జగనన్న ప్రభుత్వం ..మీ అందరి ప్రభుత్వం

బీసీ సంక్రాంతి కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సంక్రాంతి పండగ నెల రోజుల ముందే వచ్చినట్లుగా ఉంది

మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం

బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం నా అక్కచెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉంది

ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తాను 

బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు..మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులు

18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం

డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తాం

సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేరితే అభివృద్ధి సాధ్యం

మనది సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమం 

దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్ర‌తో ఉద్యమం చేస్తున్నారు

విజయవాడ: జగనన్న ప్రభుత్వం అందరి ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు చేస్తానని చెప్పా..ఇప్పుడు చేశానని గర్వంగా చెప్పారు. లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలో పనులు చేసుకునే పరిస్థితిని తెచ్చామన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేరితే అభివృద్ధి సాధ్యమని నమ్మానని, ఆ దిశగా అడుగులు వేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 139 కులాలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించేందుకు 56 కార్పొరేషన్‌ చైర్మన్, 672 డైరెక్టర్‌ పదవులు ఇచ్చామని, ప్రతి ఒక్కరూ ఆయా సామాజిక వర్గాల్లోని అర్హులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి కార్యక్రమంలో 56 బీసీ కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాటల్లోనే..
 
ఇక్కడే..ఇదే స్థలంలోనే 18 నెలల ముందు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాను. ఇదే ప్రాంతంలో మీ అందరూ కూడా అంతే గొప్పగా బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా నా మనసుకు చాలాచాలా సంతోషాన్నిచ్చింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులై..ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మీరందరూ ఈ వేదికపై చూసినప్పుడు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉంది. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్‌కు ప్రతి జిల్లాకు ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు ఉండేలా నియామకం చేశాం. ఏపీలో రాజకీయ చరిత్రను తిరగరాలేసేలా..బలహీనవర్గాలను బలపరచడంలో మరో అడుగు ఈ రోజు ముందుకు వేశామని గర్వంగా ఈ వేదికపై నుంచి చెబుతున్నా..56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్కా చెల్లెమ్మలే అని గర్వంగా చెబుతున్నాను. 672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్కాచెల్లెమ్మలే ఉన్నారు. ఈ రోజు మహిళలకు  ఈ స్థానం కల్పించడమంటే మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టామని గర్వంగా చెబుతున్నాను.

బీసీ కార్పొరేషన్లు కాక ఆలయ బోర్డులు, మార్కెట్‌ కమిటీల్లో నామినేషన్‌ పదవులు, కాంట్రాక్టులో ఈ స్థాయిలో బీసీలకు దక్కడం దేశ సామాజిక, రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వడం, అందులో సగం అక్క చెల్లెమ్మలకు దక్కడం ఎక్కడైనా చూశారా? మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి ప్రతినిధులు. మీమీ సామాజిక వర్గాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం అందేలా చూడాలి. ఇటు ప్రభుత్వానికి, మీ సామాజిక వర్గానికి సంధాన కర్తలుగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇవి పదవులు మాత్రమే కాదు..మీ అందరి భుజస్కందాలపై మోపే పవిత్రమైన బాధ్యత అని సవినయంగా గుర్తు చేస్తున్నాను. నా పాదయాత్రలో చాలా గ్రామాల్లో చూశాను. కనీసం ఇద్దరూ ముగ్గురు కూడా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగిందని చెప్పింది లేదు. అది కూడా టీడీపీ జెండా మోశామని సర్టిఫికెట్‌ చూపిస్తే తప్ప కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వని పరిస్థితిని చూశా. కార్పొరేషన్‌ వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. సమూలమైన మార్పులు తెచ్చేందుకు అర్హులు వెవరైనా సరే, రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేకుండా వివక్షకు తావు లేకుండా, లంచాలకు ఎక్కడా చోటు లేకుండా అర్హులందరికీ సాచ్యూరేషన్‌ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందించేందుకు కార్పొరేషన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా న్యాయం చేసేందుకు మీ అందరిని ఎంపిక చేశాం.

 అందరి ముఖాల్లో చిరునవ్వులు, సంతోషం కనిపించాలి. ఈ బాధ్యత మీ అందరి భుజస్కందాలపై పెడుతున్నానని గుర్తు పెట్టుకోవాలి. బీసీలంటే వెనుకబడిన వర్గాలు, కులాలు కాదు..మన సంస్కృతి, నాగరికతకు వేల సంవత్సరాలుగా వెన్నెముక కులాలని ఏలూరు సభలో చెప్పాం. గత ప్రభుత్వం బీసీ వర్గాల వెన్ను ఎలా విరిచిందో చూశాం. మన ప్రభుత్వం వచ్చాక వీరు వెనుకబడిన కులాలు కాదు..వెన్నెముక కులాలుగా మార్చుతామని ఆరోజు మాటిచ్చాను. ఈ 18 నెలల నా ప్రయాణంలో ..ఈ రోజు అదే దిశగా అడుగులు వేశాను. రాష్ట్ర, దేశ చరిత్రలో బలహీన వర్గాలకు కనీవిని ఎరుగని విధంగా, పేదవర్గాలకు కూడా అండగా నిలబడ్డాం. అగ్రవర్గాలకు కూడా తోడుగా నిలబడ్డాం. మన మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తానని, అందులో చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చుతాను. 18 నెలల కాలంలోనే 90 శాతం నెరవేర్చగలిగామని సగర్వంగా చెబుతున్నాను. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు తోడుగా నిలబడలేకపోతే ప్రభుత్వం ఉండి కూడా ఏం ప్రయోజనమని   ప్రతి రోజు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. వాళ్లందరికి అండగా నిలబడే బాధ్యత దేవుడి దయతో ఈ స్థానం ఇచ్చారని గుర్తించుకుంటాను.

 2014లో టీడీపీ మేనిఫెస్టోలో ఏం చెప్పిందో అందరికి గుర్తుంది. బీసీలకు చంద్రబాబు 118 వాగ్ధానాలు ఇచ్చారు. ఇందులో కనీసం 10 శాతం కూడా అమలు చేయని పార్టీకి ప్రజలు ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో అందరం చూశాం. ప్రతి ఏటా 10 వేల కోట్లు బీసీలకు ఖర్చు చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఐదేళ్ల పాలనలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం రూ.19,390 కోట్లు మాత్రమే బీసీలకు ఖర్చు చేసింది. మనందరి ప్రభుత్వం 18 నెలల కాలంలో కేవలం బీసీలకు రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నాను. బీసీలకు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు 18 నెలల్లో అక్షరాల రూ.59317 కోట్లు ఖర్చు చేసి 4.45 కోట్ల మందికి మేలు చేశామని గర్వంగా చెబుతున్నాను. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు చేశాం. ఇందులో ఒకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ పథకాలు వచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకించి బీసీలను గమనిస్తే..శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం. 
18 నెలల నా ప్రయాణం గమనిస్తే..కేబినెట్‌ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను చేస్తే..అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. శాసన సభ స్పీకర్‌గా బీసీ వర్గాలకే కేటాయించాం. తమ్మినేని సీతారాం సౌమ్యుడు, మంచివారు. 

టీడీపీ ఐదేళ్ల పాలన గమనిస్తే..రాజ్యసభకు ఎంత మందిని బీసీలను పంపించారు. ఒక్కరూ కూడా బీసీలు రాజ్యసభకు వెళ్లలేదు. ఈ రోజు నలుగురిలో ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపించామని గర్వంగా చెబుతున్నాను. సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించాం.మార్కెట్‌ యార్డు పదవులు, ఆలయ కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం పదవులు, పనులు ఇచ్చేలా చట్టాన్ని చేశాం. ఈ రోజు గ్రామ సచివాలయాల్లో దాదాపుగా 1.35 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల 83 శాతం సచివాలయ ఉద్యోగాల్లో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా వారి ద్వారా 50 మందికి ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి ఎక్కడా కూడా వివక్ష లేకుండా కుళ్లు, కుతంత్రాలు లేవు. నేరుగా తలుపు తట్టి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. 4 లక్షల మందికి గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు పొందారు. ఈ రోజు గ్రామ స్వరాజ్యాన్ని చూస్తున్నాం. 

సంక్షేమ పథకాలను ఒక్కసారి గమనించాలి. మంచి చేసేందుకు, పేదలకు తోడుగా ఉండేందుకు ప్రతి రోజు పొద్దునే దేవుడిని మొక్కుకునే సమయంలో దేవా నాకు మంచి మనసు ఇచ్చావు. మంచి పనులు చేసేందుకు వనరులు కూడా ఇవ్వమని ప్రార్థిస్తాను. అమ్మ ఒడి పథకంతో మొదలు పెడితే అక్షరాల 82 లక్షల మంది విద్యార్థులకు 43 లక్షల మంది తల్లులకు ఏటా రూ. 15 వేల చొప్పున lలబ్ధి చేకూర్చుతున్నాం. బీసీలకు 19.66లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. రేపు నెల మళ్లీ రెండోసారి అమ్మ ఒడి ద్వారా అక్కాచెల్లెమ్మలకు డబ్బు ఇవ్వబోతున్నాం.  వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ఏటా 50 లక్షల మంది రైతులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు భరోసాకు ఏటా రూ.6,750 కోట్లు అందజేస్తున్నాం. 23 లక్షల 69 వేల మంది బీసీ కులాల రైతులే ఉన్నారు. అక్షరాల 6140 కోట్లు బీసీలకు రైతు భరోసా కింద ఇస్తున్నాం. రైతుల కోసం సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నాం. 14 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే..ఇందులో బీసీలు 7.14 లక్షల మంది ఉన్నారు.

ఉచిత పంటల బీమా ద్వారా రూ.1252 కోట్లు అందించాం. బీసీలకు రూ.588 కోట్లు లబ్ధిపొందారు. ఇళ్ల పట్టాల పంపిణీ అన్నది ఒక యజ్ఞంగా చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 25న క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పండుగ రోజు 31 లక్షలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతి ఊరికి వచ్చి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. 15.92 లక్షల మంది బీసీ మహిళలకు పట్టాలు ఇస్తున్నామని సగర్వంగా చెబుతున్నాను. రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తాం. టిడ్కో ద్వారా లక్ష 72 వేల మంది బీసీలకు లబ్ధి జరుగుతుంది. వైయస్‌ఆర్‌నేతన్న నేస్తం కింద 81 వేల కుటుంబాలకు ఏటా రూ.24 వేల చొప్పున అందించాం. వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద లక్ష 7 వేల మంది బీసీ కుటుంబాలకు రూ.210 కోట్లు నేరుగా వారి చేతుల్లోనే పెట్టానని సగర్వంగా చెబుతున్నాను. ఇది మత్స్యకారులపై ఉన్న మనకు ఉన్న ఆప్యాయత అని సగర్వంగా చెబుతున్నాను. జగనన్నచేదోడు కింద టైలర్లు, నాయిబ్రహ్మణులు, రజకులకు 2.97 లక్షల మందికి మేలు చేశాం. రూ.227 కోట్లు అందజేశాం. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు. ఈ పథకం ద్వారా మన ప్రభుత్వంలో 9.67 లక్షల మందికి లబ్ధి జరిగింది. రూ.2340 కోట్లు ఖర్చు చేశాం.

ఇందులో బీసీలు 5.24 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఆరోగ్య ఆసరా కింద రూ.165 కోట్లు ఈ 18 నెలల కాలంలో ఖర్చు చేశాం. ఇందులో బీసీలు 1.38 లక్షల మందికి మేలు జరిగింది. వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుక ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే నేరుగా వాలంటీర్‌ ఇంటి తలుపు తట్టి అన్న పంపించాడని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి పింఛన్‌ సొమ్ము చేతుల్లో పెడుతున్నారు. ఈ 18 నెలల కాలంలో పింఛన్‌ కానుక కింద అక్షరాల రూ.25 వేల కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నాను. ఇందులో 61.94లక్షల మందికి మేలు జరుగుతోంది. ఇందులో బీసీ కుటుంబాలు 30 లక్షల మంది ఉన్నారు. రూ.12,130 కోట్లు బీసీలకు లబ్ధి జరిగింది. వైయస్‌ఆర్‌ ఆసరా కింద పొదుపు అక్క చెల్లెమ్మలకు మేలు చేసేందుకు ఎన్నికల వరకు ఉన్న బ్యాంకు రుణాలను మాఫీ చేస్తూ నాలుగు దఫాల్లో చెల్లిస్తామని చెప్పాం. మొదటి దఫా చెల్లించాం. బీసీలకు రూ.13,040 కోట్లు ఇచ్చాం. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు చెల్లించాం.

ఇందులో బీసీలకు 48 లక్షల 39 వేల మందికి లబ్ధి జరిగింది. వైయస్‌ఆర్‌ చేయూత పథకం కింద 24లక్షల 56 వేల మందికి రూ.6400 కోట్లు ఇచ్చాం. ఒక్కొక్కరికి రూ.18,750 ఇచ్చాం. రూ.75 వేలు నాలుగేళ్లలో ఇస్తున్నాం. ఆసరా, చేయూత పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడమే కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నాం. ఐటీసీ, అమూలు, అల్లానా, రిలయన్స్‌ గ్రూపులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని అక్కచెల్లెమ్మలకు అడుగడుగునా తోడుగా ఉంటున్నాం. అక్కచెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు, గొ్రరెలు, గేదెలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో 14.81 లక్షల మంది బీసీ మహిళలు ఉన్నారు. రూ.271 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో సొంత తమ్ముడు ఉంటే ఆ అక్కచెల్లెమ్మల గురించి ఎలా ఆలోచన చేస్తారో..అలాగే తాను చేశాను. ఇది మనందరి ప్రభుత్వం.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మన పిల్లల చదువుల కోసం 18 నెలల్లో రూ.3858 కోట్లు ఇచ్చాం. బీసీలకు 18.57 లక్షల మందికి మేలు జరిగింది. వసతి దీవెన కింద రూ.1221 కోట్లు విద్యార్థులకు ఇచ్చాం. ఇందులో బీసీలకు 7.43 లక్షల మందికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ఇన్ని పథకాలు అమలు చేశామంటే..వీటి పేర్లు తాను తప్ప..మరొకరు చెప్పలేరు. జగనన్న విద్యా కానుక కింద 42.34  లక్షల మంది పిల్లలకు బుక్స్, బ్యాగులు, యూనిఫాం, బూట్లు, సాక్స్‌లు కూడా ఇచ్చాం. 22 లక్షల మంది బీసీ పిల్లలకు మేలు జరిగింది. జగనన్న గోరు ముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నాం. రోజుకో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సుక్ష్మంగా చూసి ఉండరేమో? . ఇందులో 17 లక్షల మంది బీసీ పిల్లలు ఉన్నారు. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం అమలు చేస్తున్నాం. కడుపులో ఉన్న పిల్లాడు బాగా పెరగాలనే ఉద్దేశంతో పౌష్టికాహారం అందజేస్తున్నాం. 30.16 లక్షల మందికి మేలు చేస్తున్నాం. బీసీలు 14 లక్షల మంది ఇందులో లబ్ది పొందుతున్నారు.

వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం కింద 18 నెలల్లో రూ.513 కోట్లు అందజేశాం. ఇందులో 1.22 లక్షల మంది బీసీలు ఉన్నారు. జగనన్న తోడు పథకం కింద చిరువ్యాపారులు, బండ్లపై వ్యాపారం చేసే వారికి వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం. 9 లక్షలకు పైగా చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తున్నాం. ఆ వడ్డీ భారం ప్రభుత్వమే కడుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే ఇదో సందర్భంగా కాబట్టి చెప్పాల్సి వస్తోంది. ఇవన్నీ కూడా జరిగాయి. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశాం కాబట్టే గర్వంగా చెబుతున్నారు. ఇవన్నీ చెబుతుంటే వెంట్రుకలు నిక్కపొడుస్తున్నాయి. ఎన్నికల ముందే ఇవన్నీ చేస్తానని చెప్పి ఉంటే కొందరికి నిద్రపట్టేది కాదు. ఇవన్నీ కూడా చేశాను కాబట్టే ..ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని మీ బిడ్డలా, మీ అన్నలా గర్వంగా చెబుతున్నాను. నేటి తరం అవసరాలు, ఆకాంక్షలను అర్థం చేసుకొని ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో అండగా ఉంటానని, రేపటి తరం పోటి ప్రపంచంలో నిలబడేలా తీర్చిదిద్దుతున్నాం.

కోవిడ్‌ సమయంలో నాలుగు అడుగులు ముందుకు వేశాం..ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అందరికి మేలు చేసేలా అడుగులు వేశాం. ఇంటింటా పిల్లలు చదివితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించాం. వందశాతం అక్షరాస్యత చేయిస్తేనే అప్పుడే అభివృద్ధి జరగుతుందని నమ్మాం కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రతి ఇంటా అందరికి సంక్షేమ పథకాలు అందితేనే దాన్నే అభివృద్ధి అంటారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. కాళ్లు అరిగేలా అందరి చుట్టూ తిరుగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగే పరిస్థితి వస్తేనే దాన్ని అభివృద్ధి అంటారని నమ్మాను కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తున్నా. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నడుచుకుంటూ ఇంటిదాకా వస్తేనే అభివృద్ధి అని నమ్మాను కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తున్నా..రైతుల వద్దకే వారికి కావాల్సిన విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి ఒక్క సేవ కూడా రైతు వద్దకే రావాలి..దాన్నే అభివృద్ధి  అని నమ్మాను కాబట్టే ఆర్‌బీకేలు స్థాపించి అడుగులు ముందుకు వేస్తున్నా. ప్రభుత్వ బడుల్లో మార్పు రావాలి. పిల్లలు గర్వంగా ఆ బడులకు వెళ్లాలి. పోటీ ప్రపంచంలో నెగ్గాను అని చెప్పే పరిస్థితి రావాలి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ బడులకు మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా నాడు–నేడు పథకం కింద రూపురేఖలు మార్చుతున్నాం. 

సమాజంలోని అత్యంత నిరుపేద పిల్లలు కూడా ఇంగ్లీష్‌ మీడియం చదువులు వారి గ్రామాల్లోనే చదువుకోవడం, పేదలకు  ఇళ్లు కట్టించడం, సామాజికంగా, ఆర్థికంగా నాలుగు మెట్లు పైకి అడుగులు వేయడమే అభివృద్ధి అని నమ్మాను కాబట్టే ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాను. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమమని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం జరిగే రోజు మరో కార్యక్రమం కూడా గత ప్రభుత్వం చేపట్టింది. దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్ర‌తో తాను సొంతంగా లాభపడేందుకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి రైతుల వద్ద నుంచి తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి, అక్కడే రాజధాని పెట్టాలని గుట్టు చప్పుడుకాకుండా భూములు కొనుగోలు చేశౠరు. ఆ భూములు కాపాడుకునేందుకు ఈరోజు ఒక ఉద్యమం చేసే పరిస్థితి ఇక్కడే చూస్తున్నాం. ఒక చెడిపోయిన బుర్ర‌ పనిచేయడం లేదన్నది అక్కడ కనిపిస్తుంది.

ఒక మంచి  బుర్ర‌ ఎలా పని చేస్తున్నారన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోజు ఒక అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా మీ అందరికి మీ బాధ్యతలను గుర్తు చేస్తున్నాను. అణగారిన వర్గాలకు మంచి చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చినట్లుగా..మీ అందరికి కూడా  ఈ రోజు నా ద్వారా మీకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా అర్హత ఉండి మేలు జరగని పరిస్థితి ఉంటే ..ఆ బాధ్యత మీ భుజస్కందాలపై వేసుకొని వారికి మేలు చేయాలని ..చైర్మన్లు అందరూ కూడా ఎక్స్‌ అఫిషియో మెంబర్లుగా నియమితులవుతారు. మీ వాయిస్‌ జిల్లా పరిషత్‌తో వినిపించాలి. ఇక్కడికి వచ్చి బాధ్యతలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ..భవిష్యత్‌లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెలవు తీసుకున్నారు. 

 

Back to Top