గృహ నిర్మాణ శాఖ‌మంత్రిగా జోగి రమేష్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

స‌చివాల‌యం: గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి జోగి ర‌మేష్‌కు ప‌లువురు నేత‌లు, అధికారులు అభినంద‌న‌లు తెలిపారు. అనంతరం మంత్రి జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే శాఖకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ను మంత్రిగా చేశారని, పేదవాడి సొంతింటి కలను సీఎం చేస్తున్నారన్నారు. విశాఖపట్నంలో అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్‌పై తొలి సంతకం చేశాన‌ని, విశాఖ‌లో లక్ష మంది పేదలకు ఇళ్లు కట్టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగ్‌లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 140 సిమెంట్ బస్తాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించార‌ని చెప్పారు. 

పాదయాత్రలో పేదలు కష్టాలు చూసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద‌లు ఉండ‌కూడ‌ద‌ని, ఒక మ‌హాయ‌జ్ఞంలా ఇళ్ల ప‌ట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని వివ‌రించారు. పేదలకు సేచురషన్ పద్దతిలో ఇళ్లు కట్టిస్తున్నామ‌న్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం వైయ‌స్‌ జగన్ అధిక గుర్తింపు ఇచ్చారని, సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

Back to Top