అసెంబ్లీ: రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డకు వెలకట్ట లేని ఆస్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే అని సగర్వంగా చెప్పుకుంటున్నామని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసినన్ని పథకాలు కానీ, మహిళలకు ఇస్తున్న రాజకీయ పదవులు కానీ, రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు చరిత్రలో ఎవరైనా అమలు చేశారా..? నిత్యం జగనన్నను విమర్శించే ప్రతిపక్షాలు సైతం చూపించగలరా అని సవాల్ విసిరారు. మహిళా సాధికారతపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పాల్గొని మాట్లాడారు. ‘‘భూమి పుట్టిన తరువాత అక్కచెల్లెమ్మలకు ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే ఉంది. రక్తం పంచిన అమ్మనాన్నలు ఇవ్వలేకపోయినా, రాజన్న రక్తం పంచుకున్న జగనన్న మాత్రం రాష్ట్రంలోని ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఆస్తిని ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డకు వెలకట్ట లేని ఆస్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ప్రతి మహిళ జీవితంలో రెండు కోరుకుంటుంది. మరణం అంటూ వస్తే భర్త ఒడిలో సుమంగళిగా చనిపోవాలని, జీవితం అంటూ ఉంటే సొంత ఇంటిలో బతకాలని అనుకుంటుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 28 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్. ప్రతి అక్కచెల్లెమ్మ కూడా మా జగనన్న సొంతింటి కలను నిజం చేశారని సంబరాలు చేసుకుంటున్నారు. కడుపులో పుట్టిన బిడ్డ నేల మీద అడుగు పెట్టనప్పటి నుంచి అడుగడుగునా ఆ బిడ్డల ఎదుగుదల కోసం, తాపత్రయపడే తల్లుల కోసం వారి కండరాల్లో కరిగిపోయిన శక్తి గుర్తించి, వారి కళ్లలో కన్నీళ్లను చూసి వారికి అండగా నిలిచేందుకు వైయస్‌ఆర్ చేయూతను తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ మహిళలందరికీ 45 ఏళ్లు పైబడిన అక్కచెల్లెమ్మలందరికీ చేయూతనందించిన ఏకైక ప్రభుత్వం వైయస్ జగన్ ప్రభుత్వం. చేయూత పేదింటి మహిళల తలరాతలు మారుస్తుంది. గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన మహిళగా చెబుతున్నా.. గిరిజన మహిళలకు ఇన్ని పదవులు ఇచ్చిన నాయకుడు, ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి, గిరిజన మహిళలకు ఆసరా ఇచ్చిన అన్నను, చేయూతను ఇచ్చిన అండను, గిరిజన మహిళలకు విద్యా దీవెనతో దీవించిన ధైర్యాన్ని, గిరిజన మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇలవేల్పు, సొంతింటి కలను నెరవేర్చిన కార్యదక్షుడిని మేము చూడలేదు. మహిళా సాధికారత యజ్ఞం ఇకమీదట ఇలాగే కొనసాగాలని, దేవతలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ యజ్ఞాన్ని అడ్డుకునే రాక్షసులకు ఇప్పటికే శిక్షలు పడటం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో కూడా ఏ దుష్టశక్తి జగనన్న మహిళా సాధికార సంకల్పానికి అడ్డు రాకుండా చూడాలని కోరుకుంటున్నాను’ అని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు.