రాష్ట్రం అగ్నిగుండమైనా బాబుకు పట్టడం లేదు

నెల్లూరు, 19 సెప్టెంబర్ 2013:

విభజన ప్రకటన కారణంగా మన రాష్ట్రం అతలాకుతలమై అగ్నిగుండంలా మారిపోతున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్ను అడ్డుకునేందుకు ‌మాత్రం కుట్రల మీద కుట్రలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు ఆనం జయకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్ష దీక్షకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతు తెలిపింది. మరో‌వైపు గూడూరు గర్జనకు భారీ స్పందన వచ్చింది.

తిరుపతిలోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రేణిగుంట సిఆర్‌ఎస్ ఎదుట ఎన్జీవో‌లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే ఉద్యోగులను విధులకు వెళ్లనివ్వకుండా ఆందోళనకారులు అడ్డుకోవటంతో పోలీసులు భారీగా మొహరించారు.

మరోవైపు అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ఉద్యోగ జేఏసీ మూసివేయించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉరవకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ జరిగింది. ‌పొన్నూరు ఐలాండ్ సెంట‌ర్‌లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

Back to Top