అంత కన్నా ఎక్కువే గెలుస్తాం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌

ఎన్డీటీవీ సర్వేపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వ్యాఖ్య

హైదరాబాద్,‌ 28 ఆగస్టు 2012 : ఎన్డీటీవీ సర్వేలో వెల్లడించినట్టుగా తమ పార్టీ రాష్ట్రంలో గెలిచేది 21 లోక్‌సభ స్థానాలు మాత్రమే కాదని, కనీసంగా 35 స్థానాలకుపైగానే విజయ దుందుభి మోగిస్తామన్న నమ్మకం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. సర్వే పట్ల తమకు అంతగా విశ్వాసం లేదని వారు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారంనాడు వారు విలేకరులతో మాట్లాడారు.

తమ పార్టీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు బలీయంగా కోరుకుంటున్నారని ఎన్డీటీవీ సర్వే వెల్లడించడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోవడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఒక్క ఎన్డీటీవీయే కాదని, గతంలో సీఎన్ఎ‌న్‌ ఐబీఎన్, చంద్రబాబు నాయుడు ఎంతో ఇష్టపడే ఇండియా టుడే సంస్థలు నిర్వహించిన సర్వేలో కూడా జగన్‌ ప్రభంజనం నడుస్తున్నట్లు వెల్లడైందని వారు గుర్తు చేశారు. ఆ సర్వేలపై బాబు ఏమంటారని ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు ప్రశ్నించారు. 2009 ఎన్నికలకు ముందు కూడా ఎన్డీటీవీ చేసిన సర్వేలో టీడీపీకి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడైతే బాబు అపుడు కూడా విమర్శించారని, ఎన్నికల అనంతరం ఆయన పార్టీకి వచ్చింది కేవలం ఐదు స్థానాలు మాత్రమే అని వారన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top