మంత్రులు చాలా అసహనంగా ఉన్నారు.
చాలా కోపంతో రగిలిపోతున్నారు.
ఆ కోపంలోనే...మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
"జగన్ మోహన్ రెడ్డి ఎవ్వరినడిగి ఢిల్లీ వెళ్లారో చెప్పాలి.
కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ఏదో వ్యక్తిగత అజెండాతోనే ఢిల్లీ వెళ్లారు." అని మంత్రులు ఆవేశంగా నిప్పులు చెరిగారు.
ఓ సీనియర్ జర్నలిస్టు మైకందుకుని... జగన్ మోహన్ రెడ్డి ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికని ఢిల్లీ వెళ్లారట కదండీ" అని అన్నారు.
మంత్రులు పళ్లు పట పట కొరికి..పెళ్లికెళ్తోన్నట్లు చివరి నిముషం దాకా కూడా ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచినట్లు? ఇందులో ఏదో మతలబు ఉంది" అని కొర కొరా చూస్తూ అన్నారు మంత్రి వర్యులు.
ఇంకో జర్నలిస్టు లేచి..ఆయన ఢిల్లీ వెళ్తే మీకేంటండీ ఉలికిపాటు? మీకేం నష్టం? ఆయన ఎక్కడికి వెళ్లినా టిడిపి నేతలకు చెప్పి వెళ్లాలా ఏంటి? అని నిలదీశారు.
దాంతో మంత్రిగారికి మరింత మండుకొచ్చింది.
"ఏం జోకులుగా ఉందా? జోకులేసినా..కార్టూన్లు వేసినా ఏదో ఓ కేసు పెట్టి బొక్కలోకి తోయించేస్తాం జాగ్రత్త!" అని వార్నింగ్ ఇచ్చారు.
మరో జర్నలిస్టు కల్పించుకుని " అయ్యా ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కార్టూనిస్టులను అరెస్ట్ చేసి లోపలేశారు. ఇక తర్వాత మీకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారిని కూడా లోపలేస్తారా ఏంటి? అని ప్రశ్నించారు.
"అందులో మొహమాటాలే లేవు. మా గురించి వ్యతిరేకంగా రాసినా..కార్టూన్లు వేసినా.. ఎవరో వేసిన కార్టూన్లు చూసిన నవ్వినా..నవ్విన వారిని చూసి చప్పట్లు కొట్టినా..అందరినీ బొక్కలో వేసేస్తాం ఏంటనుకుంటున్నారో ఏంటో? అని మంత్రిగారు తమకే చేతనైనంత సున్నితంగా అన్నారు.
"అసలింతకీ జగన్ మోహన్ రెడ్డి పై మీకు అంత కక్షేంటి? ఆయనంటే అంత భయమేంటి? ఎందుకిలా వ్యవహరిస్తున్నారు మీరంతా? అని జర్నలిస్టులు నిలదీశారు.
మంత్రులు జేబులోంచి కర్చీఫ్ తీసి నుదుటిమీది చెమట తుడుచుకుని...
"ఏం చెప్పమంటారయ్యా బాబూ...రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా మా పాలనపై వ్యతిరేకత కనిపిస్తోంది.
ఇంటెలిజెన్స్ రిపోర్టులోనూ జనం మాపై కోపంగా ఉన్నారని తేలింది. ఓ పక్క మామీద కోపంగా ఉన్న జనం కాస్తా..ఆ జగన్ మోహన్ రెడ్డికి తమ కష్టనష్టాలు చెప్పుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డే తమ నాయకుడన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిన్నటికి నిన్న మిర్చి రైతులకు టెంకి జెల్ల కొట్టి మార్కెట్ యార్డుకు సెలవిచ్చాం. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా జగన్ మోహన్ రెడ్డి రైతుల తరపున పోరాడతానని శపథం చేశారు.రాజధాని నగర నిర్మాణంలో ఏవో అవక తవకలు జరిగాయని చెప్పి మా పరువును తీసి పారేశారు. అసలే జపాన్ నుంచి వచ్చిన మాకీ ఇంటర్నేషనల్ లెవెల్లో మా చంద్రబాబు నాయుడి పరువు తీశారు. ఇలా వరసగా మా పరువు పోతూ ఉంటే ఒళ్లు మండుకురాదా ఏంటి? అని మంత్రులు నిలదీశారు.
మీడియా మిత్రులు మంత్రుల కేసి జాలిగా చూసి... అది సరే కానీ చంద్రబాబు నాయుడు అమెరికా నుండి వస్తూ ఢిల్లీలో దిగి ఆరుగంటల పాటు ఎవరికీ దొరక్కుండా అత్యంత సీక్రెట్ గా ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారో చెప్పండి అని అడిగారు.
మంత్రులు ఏం చెప్పలేక..మాకు మాత్రం ఏం తెలుస్తుందండీ...మీకు తెలీందేముంది. ఆయన మాక్కూడా చెప్పరు. బహుశా ఏవో అర్జంట్ పనులమీద తిరిగి ఉంటారు. అన్నారు.
అవునవును ఓటుకు కోట్లు కేసు వంటి అర్జంట్ విషయాలు చాలానే ఉంటాయి కదా అని నవ్వారు.
మంత్రులు మౌనంగా ఉండిపోయారు.
-------------------------
-కవికాకి
------------------------