వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం

 సినీ ఫక్కీలో బీజేపీ, జనసేన కార్యకర్తలు కత్తులతో దాడి

చిత్తూరు మేయర్‌కు పట్టిన గతిపడుతుందని బెదిరింపు

చిత్తూరు: నామినేషన్ల పరిశీలన సందర్భంగా జరిగిన చిన్న వాగ్వాదాన్ని మనసులో పెట్టుకొని.. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తను బీజేపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు వెంటాడి కత్తులతో నరికారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. తొట్టంబేడు పంచాయతీ ఈదులగుంటకు చెందిన బత్తెయ్య (40) శుక్రవారం ఉదయం తన స్నేహితుడు పాండుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతూ మార్గమధ్యంలో బీడీ కాలనీ వద్ద ఆపాడు. పాండుకు ఇంటి వద్ద పని ఉండడంతో ద్విచక్రవాహనం ఇచ్చి పంపాడు.
అప్పటికే మాటువేసిన బీజేపీ నాయకుడు కాసరం రమేష్, మరో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు ధరించి రెండు ద్విచక్రవాహనాలపై అక్కడకు చేరుకొని ఒంటరిగా ఉన్న బత్తెయ్యపై కత్తులతో దాడికి దిగారు. తల, ఎడమ చేయిపై నరికారు. బత్తెయ్య కేకలు వేస్తూ పరిగెడుతుండగా వారు వెంటాడసాగారు. ఇంతలో బత్తెయ్య స్నేహితుడు పాండు ద్విచక్రవాహనంపై అక్కడికి చేరుకున్నాడు. దీంతో ‘నీకు చిత్తూరు నగర మేయర్‌కు పట్టిన గతి పడుతుంది’ అంటూ బత్తెయ్యను బెదిరించి అక్కడ నుంచి వారు పరారయ్యారు. వెంటనే పాండు విషయాన్ని పోలీసులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బత్తెయ్యను తీసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించాడు. తొట్టంబేడు పోలీసులు అక్కడికి వెళ్లి బాధితుడి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తనపై దాడి చేసిన వారి వివరాలు తెలిపాడు. 
 

Back to Top