భరోసానిస్తున్న షర్మిల పాదయాత్ర

‘కొద్ది రోజులు ఓపిక పట్టండి.. రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న సీఎం అవుతారు.. మీ కష్టాలను తీరుస్తార'ని వైయస్ తనయ షర్మిల భరోసా ఇచ్చారు. బుధ, గురువారాల్లో ఆమె అనంతపురం జిల్లాలో చేప్టిన పాదయాత్రలో రైతులు, వికలాంగులు, విద్యార్థుల కష్టాలువిన్నారు. వారికి ధైర్యం చెప్పారు. ‘మానవత్వంలేని సర్కారిది. ప్రజల తరఫున నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యార’ని ఆమె నిప్పులు చెరిగారు.
అనంతపురం:

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ‘అనంత’లో అపూర్వ స్పందన లభిస్తోంది. జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దారి పొడవునా నీరాజనాలు పడుతున్నారు. బంతిపూల వర్షం కురిపిస్తూ, హారతులిచ్చి అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగనన్న చెల్లెలుకు దిష్టి తగలకుండా దిష్టి తీస్తున్నారు. బుధవారం రాత్రి తాడిమర్రి మండలం శివంపల్లి శివారులో బస చేసిన షర్మిల గురువారం ఉదయం ఆత్మకూరుకు చేరుకున్నారు. అప్పటికే ఆ గ్రామం జనసంద్రంగా మారింది.

షర్మిల ముందు స్థానికులు కష్టాలను ఏకరువు పెట్టారు. ‘వైఎస్ ఉన్నంత వరకూ పావ లా వడ్డీ రాయితీ సక్రమంగా వచ్చింది. ఇప్పుడు ఇవ్వడం లేదం’టూ సాకమ్మ అనే మహిళ వాపోయింది. ‘అమ్మా.. నా కు 2011 వరకూ పెన్షన్ వచ్చింది. ఇప్పుడు తీసేశారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదు. నేనెలా బతకాలం’టూ బాలన్న అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. షర్మిల స్పందిస్తూ ‘ఈ ప్రభుత్వానికి పేదలంటే చులకన. పావలావడ్డీ రాయితీ ఇవ్వరు. పెన్షన్ ఇవ్వరు. మానవత్వం లేని సర్కారు ఇదం’టూ విరుచుకుపడ్డారు. ‘ఎవరూ అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. జగనన్న సీఎం అవుతారు. మీ కష్టాలన్నీ తీర్చుతార’ని భరోసా ఇచ్చారు.

రైతులంటే అంత చులకనా?
ఆత్మకూరు నుంచి బత్తలపల్లి మండలం తంబాపురం చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానికుల సమస్యలను ఆరా తీశారు. సేద్యానికి కరెంటు రెండు గంటలు కూడా ఇవ్వడం లేదని, పంటలన్నీ ఎండిపోతున్నాయని తంబాపురానికి చెందిన ఓ రైతు చెప్పారు. ‘గతేడాది ఇన్‌పుట్ సబ్సిడీనే ఇవ్వలేదు. ఈ ఏడాది వేరుశనగ పంట పోయింది. ఇప్పుడు నష్టపరిహారం ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. పంటలు పండక.. ప్రభుత్వం ఆదుకోకపోతే మేమెలా బతకాల’ంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల స్పందిస్తూ.. ‘వైయస్ ఏడు గంటల ఉచిత విద్యుత్తును సేద్యానికి ఇచ్చి చూపించారు. ఈ ప్రభుత్వం రెండు మూడు గంటలు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతోంది. ఇక చంద్రబాబు పాలనలో ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఇందుకు వ్యతిరేకంగా వైయస్ ఉద్యమం చేశారు. అప్పుడు పోలీసు కాల్పుల్లో రైతులు చనిపోయారు. చంద్రబాబు పరామర్శించారు.. ఎవరిని అనుకుంటున్నారు? రైతులను కాల్చిన పోలీసులను’ అంటూ మండిపడ్డారు. ఎన్‌హెచ్-205 క్రాస్ రోడ్డు మీదుగా అప్పరాచెర్వుకు చేరుకునే మార్గమాధ్యంలో భోజనం చేసిన షర్మిల కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత అప్పరాచెర్వుకు చేరుకున్నారు. అక్కడ పలువురు తమ సమస్యలను తెలిపారు. ‘అక్కా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈ సర్కారు కోతలు పెడుతోంది. గతేడాది ఆగస్టులో తరగతులు ప్రారంభమైతే.. ఈ ఏడాది ఇప్పటికీ తరగతులు ప్రారంభం కాలేదు. ఇలాగైతే మేం ఓ విద్యాసంవత్సరం కోల్పోతామ’ని భార్గవి అనే విద్యార్థిని వాపోయింది. గ్రామంలో బోర్లు ఎండిపోయాయని, కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు తెలిపారు.

షర్మిల స్పందిస్తూ.. ‘పేదలన్నా, రైతులన్నా ఈ సర్కారుకు చులకన. అందుకే ఫీజు రీయింబర్సుమెంట్ ఇవ్వడం లేదు. కరెంటూ ఇవ్వడం లేదు. రైతుల కష్టాలు తెలిసిన మనిషి కాబట్టే వైయస్ ఐదేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్లలో రూ.పది వేల కోట్లు కూడా ప్రాజెక్టులకు ఖర్చుచేసిన పాపాన పోలేదు. హంద్రీ-నీవా పనులను వైఎస్ హయాంలో 70 శాతం పూర్తిచేశారు. మిగిలిన 30 శాతం పూర్తిచేయడానికి ఈ ప్రభుత్వం కిందామీదా పడుతోంది. తొలి దశ పూర్తికావడానికి ఇంకా రూ.45 కోట్లు వెచ్చిస్తే చాలు. కానీ.. ఈ సర్కారుకు మనసు లేదు. ఇప్పుడేమో మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేస్తారట! ఇదెక్కడి చోద్యం? సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లుంది రఘువీరా వ్యవహారం’ అంటూ మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top