విశాఖపట్నం: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధిత కుటుంబాలను కూటమి నేతలు ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. వైయస్ఆర్‌సీపీ స్పందిస్తేనే కూటమి నేతలు బాధిత కుటుంబాల వద్దకు వెళ్తున్నారన్నారు. ‘‘రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేదని రోజూ రుజువవుతుంది. రాష్ట్రంలో 120కి పైగా ఘటనలు మహిళలపై జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే మహిళలపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు జిల్లాలోనే మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. తిరుపతిలో మరో బాలికపై అత్యాచారం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల తల్లితండ్రులు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఆయన ఎందుకు స్పందించడం లేదు?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నలు గుప్పించారు. మద్యం, ఇసుక మీద పెట్టిన చర్చ మహిళల భద్రతపై ఎందుకు పెట్టరు..?. వైయస్ఆర్‌సీపీ నేతలు బాధితుల పరామర్శకు వెళ్తే.. ప్రభుత్వం స్పందిస్తుంది. గంజాయి నిర్మూలిస్తామని చెప్పే హోం మంత్రి ఏమి మాట్లాడటం లేదు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే.. హోం మంత్రి ఏమి చేస్తున్నట్టు.. ఏమైనా అంటే నేను లాటీ పట్టుకొని తిరగాలా అని హోం మంత్రి అడుగుతారు. చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి చేతకాని పరిపాలన చేస్తున్నారు. ఆడపిల్లలు ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.. హోం మంత్రి సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడికి ఉన్న మానవత్వం ఈ ప్రభుత్వానికి లేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.