నెల్లూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పరాకాష్టకు చేరిందని, ఏడాది పాలనకే కూటమి ప్రభుత్వానికి ప్రజలు పాడెకట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సెంట్రల్ జైల్ లో అక్రమంగా నమోదు చేసిన మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులను బనాయించి వైయస్ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక అరాచక పాలనను సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే గత ప్రభుత్వంలో మేం కూడా చేసి ఉంటే చంద్రబాబు మూడునెలలకే జైలుకు వెళ్ళేవారని అన్నారు. అధికారం ఉందని ఇప్పుడు నమోదు చేస్తున్న అక్రమకేసుల పర్యవసానాలు తరువాత తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లు గ్రహించాలని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పర్యవసానాలు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెడ్ బుక్ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారు. నిజంగా తప్పు చేసి ఉంటే, ఆధారాలతో అరెస్టు చేసినా అర్థముంటుంది. చట్టప్రకారం నడుచుకుంటే మేము కూడా అభ్యంతర పెట్టేది ఉండదు. కానీ కల్పిత కథలతో పాత్రలను సృష్టించి ఎల్లో మీడియాలో వారం పది రోజులు అసత్య కథనాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఎవరెవరినో ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి వారి నుంచి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని మా నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి జనం మెదళ్లలోకి విషం ఎక్కిస్తున్నారు. ఏడాది పాలనతో చెడిపోయిన వ్యవస్థను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకుండా విశృంఖల చర్యలతో రెచ్చిపోతే ఏం జరుగుతుందో ఇప్పటికే ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు. కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రజల వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేసి, వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వైయస్ఆర్‌సీపీ లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన.వైయస్ఆర్‌సీపీని ఎంత తొక్కాలని చూస్తే అంత బలంగా తిరిగి పైకి లేస్తుంది. రెండు మూడు నెలలు జైల్లో పెట్టడం మినహా మమ్మల్ని ఏం చేయలేరు. ఆ విధంగా మా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఏడాది కాలంలోనే ప్రజల మద్దతు కోల్పోయాయి. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఎవరూ నోరెత్తకుండా మా నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు దిగుతున్నారు. ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఆలోచనతో వాటిని చూపించి సమాజంలో భయోత్పాత వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజలను కూడా భయపెట్టడానికి ప్రసార సాధనాలను ఎక్కువగా వాడుతున్నారు. దీని ముసుగులో విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఖాకీలే గూండాలుగా ప్రవర్తిస్తున్నారు ఇలా ప్రతీకార రాజకీయాలు చేయడం వల్ల ఏదో సాధించామని కూటమి నాయకులు ఫీలవుతుంటే అంతకన్నా అవివేకం ఉండదు. పోలీస్ వ్యవస్థ గాడితప్పితే ఎలా ఉంటుందనే ఫలితాలు బీహార్‌లోనో, ఎమర్జెన్సీ టైములోనో చూశాం. ఈ ఏడాది పాలనతో దాన్ని రుచిచూపిస్తున్నారు. చంద్రబాబు నాటిన ఈ విషబీజాలకు రేపు రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో ఆయన ఊహించడం లేదు. ఈ పరిస్థితుల నుంచి వెనక్కి వచ్చే ప్రసక్తే ఉండదు. చంద్రబాబు సృష్టించిన ఈ ఆటవిక పాలన తాలూక ప్రభావం భవిష్యత్తులో ఇంకా భయంకరంగా ఉంటుందని వారు గుర్తించలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బరితెగించి ప్రవర్తించారు. ఆఖరుకి తెనాలిలో పోలీసులే నడిరోడ్డు మీద బహిరంగంగా యువకులను లాఠీలతో కొట్టే పరిస్థితికి తెచ్చారు. బూటు కాళ్లతో యువకుల కాళ్ల మీద నిలబడి లాఠీలు విరిగేలా కొట్టడం సినిమాల్లోనే చూస్తాం. ఇలాంటి ఆటవిక ఘటనలు ఒళ్లు గగుర్బొడిచేలా చేస్తాయి. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలే కానీ ఇలా రాక్షసంగా హింసించడాన్ని ఎవరూ అంగీకరించరు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగ ఫలితమే. కూటమి పాలనలో నిన్న నెల్లూరు జిల్లాలో బహిరంగంగా నగ్న నృత్యాలు నిర్వహించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిన కారణంగానే నిత్యం రాష్ట్రం ఏదొక మూలన ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఖాకీలే గూండాలుగా ప్రవర్తిస్తున్నారు. డీజీ స్థాయి అధికారులనూ వదలడం లేదు చంద్రబాబు మీద పెట్టిన కేసుల్లోనూ ఆధారాలున్నాయి. సమగ్ర విచారణ తర్వాతే, ఆధారాలతో చంద్రబాబుని అరెస్టు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఎప్పుడో పదేళ్ల కిందట జరిగిన సంఘటనలు తవ్వి తీసుకొచ్చి అరెస్టులు చేస్తున్నారు. పదేళ్ల క్రితం ఏదో అన్నాడని పోసాని కృష్ణ మురళి మీద కేసు పెట్టి జైలుకు పంపారు. కేసుల్లో ఇరుక్కున్న ముంబై నటిని తీసుకొచ్చి ఆమెతోనే ఫిర్యాదు చేయించి ఒక ఐపీఎస్‌ను, డీజీ స్థాయి అధికారిని జైలుకు పంపారు. అధికారంలోకి వస్తే ఇవన్నీ మేం చేయలేమా? ఇవన్నీ విచారణ చేయకుండా, ఆధారాలు లేకుండా నమోదు చేసిన అక్రమ కేసులే. అన్నింటికీ వాంగ్మూలాలే ఆధారాలు. సంతకాలు కూడా పోలీసులే పెట్టుకుంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కేసులు పెట్టామని ఎవరైనా వాంగ్మూలం ఇస్తే ఆయన్ను కూడా అరెస్టు చేయొచ్చా? ఇది వారికీ వర్తిస్తుంది కదా. పెనాల్టీతో పోయే కేసుల్ని అట్రాసిటీ సెక్షన్ల కిందకి మార్చారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసులో అన్నీ బెయిలబుల్ సెక్షన్లే. వాటిని నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కిందకి మార్చేశారు. ఆ కేసులకు పెనాల్టీలే తప్ప, అరెస్ట్ చేసే కేసులే కాదు. మధ్యలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ కేసుల విషయంలో 13 రోజుల రిమాండ్ ముగియగానే పీటీ వారెంట్ ఇవ్వడం, లేదా మళ్లీ ఇంకో కేసు నమోదు చేయడం చేసి వేధించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలోనూ ఇలాగే చేశారు. 90 రోజులు అరెస్ట్ చేసి వేధించారు. మళ్లీ ఇంకో తప్పుడు కేసుతో జైలుకు పంపారు. ఆయన భార్య కేసు పెడుతున్నా పోలీసులు నమోదు చేయడం లేదు. చంద్రబాబు బెయిల్‌పై బయట ఉన్నాడు. ఆయన కేసులను అధికారం ఉపయోగించి ప్రభావితం చేస్తున్నాడు. ఇలాంటి అత్యంత ప్రభావం చూపించే వ్యక్తుల విషయంలో అరెస్టులు చేయాలి. అంతేకానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో కుంభకోణం జరిగిందని వార్తలు రాయించి, ఎవరితోనో కేసులు నమోదు చేయించి వాటి ఆధారంగా కేసులు నమోదు చేయడంలో అర్థం లేదు. నోటీసులిచ్చి విచారణ చేయకుండా అరెస్ట్ చేయడం ఏంటి? సోషల్ మీడియాలో అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మా నాయకులను తిడుతుంటే మేం కేసులు నమోదు చేయమంటే పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కిడ్నాపులు, హత్యాయత్నం కింద నమోదు చేసే సెక్షన్ల కింద కేసులు పెడితే అరాచకాలకు అంతే ఉండదు. రాజకీయపార్టీ నాయకులనే ఇంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయగలిగినప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి.