తిరుపతి:
టీడీపీ నుంచి వలసలను నివారించడానికే చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి పాదయాత్ర చేపట్టారని చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర అనుబంధంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు జరపకుండా నిరోధించే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెత్తికెత్తుకుంటే, కిరణ్ ప్రభుత్వం కూలిపోకుండా చంద్రబాబు భుజాన మోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చంద్రబాబు కొమ్ము కాయకుండా ఉంటే సీబీఐ, సీబీసీఐడీ, ఏసీబీలలో ఏదో ఒక సంస్థ చేత ఆయన అవినీతిపై దర్యాప్తు జరిపించాలని సవాలు విసిరారు. వైఎస్ పథకాలను నీరుగార్చడమే లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజా సమస్యలు, సంక్షేమం గురించి వాకబు చేయకుండా, క్రికెట్ ఆడుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంక్షోభంలో చిక్కుకుందని, దీని నుంచి బయటపడే మార్గం ముఖ్యమంత్రికి తెలియడం లేదని అన్నారు. అసలాయనకు విద్యుదుత్పత్తి, సరఫరా, డిమాండ్ల లెక్కలే తెలియవని ఎద్దేవా చేశారు.