నంద్యాల: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం రాజ్యమేలుతుందని... నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ప్రతిపక్ష నాయకులపై దాడులు, అక్రమ కేసులు బనాయించిన కూటమి నేతలు, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపైనా ఆంబోతుల్లా రెచ్చిపోతూ, విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నంద్యాలలోని శ్రీశైలం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మద్యం మత్తులో శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై క్రూరంగా దాడి చేసి, కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారశైలిని తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే.. శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వంలో రోజు, రోజుకీ ఎమ్మెల్యేల ఆగడాలు శృతిమంచిపోతున్నాయి. . నంద్యాల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో విధినిర్వహణలో ఉన్న అటవీశాఖ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డం దారుణం. రాష్ట్రమంతా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యాలు గురించి కోడై కూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ వర్గాలకు చెందిన అటవీశాఖ అధికారులపై తప్పతాగి చిన్నారుట్ల వద్ద విచ్చలవిడిగా దాడిచేశారు. అటవీ శాఖకు చెందిన డిప్యూటీ రేంజర్ ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోందని.. ప్రజలను అలెర్ట్ చేయడానికి సైరన్ మోగిస్తుంటే వారిపై భౌతిక దాడికి దిగారు. కులం పేరుతో దుర్భాషలాడుతూ పదిగంటల నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిపించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవి గెస్ట్ హౌస్ కు తీసుకుని వెళ్లి.. అక్కడ ఎస్టీ కులానికి చెందిన రాముల నాయక్, చెంచు కులానికి చెందిన గురవయ్యను దారుణంగా హింసించారు. అనంతరం సభ్యసమాజం తలదించుకునేలా వారిని శ్రీశైలం రహదారుల మీద తిప్పారు. ప్రభుత్వ అధికారుల మీద ఈ రకమైన దాడికి దిగిన సంఘటన గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సైతం ఈ దురాగతంపై వార్తలు వచ్చాయి.ఒక ప్రజా నాయకుడిగా ప్రజలకు ఏ రకమైన మెసేజ్ పంపించినట్లు ? అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. ముఖ్యమంత్రి సహా అందరూ నటిస్తున్నారు. బాధితుల తరపున ఎస్టీ కుల సంఘాల ప్రతినిధులు ధర్నా చేస్తే.. కంటి తుడుపు చర్యగా కేసు నమోదు చేశారు. తప్పు చేస్తే తోలుతీస్తా, కఠిన చర్యలు అంటూ మాట్లాడే చంద్రబాబు.. ఎమ్మెల్యేను కనీసం పిలిచి మందలించిన పాపాన పోలేదు. సనాతన ధర్మం అంటూ పదే, పదే చెప్పే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఏం స్పందించలేదు. ఎమ్మెల్యేలు రాష్ట్రమంతటా ఆంబోతుల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే మీరు కళ్లు మూసుకున్నారా చంద్రబాబు గారూ ? మీ పార్టీలో అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తూ తప్పులు చేస్తున్న మీ ఎమ్మెల్యేల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయండి లోకేష్ గారూ? మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ప్రజలు, దళితుల తరపున మేం కోరేది ఒక్కటే, బుడ్డా రాజశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే ప్రజలకు మీపై నమ్మకం కలుగుతుంది చంద్రబాబు గారూ ?. మీ శాఖలో పనిచేస్తున్న అధికారులపై దాడి చేస్తే... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు స్పందించడం లేదు. మీ శాఖలో అధికారులకే న్యాయం చేయలేని మీరు రాష్ట్రానికేం న్యాయం చేస్తారు. కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీశాఖ అధికారులు గురవయ్య, రాములనాయక్, కరీముల్లాల మీద దాడి చేయడంతోపాటు వారిని కిడ్నాప్ చేసి మంత్రి రవికుమార్ గెస్ట్ హౌస్ లో బంధించి హింసించడం అత్యంత దుర్మార్గం. ఈ ఘటనకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేయాలని అటవీశాఖ యూనియన్ నేతలు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేవలం నామమాత్రపు కేసులు నమోదు చేసి, చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలో కేవలం వైయస్ఆర్‌సీపీ నేతలమీదే కాకుండా... ప్రభుత్వ ఉద్యోగులు, అటవీ, సచివాలయ ఉద్యోగుల మీద కూడా దాడి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు... భూపాల్ రెడ్డి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు చోద్యం చూస్తూ.. దాడి చేసిన వ్యక్తినే బ్రతిమాలుతున్న దుస్థితి. దాడి చేసి ఇన్ని రోజులైనా ఇంతవరకు కానిస్టేబుల్ పై దాడి చేసిన భూపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నేతలు కండకావరంతో చేస్తున్న దాడులివి. చంద్రబాబు టీడీపీ నేతలను ఊళ్ల మీదకు విచ్చలవిడిగా విడిచిపెట్టాడు. ఇటీవల రాయచోటిలో వైయస్ఆర్‌సీపీకి చెందిన సుదర్శనరెడ్డి అనే న్యాయవాది ఎంపీపీగా ఉన్న తన తల్లి గదిలో కూర్చుని ఉండగా.. అక్కడ నుంచి వెళ్లిపొమ్మని ఎంపీడీఓ ఫిర్యాదు చేస్తే.. పోలీసులు సుదర్శనరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అంత చిన్న విషయానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హెలికాప్టర్ లో వచ్చి ఎంపీడీఓను పరామర్శించారు. మరి ఇవాల ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మీ శాఖ ఉద్యోగులపై కూటమి పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎందుకు మాట్లాడ్డం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఏ అరాచకం చేయినా ఫర్వాలేదా ? అధికార పార్టీ నేతల దాడులతో పోలీసులు తమను తాము కాపాడుకోలేకపోతున్నారు. ఇక ప్రజలనేం కాపాడుతారు ? ఈ నేపధ్యంలో అటవీశాఖ ఉద్యోగులపై దాడి చేసిన ఎమ్మెల్యేపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో అధికారుల మీద దాడి చేయకుండా కఠినమైన చట్టం తీసుకునిరావాలి. ఇషాక్ బాషా, ఎమ్మెల్సీ. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్నది సుపరిపాలన కాదు, స్వపరిపాలన. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. శ్రీశైలంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ప్రభుత్వ వాహనాన్ని స్వాధీనంచేసుకుని, అటవీశాఖ సిబ్బందిపై అత్యంత క్రూరంగా దాడిచేయడం సమంజసం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ప్రతినిధులు ఇదే తరహాలో అరాచకాలు చేస్తున్నారు. గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళలపై ఏ రకంగా వేధిస్తున్నారో రాష్ట్రమంతా చూస్తోంది. చంద్రబాబు పైకి మాత్రం తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు కానీ వాస్తవంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎమ్మెల్యేలు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఆవు చేలో మేస్తూ దూడ గట్టున మేస్తుందా అన్న చందాన చంద్రబాబు తరహాలో ఆ పార్టీ నేతలు కూడా దోచుకోవడం ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మీకు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎవరు వ్యతిరేకంగా ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. శ్రీకాకుళంలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ ను వేధించడం, గుంటూరు ఎమ్మెల్యే టీడీపీ పార్టీ మహిళా కార్యకర్తనే వేధించడం చూశాం. తాజాగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. అటవీశాఖ అధికారులు తప్పు చేస్తే.. వారిని శిక్షించడానికి చట్టాలున్నాయని... అలా కాకుండా వారిపై దాడిచేసి, రాత్రంతా వారిని కిడ్నాప్ చేయడం అత్యంత దుర్మార్గం. పోలీసు అధికార్లు సక్రమంగా చట్టానికి లోబడి పనిచేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రేషన్ బియ్యం అమ్మకాలు యధేచ్చగా జరుగుతున్నాయని.. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దుర్భరంగా ఉంది. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. యూరియా సహా ఎరువులు దొరకడం లేదు. కేవలం ప్రజలను మభ్యపెట్టడం తప్ప పాలనను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికొదిలేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అధికారం మారితే మీ పరిస్థితి ఏంటన్నది ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఏం చేశామో అదే రేపు తిరిగి వస్తుంది. అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై కచ్చితంగా చట్టపరమై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.