అన్ని జిల్లాలనూ ప్రేమించిన మహానేత: విజయమ్మ

నిర్మల్: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్ని జిల్లాలనూ సమానంగా ప్రేమించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయలక్ష్మి చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వభావం కూడా అంతేనని తెలిపారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం నిర్మల్ పట్టణంలో ఏర్పాటైన బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీబీ మాజీ ఛైర్మన్ రాంకిషన్రెడ్డి, బోథ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తుల శ్రీనివాస్, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వెనుకబడిన జిల్లాపై శ్రద్ధ చూపుతారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. వెనుకబడిన జిల్లాలోని ప్రజలు.. ప్రాంతాల అభివృద్దికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని పేర్కొన్నారు. లక్ష యాబై వేల ఎకరాలకు నీరందిస్తామని ఆనాడు మహానేత వైయస్ఆర్ చెప్పారన్నారు. తెలంగాణ జిల్లాల పొలాల్లో బంగారం పండుతుందని చెప్పారు. వైయస్ఆర్ 2005లో వచ్చినపుడు ప్రాణహితలో నీరు చూసిపొంగిపోయారని చెప్పారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నిపుణులతో చర్చించి నీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. అంతర్రాష్ట్రాల ఒప్పందం ప్రకారం నీటిని వాడుకోలేకపోతున్నామని ఆమె తెలిపారు. '150 టీఎంసీ నీటిని తీసుకుని సస్యశ్యామలం చేయవచ్చనీ,  దీనికి రూ. 38వేల 500 కోట్లు  ఖర్చవుతుందనీ మహానేత సోనియాకు చెప్పారని' శ్రీమతి విజయమ్మ వివరించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్టు పనిలో  పురోగతి లేదన్నారు. మహారాష్ట్ర దీనికి అభ్యంతరాన్ని తెలపనప్పటికీ ప్రభుత్వం ముందుకు రావడంలేదన్నారు. ఆదలాబాద్ జిల్లాలో మహానేత ఆరు నీటి ప్రాజెక్టులు మొదలు పెట్టారనీ, ఆయన  మరణానంతరం నిలిచిపోయాయనీ ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..?

     రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వస్తోందన్నారు. రైతులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదన్నారు. మరోవైపు పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయన్నారు. కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. రైతులు విత్తనాలు నల్ల బజారులో కొనాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు హయాములో ధాన్యం క్వింటాలు ధర రూ. 500 ఉంటే.. వైయస్ఆర్ పాలనలో ఏడాదికి వంద పెరిగి వెయ్యి రూపాయలయ్యిందని పేర్కొన్నారు.  ఆరోగ్యశ్రీ అధ్వానంగా తయారైందన్నారు. 104, 108 కనిపించడంలేదు. రకరకాల ఆంక్షలు పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారిచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆయన హయాంలో పైసా పన్ను పెంచలేదని చెప్పారు. ఈరోజు అన్ని ధరలూ పెంచారు. చంద్రబాబు లాగే ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. 'చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరు... ప్రజల సమస్యలను చర్చించడానికి అసెంబ్లీకి రారు. ఒక్క వాగ్డానంపైనా ఆయన నిలబడలేద'ని శ్రీమతి విజయమ్మ ధ్వజమెత్తారు. చిరంజీవి, చంద్రబాబు, రాష్ట్ర మంత్రులపై ఆమె విమర్శలు గుప్పించారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం పాటిస్తున్నారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మీ బిడ్డగా ఆదరించాలని ఆమె విజ్ఞప్తిచేశారు. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి, జనక్ ప్రసాద్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.  

ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడిన వైయస్ఆర్

     డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.  మెడికల్ కాలేజీ పెట్టారన్నారు. వికలాంగులు, వృద్ధులు, ఇలా వివిధ వర్గాల వారిని ఎన్నో రకాలుగా ఆదుకున్నారన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. సభలో జగన్నినాదాలు మార్మోగాయి.

Back to Top