చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైంది

పీలేరు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్‌.

వైయ‌స్ జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.

పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.

వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..

బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.

2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.

రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?

రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?

14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.

డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.

రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?

గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?

గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?

ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?

మీ బిడ్డ జగన్‌ రైతన్నకు అండగా నిలబడ్డాడు.

పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.

అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.

అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.

31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌.

ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్‌ అందిస్తున్నాం.

పెన్షన్‌ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.

రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.

 పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం.

అన్న‌మ‌య్య జిల్లా:  చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం  వైయస్.జగన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే..:

పీలేరు సిద్ధమా.. ఇంత మండుతున్న ఎండలో కూడా ఎండలును ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలు, ప్రేమానురాగాలు పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ... మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ మీ వైయ‌స్ జగన్ రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా  కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు. 

మీ జగన్ కు వేసే ఓటు పథకాలకు కొనసాగింపు...
మే 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక్క అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. మీ అందరితోనూ విజ్ఞప్తి చేస్తున్నాను. మే 13వ తారీఖు జరగబోతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రానున్న  5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయేవి. ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు.

బాబుకు ఓటేస్తే వదలబొమ్మాళీ అంటూ పసుపతి నిద్రలేస్తాడు.
 పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్లీ వదల బొమ్మాళీ వదల... అంటూ పసుపుపతి మళ్లీ నిద్ర లేస్తాడు. మీ రక్తం తాగేందుకు మళ్లీ మీ ప్రతి ఇంటి గడపా తడతాడు. 

ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోండి. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయపెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదల్ని గెలిపించడానికి విలువలకు, విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా.. 

ఈరోజున ఈ సభ ద్వారా నేను ఒక రైతును, ఒక పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మను ఉదాహరణగా తీసుకుని చంద్రబాబు ఎలాంటివాడో, అతని మాటలు నమ్మితే ఏమవుతుందో ఒక్కసారి గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా 2014 ఎన్నికలు గుర్తు ఉండే ఉంటుంది. ఎవరైనా కూడా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి. ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎందుకు ఓటు వేస్తారు? ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు, విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది. 

బాబును నమ్మి మోసపోయిన అన్నదాతలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు
ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఈ రెండు ఉదాహరణలు నేను చెబుతాను. ఆయన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా అక్కచెల్లెమ్మలు, రైతులు నష్టపోయారు.. అన్న రెండు ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను. అప్పట్లో 2014లో రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణ మాఫీ అని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి.. చివరికి రుణ మాఫీ కథ దేవుడెరుగు సున్నా వడ్డీని సైతం ఎగ్గొట్టిన పరిస్థితులు మన కళ్లారా చూశాం. ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూశాం. 

ఏనాడూ మేలు చేయని బాబును అన్నదాతలు నమ్ముతారా?
ఇదే చంద్రబాబు తాను 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏరోజైనా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా ఒక్క రూపాయి అయినా కూడా ఈ పెద్దమనిషి చంద్రబాబు రైతు భరోసాగా ఇచ్చాడా? మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికే జగన్ స్కీమైన రైతు భరోసాను ఈ పెద్దమనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్  కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్దమనిషి చెబుతుంటే రైతన్నలు నమ్ముతారా? అని అడుగుతున్నాను. 

ఆలోచన చేయమని అడుగుతున్నాను. తాను 14 ఏళ్లు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ఒక్కరోజూ ఒక్క రూపాయి కూడా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసాగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి ఈరోజు ఎన్నికలు వచ్చే సరికే జగన్ చేస్తున్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెబుతున్నాడంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్దమనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. 

చెప్పినదానికన్నా మిన్నగా మీ జగన్ సాయం
 మరో వంక మీ జగన్.. మీ బిడ్డ ఉన్నాడు. ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ.. రైతు భరోసాగా రూ.12,500 చొప్పున 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకూ రూ.50 వేలు ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ రూ.12,500 చెబితే దాన్ని ఏకంగా రూ.13,500 చేశాడు. నాలుగేళ్లు చెబితే ఏకంగా దాన్ని ఐదు సంవత్సరాలు చేశాడు. రూ.50 వేలు ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాల్లో ఏకంగా రూ.67,500 ఇచ్చాడు. తేడా గమనించమని కోరుతున్నాను. 

మరోవైపు రైతులకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన బాబు
ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు. తాను ఇస్తానన్న రైతుల రుణ మాఫీ ఎగ్గొట్టాడు. సున్నావడ్డీని ఎగ్గొట్టాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎగ్గొట్టాడు. రైతులను రోడ్డుపాలు చేశాడు. మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ. తేడా గమనించమని మీ అందరినీ కోరుతున్నాను. 

అన్నదాతలకు మరింత అండగా...
ఈరోజు మీ బిడ్డ మీ గర్వంగా తలెత్తుకుని మీ ముందు నిలబడి గతంలో మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా ఎక్కువ రూ.13,500 ఇచ్చాడు.  ఈసారి ఈ 5 సంవత్సరాలకు రూ.16,000 ప్రతి రైతన్నకూ ఇస్తాను, 5 సంవత్సరాల్లో రూ.80 వేలు రైతన్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధతతో, చిత్తశుద్ధితో ధైర్యంగా మీ ముందుకు వచ్చి నిలబడి ఫలానిది చేశాను, ఫలానిది ఇంకా గొప్పగా చేయబోతాను అని నిబద్ధతతో చెబుతున్నాడు. మరి మాట తప్పకుండా కచ్చితంగా ఇచ్చే మీ జగన్ ను నమ్మాలా? లేక ఇస్తానని మోసం చేసే చంద్రబాబు నాయుడును నమ్మాలా? 

ఇక అక్కచెల్లెమ్మల విషయానికి వద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి ఏకంగా రూ.14,205 కోట్ల డ్వాక్రా, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని ఈ పెద్దమనిషి చంద్రబాబు మాట ఇచ్చి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని ఈ చంద్రబాబు.. పైపెచ్చు సున్నా వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి పూర్తిగా ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు ఇలాంటి వాగ్దానాలే అక్కచెల్లెమ్మలను మోసం చేసేందుకు మరో పది తన మేనిఫెస్టోలో తాను పెట్టి చెప్పి, ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ హామీలన్నీ కూడా అక్కచెల్లెమ్మలను మోసం చేస్తూ నడిరోడ్డుమీద నిలబెట్టాడు. 

నేను ఈరోజు అడుగుతున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి మహాక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు వేస్తానని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను అడుగుతున్నాను. ఎంత మందికి పాతికవేల రూపాయలు డిపాజిట్ వేశాడు? మరో అడుగు ముందుకు వేస్తూ గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తానన్నాడు. నేను అడుగుతున్నాను. ఎంత మంది గర్భిణీ స్త్రీలకు ఇక్కడ రూ.10 వేలు ఇచ్చాడు? 

బిడ్డ పెరిగి స్కూలుకు వెళ్తుంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్దమనిషి. మరి ఎంత మందికి సైకిల్లు ఇచ్చాడు అని అడుగుతున్నాను. అంతటితో ఆగిపోలేదు. బిడ్డల్ని పెంచే అమ్మలకు గ్యాస్ సిలిండర్ కు నెలకు రూ.100 చొప్పున ఏడాదికి రూ.1200 ఐదేళ్లలో రూ.6,000 సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి ఎంత మందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఆయన ఇచ్చాడు? 

అక్కచెల్లెమ్మలను రోడ్డున నిలబెట్టిన చంద్రబాబు.
బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని 2014లో అధికారంలోకి రాగానే ఇలా విడిపించేస్తాను అని చెప్పి ఆశలు చూపించాడు ఈ చంద్రబాబు. నేను అడుగుతున్నాను. ఎంతమంది అక్కచెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకుల్లో నుంచి ఈయన విడిపించాడు? నేను అడుగుతున్నాను. 2014లో ఈ పెద్దమనిషి మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. ప్రతి మహిళకూ స్మార్ట్ ఫోన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. నేను అడుగుతున్నాను. ఎంత మంది అక్కచెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు? ఇందులో ఏ ఒక్కటీ కూడా చేయకుండా బాబు కలిగించిన నష్టం ప్రతి అక్కచెల్లెమ్మకూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు వల్ల నష్టపోయి నా అక్కచెల్లెమ్మలందరూ కూడా రోడ్డున పడిన పరిస్థితులు 2014లో ఆయన మాట నమ్మి 2014 నుంచి 2019 వరకు సాగిన ఆయన పాలనలో జరిగిన నష్టం అని ఈ సందర్భంగా చెబుతున్నాను. 

మీ బిడ్డ హయాంలో దేశంలోనే అగ్రగామిగా అక్కచెల్లెమ్మలు.
అదే మీ బిడ్డను మీ జగన్ ను చూడండి. నా అక్కచెల్లెమ్మలకు ఏం చేశాడు అంటే.. మీ జగన్, మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని చెబుతాడు. ఎన్నికల ప్రణాళికలో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ ప్రతిదీ కూడా నా అక్కచెల్లెమ్మలకు చేశాను అని మీ బిడ్డ కాలర్ ఎగరేసుకుని చెబుతున్నాడు. 

అక్కచెల్లెమ్మలకు మీ బిడ్డ చేసిన మంచేమిటిఅంటే 18 శాతం ఓవర్ డ్యూస్ గా ఉన్న ఎన్‌పీఏలుగా ఉన్న నా అక్కచెల్లెమ్మల గ్రూపు సంఘాలన్నీ అప్పట్లో సీ గ్రేడు, డీ గ్రేడుగా దిగజారిపోయిన పొదుపు సంఘాలన్నీ మళ్లీ ఆ అక్కచెల్లెమ్మలకు, ఆ డ్వాక్రా సంఘాలకు మళ్లీ ఊతం వచ్చి ఆ సంఘాలు ఈరోజు దేశంలోనే నంబర్ వన్ గా ఈరోజు నిలబడ్డాయి. లోన్ రీ పేమెంట్ ఏకంగా 99.7 శాతానికి చేరి ఈరోజు నా అక్కచెల్లెమ్మలు దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు అంటే తేడా గమనించమని ఒక్కసారి అడుగుతున్నాను. అప్పట్లో సీ గ్రేడు, డీ గ్రేడుగా దిగజారిపోయిన అక్కచెల్లెమ్మలు ఈ రోజు ఏ గ్రేడు, బీ గ్రేడు సంఘాలుగా ఈరోజు ఉన్నాయంటే తేడా గమనించమని అడుగుతున్నాను. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, వినని విధంగా, చూడని విధంగా నా అక్కచెల్లెమ్మల కోసం ఈ 58 నెలల కాలంలో మీ జగన్, మీ బిడ్డ ఓ ఆసరాతోపాటు, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, వారి పిల్లల చదువులకు తోడుగా ఓ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఓ అమ్మ ఒడి అందించాం. 

నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఎప్పుడూ కూడా ఎవరూ చూడని విధంగా, ఆలోచన కూడా చేయని విధంగా వారందరికీ మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు నా అక్కచెల్లెమ్మలకు చట్టం చేసి మరీ చేసింది ఎప్పుడు అంటే మీ బిడ్డ హయాంలోనే అని గర్వంగా ఈ సందర్భంగా చెబుతున్నాను. 

నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా వారి ఫోన్లోనే ఈరోజు దిశ యాప్, వారి గ్రామంలోనే ఈరోజు మహిళా పోలీస్. ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ కూడా జరిగాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా అని ఈ సందర్భంగా మీ బిడ్డ తలెత్తుకుని చెబుతాడు. కాబట్టే ఈరోజు మీ బిడ్డ గర్వంగా గత మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పాము, ఇవన్నీ చేశాము అని తలెత్తుకుని చెబుతూ మళ్లీ ఇప్పుడు ఇచ్చిన ఈ మేనిఫెస్టో ఈ 5 సంవత్సరాలకు సంబంధించి అమ్మ ఒడిని గతంలో రూ.15 వేలు ఇచ్చాం. ఇప్పుడు దాన్ని రూ.17 వేలు చేస్తాం అని గర్వంగా చెబుతున్నాడు. 

అవ్వాతాతలకు, వితంతువులకు అందుతున్న పెన్షన్.. ఇంటికే రూ.3 వేలు ఇస్తూ ఇంటకే వెళ్లి ఇవ్వడం మొదలయ్యింది ఎప్పుడంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగిందని గర్వంగా చెబుతున్నాను.  ఆ అవ్వాతాతల పెన్షన్ ను కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పట్లో కేవలం రూ.1000 పెన్షన్ ఉంటే ఆ వెయ్యిని రూ.3 వేలు చేసింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాడు. ఆ చేసిన రూ.3000ను రూ.3500కు మీ బిడ్డ పెంచుకుంటూ పోతామని మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని చెబుతున్నాడు. జనవరి 2028 నుంచి రూ.3250, జనవరి 2029కల్లా దాన్ని రూ.3500కు మీ బిడ్డ తీసుకుని పోతాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

 పెన్షన్ల విషయంలో కుట్రలను గమనించండి 
పెన్షన్ల విషయంలో జరుగుతున్న కుట్రలను ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా. మరి ఏరోజైనా ఒక్క రోజైనా ఆ అవ్వాతాతల బాధలు,కష్టాలను ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ఏరోజైనా పట్టించుకున్నాడా? ఏరోజైనా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల పెన్షన్ వారి ఇంటికే పంపించాడా? 

ఇంటి వద్దకే పెన్షన్ ఆపించిన దుర్మార్గుడు చంద్రబాబు.
మరి ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన వెంటనే అవ్వాతాతలకు గత 56 నెలలుగా ఆ అవ్వాతాతలకు పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే సూర్యోదయానికన్నా ముందే అది ఆదివారమైనా సెలవుదినమైనా ఒకటో తారీఖకు వచ్చే సరికే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్లు వెళ్తున్నారు అవ్వాతాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బులు చేతిలో పెడుతున్నారు. ఇది జరిగింది కేవలం ఈ 56 నెలల మీ బిడ్డ పాలనలో కాదా? అనిఅడుగుతున్నాను. ఈరోజు ఎన్నికలు వచ్చే సరికే మీ బిడ్డకు ఎక్కడ మంచి పేరు వస్తోందో అని చెప్పి గత రెండు నెలలుగా ఈ అవ్వాతాతలకు ఇంటి వద్దకే అందే పెన్షన్ ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా? అని అడుగుతున్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో. 

తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేశ్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కు లెటర్ రాయించి ఇంటికే వస్తున్న ఆ పెన్షన్ ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా? అని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. ఈరోజు ఆ పెన్షన్ ను ఆపి, మళ్లీ అంత వెధవ పని చేసినందుకు ఆ అవ్వాతాతలందరూ కూడా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని తెలుసుకుని ఇప్పుడు మళ్లీ ఏం చేస్తాడు? మళ్లీ ఆ చేసిన అన్యాయాన్ని కూడా ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదకు తోయాలని కుట్రలు చేస్తుంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని మిమ్మల్ని కోరుతున్నాను.

ఈరోజు మీ అందరితో కూడా విన్నవించుకుంటున్నాను. ఇవాళ జరుగుతున్న ప్రతి పథకం ఒక చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ పథకం కావచ్చు.. ఇంకా అనేక పథకాలు ఏవైతే కొనసాగుతున్నాయో ఇవన్నీ కూడా వచ్చే ఐదు సంవత్సరాలు మళ్లీ కొనసాగే కార్యక్రమం జరగాలి అంటే మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా ఒకటే చెబుతున్నాను. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కానే కాదు. ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగేందుకు మీరు వేసే ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 

చంద్రబాబు మేనిఫెస్టో- మాయలు.
ఇక చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఈయన ఏం చెప్పాడో, 2014 నుంచి 2019 మధ్య ఈయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం, ఎంతటి దగా చేశాడో ఒక్కసారి చూద్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ (పాంప్లెట్ చూపుతూ). అక్కా, అన్నా, ఇది గుర్తుందా? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకాలు పెట్టి కూటమిలో వీళ్ల ముగ్గురి ఫొటోలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఆయన సంతకం కూడా కనిపిస్తోందా? 

ముఖ్యమైన హామీలు ఇవీ.. ఇప్పుడు ఎలా చెబుతున్నాడో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అనీ.. అప్పుడు ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇవన్నీ తాను సంతకం పెట్టి ముగ్గురి ఫొటోలతో ఈ పాంప్లెట్ మీ ఇంటింటికీ పంపించాడు. ఈ పాంప్లెట్ లో ఆయన ఏం రాశాడో మీ అందరికీ నేను చదివి వినిపిస్తాను. ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని మిమ్మల్నే అడుగుతున్నాను. ముందుకు పొమ్మంటారా. 

రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ఇందులో చెప్పిన రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలు మొదటి సంతకంతోనే రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు.. కనీసం ఒక్క రూపాయి అయినా జరిగిందా? ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. జరిగిందా? ఒక్క రూపాయి అయినా? ఇంటింటికీ ఒక ఉద్యోగం, ఇవ్వలేకపోతే నెల నెలా రూ.2 వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు.. నెలకు రూ.2 వేల చొప్పున లక్షా 20 వేల రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా వచ్చిందా? ఇంకా ముందుకు పోతే అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇళ్లు అని రాశాడు. మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? 

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా? ఉమెన్ ప్రొటెక్ష్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? మీ పీలేరులో కనిపిస్తోందా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మరి ఇలాంటి వారిని నమ్మచ్చా అని అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా? 

పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈరోజు ఇలాంటి వాళ్లు ఏ స్థాయికి దిగజారిపోయారు అంటే ఇలాంటి వాళ్లు మళ్లీ ముగ్గురూ కలిసి ఈరోజు మళ్లీ మేనిఫెస్టో అంటూ మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. మళ్లీ ఈరోజు ఏమంటున్నాడు. సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ సిక్స్ అంటున్నారు, సూపర్ సెవెన్ అంటున్నారు. నమ్ముతారా? ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఏమక్కా నమ్ముతారా? ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతున్నాను. 

టీడీపీ మేనిఫెస్టోలో మోడీ ఫోటో వద్దన్న బీజేపీ.
చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు సాధ్యం కాని హామీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఈ 2014లో ఇదే చంద్రబాబు, ఆయన పక్కన మోడీగారు, ఆయన పక్కన దత్తపుత్రడి ఫొటో పెట్టుకుని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అంటే ఈరోజు ఈ పెద్దమనిషి చంద్రబాబు మేనిఫెస్టో అంటే డిక్లేర్ చేశాడు. ఏమైందో తెలుసా? పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫొటోనే పెట్టుకో. మోడీ ఫొటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవద్దు. మేము ఒప్పుకోము అంటున్నారు.

అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతోందంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురి ఫొటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడు అంటే ఒక్కసారి గమనించండి. ఆయన ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేయడం కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెబుతున్నాను. 

లంచాలు, వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటేయండి.
మళ్లీ వాలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్లు మెరుగు పడాలన్నా.. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు.. ఒక్క సీటు కూడా తగ్గేదానికే వీల్లేదు. సిద్ధమేనా? 

మన గుర్తు అక్కా మన గుర్తు అక్కా ఇది. అన్నా మన గుర్తు ఇది. పెద్దమ్మా ఇది మన గుర్తు. అక్కడున్న అక్కలూ మన గుర్తు ఫ్యాను అక్కా. అన్నా మన గుర్తు ఫ్యాను. తమ్మడూ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి. 

మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీ తరఫున నిలబడుతున్న అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో ప్రార్థిస్తున్నాను. 

మండుతున్న ఎండను ఏ మాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తున్న మీ అందరికీ మరొక్కసారి చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని తెలియజేస్తూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
 

Back to Top