నెగ్గలేం.. నాన్చుదాం!

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఎలాగైనా నిలువరించేందుకు అధికార పార్టీ అనుసరిస్తున్న అడ్డగోలు ఎత్తుగడలు తారస్థాయికి చేరుతున్నాయి. 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన ఆ స్థానాల్లో ఇప్పట్లో ఉప ఎన్నికలు జరక్కుండా అడ్డుకునేందుకు తెరవెనుక మరో భారీ కుట్ర జరుగుతోంది. వాటిని సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు కొద్ది రోజులుగా ఏకంగా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు, వారికిచ్చిన మాట కోసం ఆ 17 మంది ఎమ్మెల్యేలూ తమ శాసనసభ్యత్వాలను తృణప్రాయంగా పరిగణించడం, రాజీనామా కూడా చేయడం, వాటిని ఆమోదించకుండా ప్రభుత్వం వీలైనంతగా సాగదీయడం, చివరికి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ముప్పు తప్పదేమోననే ఆందోళనతో వారిపై వేటు వేయడం తెలిసిందే. కానీ రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తిరుపతితో కలిపి ఆ 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదుర్కోవడం అసాధ్యమేనని అధికార పెద్దలు పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. వాటి ఫలితాల ఆధారంగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ భారీ మార్పులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్‌కు ఒక్క చోటా గెలుపు అవకాశాల్లేవని సర్వేలో తేలిందని ఇటీవల ఒక మంత్రే అసెంబ్లీ లాబీల్లో బహిరంగంగా పేర్కొనడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో.. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో, వాటిని వీలైనంత కాలం పాటు వాయిదా వేయించే దిశగా అన్ని మార్గాల్లోనూ ఢిల్లీ పెద్దలపై రాష్ట్ర నేతలు ఒత్తిళ్లు పెంచారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

జగన్ ప్రభంజనంతో పాటు మరిన్ని ఇతర కారణాలను కూడా తమ వాదనకు మద్దతుగా వారు చూపుతున్నారు. భారీగా పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి తోడు విపరీతమైన కరెంటు కోతలు, అడ్డగోలుగా పెరిగిన పన్నులు, ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో ప్రభుత్వంపై జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాట, మద్యం సిండికేట్ల విషయమై పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సిగపట్లు ప్రజలకు వెగటు పుట్టించే స్థాయికి చేరాయి. వీటన్నింటినీ ఢిల్లీ పెద్దలకు నేతలు వివరించినట్టు సమాచారం. పరస్పరం కత్తులు నూరుకుంటున్న రాష్ట్ర పెద్దలు కూడా ఉప ఎన్నికలను అడ్డుకోవడంలో మాత్రం ఒక్కతాటిపై నడుస్తున్నారు! ‘‘పరిస్థితులేవీ మాకు అనుకూలంగా లేవు. అందుకే ఆగస్టు దాకా ఉప ఎన్నికలు జరక్కుండా చూడాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చాం. రాజకీయ పార్టీగా మా వ్యూహం మాకుంటుందిగా!’’ అని గురువారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నాయకుడొకరు వ్యాఖ్యానించారు! ‘అధికార యంత్రాంగం ఎలాగూ చేతిలోనే ఉంది. డబ్బుకూ కొదవ లేదు. మరికాస్త సమయం దొరికితే చాలని చూస్తున్నాం’ అని మరో నాయకుడన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు సిద్ధంగా లేమంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల నియమావళికి సంబంధించిన కొన్ని సాంకేతిక సాకులను అందులో పొందుపరిచిందంటున్నారు. కనీసం ఆగస్టు దాకా ఉప ఎన్నికలు వద్దని కోరినట్టు సమాచారం.

 

18 అసెంబ్లీ స్థానాల ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఇక నూకలు చెల్లినట్టేనని ఆ పార్టీ నేతలే ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే వాటిలో ఎక్కడా గెలిచే అవకాశాలు కన్పించడం లేదంటున్నారు. ‘‘ఇటీవల జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 18 స్థానాలకు వెంటనే ఎన్నికలు జరిగితే ఇంకేమైనా ఉందా! మొత్తం రాజకీయాలే తారుమారవుతాయి. అందుకే వాటిని వీలైనంతగా వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని సీనియర్ మంత్రి ఒకరు వివరించారు. ప్రధాన ప్రతిపక్షానికి కూడా ఈ విషయంలో రెండో అభిప్రాయమేదీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నెల్లూరు లోక్‌సభ స్థానం, 17 అసెంబ్లీ స్థానాలకు ఆర్నెల్ల గడువు ముగిసే ఆగస్టు చివరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవాల్సి ఉంది. కానీఅప్పటిదాకా వాటిని అడ్డుకుంటే ఆయా నియోజకవర్గాల్లో ఒక పథకం ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ పరిస్థితిని మెరుగు పరుస్తామని ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించారు. నిధులకు కొదవ లేదంటూ ఎంతగా ధైర్యం చెబుతున్నా పలు స్థానాల్లో పోటీకి అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది! దాంతో ఆ స్థానాల్లో అభివృద్ధి పనుల పేరిట కోట్లాది రూపాయలు విడుదల చేస్తూ కిరణ్ ప్రభుత్వం ఇప్పటికే పలు జీవోలు విడుదల చేయడం తెలిసిందే. నామినేషన్ పద్ధతిలో వాటన్నింటినీ పార్టీ నేతలకు అప్పగించడానికి దాదాపుగా రూ.70 కోట్ల దాకా నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇటీవలి కోవూరు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటుకు రూ.1,000 చొప్పున పంచినా మూడో స్థానానికి దిగజారడం తెలిసిందే. దాంతో ఈసారి అంతకు రెండింతలు ఖర్చు చేసైనా సరే, కొన్ని స్థానాలనైనా గెలుచుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు

 

Back to Top