వైయ‌స్ఆర్‌ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం

యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌లో ఏపీ ముందడుగు 

రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ వర్తింపు 

ఆరోగ్య శ్రీ స్మార్ట్‌ కార్డులు భేష్‌ 

అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ ఆరోగ్య శ్రీ ద్వారా అత్యాధునిక కార్పొరేట్‌ వైద్యాన్ని అందించడమే కాకుండా, శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక తోడ్పాటునందించడానికి ప్రవేశ పెట్టిన డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకం జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. డా. వైయ‌స్ఆర్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకమని, దాని అమలు సాహసోపేతమైన చర్య అని ఏకంగా నేషనల్‌ హెల్త్‌ అథారిటీనే అభివర్ణించింది. ఈ పథకం శస్త్ర చికిత్స చేయించుకుని, విశ్రాంతి తీసుకునే సమయంలో పేదల జీవనోపాధికి పెద్ద భరోసా ఇస్తోందని తెలిపింది.

ప్రజారోగ్య రంగంలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ కితాబునిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య బీమాలో అనుసరిస్తున్న విధానాలను అథ్యయనం చేసిన అథారిటీ.. డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకంపై ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేద కుటుంబాల్లోని వారు శస్త్ర చికిత్సలు చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో గృహ ఖర్చులకు రక్షణ కవచంగా నిలుస్తోందని పేర్కొంది.

ఇది చాలా పెద్ద కార్యక్రమమైనప్పటికీ, వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోందని తెలిపింది. ‘శస్త్ర చికిత్స చేయించుకునే రోగులకు కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. ఆ సమయంలో రోగి జీవనోపాధిని కోల్పోయి, ఆర్థికంగా నష్టపోతారు. విశ్రాంతి సమయంలో రోజువారి వేతనాలు రాకపోవడంతో ఆ కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. కుటుంబాల నిర్వహణ కష్టమవుతుంది.

ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం  వైయ‌స్ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వారి గృహ ఖర్చులకు రక్షణ కల్పింస్తోంది’ అని  అథారిటీ తెలిపింది. శస్త్ర చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే ఆ పేద కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా భత్యం జమ అవుతోందని పేర్కొంది. విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ. 5,000 వరకు పేద కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తున్నారని, మరే ఇతర రాష్ల్రాల్లో ఇలాంటి పథకం లేదని అథారిటీ తెలిపింది. 

యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీలో ఏపీ ముందడుగు 
యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీని సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందడుగు వేసిందని అథారిటీ తెలిపింది. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న పేద కుటుంబాలను రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా నవశకం కార్యక్రమం కింద గుర్తించి ఆ కుటుంబాలకు డా.వైయ‌స్ఆర్‌ ఆరోగ్య శ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది.

క్యూఆర్‌ కోడ్, యూనిక్‌ ఐడీ నెంబర్లతో కూడిన ఈ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులతో లబ్ధిదారుల వైద్య రికార్డుల నిర్వహణ మెరుగుపడిందని పేర్కొంది. అంతే కాకుండా రోగి వివరాల గోప్యతకు, భద్రతకు ఈ కార్డులు రక్షణ కల్పింస్తున్నాయని చెప్పింది. కుటుంబ యజమాని, సభ్యులందరి వివరాలను, గ్రామ, వార్డు సచివాలయాల వివరాలను కూడా కార్డుల్లో పొందుపరిచారని పేర్కొంది. ఆరోగ్య శ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు చాలా నాణ్యతతో ఉన్నాయని, పదేళ్లకుపైగా మన్నిక ఉంటుందని తెలిపింది.

తాజా వీడియోలు

Back to Top