు ఎలా తట్టుకుంటాయని ప్రశ్నించారు. ఇప్పటికీ దేశంలో 32శాతం మందికి ఇళ్ళలో విద్యుత్తు దీపాలు లేని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాజా చర్య వల్ల ఇది 62 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదన్నారు. గ్యాస్ ధర పెంపు నిర్ణయం అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తుందనీ.. అన్ని ధరలూ పెరిగే అవకాశముందనీ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తాజా నిర్ణయాలు చూస్తుంటే రైతాంగాన్ని విదేశాలకు తాకట్టు పెట్టబోతున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. పరిశ్రమల పరిస్థితి కూడా అదేనన్నారు. 2004-2009 మధ్య రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా ధాన్యానికి 450 రూపాయలు మద్దతు ధర పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అంటే 82శాతం పెరిగినట్లన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఎరువుల ధరలు పెరగని విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. రాజన్న మరణించిన నాటినుంచి ఈనాటి వరకూ 310 రూపాయలు అంటే 31 శాతం పెరిగిందన్నారు. ఎరువుల ధరలు మాత్రం ఆకాశానికంటాయన్నారు. 450 రూపాయలున్న డీఎపి ధర 1250కి పెరిగిందన్నారు. విత్తనాలు, ఎరువులు, ఇలా అన్నిటి ధరలూ పెరిగాయని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే ప్రయత్నం ఇదని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతు ధరలుండాలని ఆయన డిమాండ్ చేశారు. ఎరువుల ధరలు తగ్గించాలని ఆయన కోరారు. గ్యాస్ ధర పెంపు కారణంగా దేశంలో అన్ని రంగాలూ నిర్వీర్యం కాబోతున్నాయని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ చార్జీలను తగ్గించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Back to Top