తెలుగునేల పులకరించిపోయిన వేళ...

ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఇది కొత్త వెలుగుల పొద్దుపొడుపు

 కోట్లమంది కలవరించి..పలవరించిన రోజిది. దశాబ్దకాలంగా చూస్తున్న జగన్‌ను ఇలా...ఇలాగే చూడాలని తపించిన అభిమానజనానికిది పండగరోజు. తమకోసం నిరంతరం ఆలోచించే జనహితుడు జగన్‌కు మంచి జరగాలని ప్రార్థించిన పెదవులు ఎన్నెన్నో. దేవుళ్ల ముందు మోకరిల్లిని శిరస్సులెన్నో. ప్రజాసంకల్పం జయించిన ఈరోజు...ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో సరికొత్త పొద్దుపొడుపు.
వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా...ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే  మాటలు ఆ నోట వినాలని సంవత్సరాల తరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజలకు... ఈరోజు ఆ మాటలు వినపడ్డాయి. పాదయాత్ర దారెంబడి, ఆ తర్వాత జగన్‌ ఎక్కడ కనిపించినా ...సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. ఈ రోజు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ మాటలు వినాలని తపించిన మనసులు సేదతీరాయి. 
రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర...మూడుప్రాంతాలు ముచ్చటగా నువ్వే సీఎం అని తీర్పిచ్చాయి. కనివినీ ఎరుగని ఓట్లశాతం...అత్యద్భుతమైన మెజారిటీ. విజయం ఏకపక్షం. ఇక పాలన ప్రజాపక్షం.
జనం పండుగరోజు
వేదిక మీద జగన్‌. వేదిక ముందు జనం. గుండెచప్పుడు ఒక్కటే. జగన్‌..జగన్‌...సీఎం..సీఎం....
జగన్‌ జనహితుడు అన్న నమ్మకం ప్రజల్లో అపారం. అది అణువణువునా జగన్‌లో ఇంకిపోయిన లక్షణం. అవ్వాతాతలకు, వితంతు అక్కచెల్లెమ్మలకు పెన్షన్‌ పెంచుతూ ముఖ్యమంత్రిగా తొలిసంతకం చేశారు జగన్‌. అది సంక్షేమ సంతకం. ప్రజాసంక్షేమ రాజ్యమని చాటి చెప్పిన సంతకం. రాజన్నరాజ్యం అన్నమాట నిలిపిన సంతకం
జంకని అడుగులు
కాలం మారని అడుగుజాడల సంతకం పాదయాత్ర. ఆ పాదయాత్ర దారిలో జగన్‌ ప్రజలకు భరోసానిస్తూ, ధైర్యాన్నిస్తూ...తన పాలన వస్తే ఏమేమి చేస్తాడో స్పష్టంగా చెప్పాడు. సీఎంగా వేదిక మీద మరింత గట్టిగా, గుండెగొంతుకలొకటి చేసి చెప్పాడు.
నాడు వైయస్సార్‌ ఉచిత విద్యుత్‌పై తొలిసంతకం పెట్టారు.
ఈరోజు  వైయస్‌ తనయుడు, సీఎం జగన్‌ పింఛన్లు పెంచుతూ సంతకం చేశారు. 
ఆ తండ్రీకొడుకుల సంతకాలు మాటతప్పని, మడమ తిప్పని నైజానికి ఆనవాళ్లు...
ఆ సంతకాలు జనసంక్షేమానికి పందిరి గుంజెలు. 
ఆ సంతకాలు  గుండెదిటవు సంతకాలు. 
ఆ సంతకాలు ప్రజాప్రేమికుల సాహసిక సంతకాలు.
నాడు వైయస్సార్‌ పాలన...నేడు మొదలైన వైయస్‌జగన్‌ పాలన
అప్పుడూ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటిలానే వుండేది. ఆ సంక్షోభపరిస్థితుల నుంచి నాడు ఈ రాజన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాడు. రూపురేఖలే మార్చాడు. ఓవైపు ప్రజాసంక్షేమం, మరోవైపు రాష్ట్రం అభివృద్దిలో ముందడుగు వేసేలా చూశారు. అది రెండువేల నాలుగు నుంచి 2009 మధ్య నడిచిన కాలం. 
నేడు అదే రీతిలో రాష్ట్రపరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అప్పుడూ ముందు పాలకుడు చంద్రబాబే. ఇప్పుడూ  ఆచంద్రబాబే. సరిదిద్దడమే తండ్రీ కొడుకుల పని అని దేవుడు నిర్ణయించినట్టు వున్నాడు. ఇప్పుడు జగన్‌ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలి. ప్రజాసంక్షేమం, అభివృద్ది దిశలో గబగబా ముందడుగులు వేయాలి. మొత్తానికి హిస్టరీ రిపీట్స్‌.....
దశ...దిశా మార్చిన దశాబ్దకాలం
రెండువేల తొమ్మిది. సెప్టెంబర్‌ 2. వైయస్సార్‌ ఇక లేరు అని తెలిసిన రోజు. విశాలాంధ్ర కన్నీటి పర్యంతమైన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జగన్‌ జీవితం పోరాటంగానే సాగింది. నడుస్తున్న రాజకీయాల్లో ఇమడలేక...ప్రజలకోసం నడవడమే తన రాజకీయంగా మార్చుకున్నాడు. రాజకీయాలకు కొత్త అర్థం చెబుతూ ముందుకే సాగాడు. ఆ క్రమంలో ఎన్నెన్ని ఆటుపోట్లో...ఎన్నెన్ని కుట్రలు కుతంత్రాలో. ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని సవాలుగా స్వీకరించి, నేడుగా విజేతగా నిలిచాడు. 
 ప్రజల నుద్దేశించి ప్రసంగించిన కొత్త సీఎం సూటిగా మాట్లాడారు. స్పష్టంగా మాట్లాడారు.  ఆ స్వరంలో ఎన్నెన్ని భావోద్వేగాలో. ఎన్నెన్ని జ్ఞాపకాల దొంతరలో. ప్రజల చెంత, ప్రజల కోసం నడచిన జగన్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేస్తానని స్పష్టంగా చెప్పిన జగ¯Œ , ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగంతోనే ప్రజలకు తనేంటో చాటారు.
నాడు వైయస్సార్‌ తొలిప్రసంగంలోనూ పలికిన భావోద్వేగాలెన్నో. ప్రజలకు తనెంత రుణపడిపోయాడో చెబుతూ...వైయస్సార్‌ ఆ తర్వాత ప్రజలకోసమే పనిచేస్తూ పోయారు. వేగవంతమైన నిర్ణయాలతో ప్రజలందరి నాయకుడిగా ఎదిగిపోయారు.  
నిజమైన వారసుడు
2019 ఎన్నికల్లో దేశమంతా వారసులకు జనం చెల్లుచీటి రాస్తే...వైఎస్‌ వారసుడిగా జగన్‌కు ఇక్కడి జనం పట్టాభిషేకం చేశారు. ప్రజాతీర్పులో విచక్షణను చాటారు. 
అవును మరి సీఎం జగన్‌ రాజన్న వారసుడు. కానీ పేరుకే వారసుడిగా మిగిలిపోలేదు. తండ్రి ఆశయాల బాటలో తనేంటో గట్టిగా ఫ్రూవ్‌ చేసుకున్నారు. తండ్రికన్నా రెండడుగులు ముందుకు వేస్తానంటూ. ..కష్టించాడు. శ్రమించాడు. సాధించాడు. 
ఈ విజయం అనితరసాధ్యం
మే 23 ఎన్నికల ఫలితాలు వచ్చిన వేళ. అధికారపార్టీపై వ్యతిరేకత. వైయస్‌ జగన్‌పై నమ్మకం రెండూ కలిసి, కనివిని ఎరుగని ఫలితాన్నిచ్చాయి. తిరుగులేని ప్రజామద్దతు వైయస్‌ జగన్‌కే దక్కింది. అంతకు ముందు దశాబ్దకాలంగా అలుపెరుగని రీతిలో పోరాటాలు చేస్తూ పోయిన జగన్‌ ...ఫలితాల తర్వాత సేదతీరింది లేదు. ఆ రోజు నుంచి ఈరోజు దాకా అదే తీరులో బిజీబిజీగా గడిపారు. అవును మరి, అలసెట తెలియని ప్రజానేత అతను.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుక్షణం నుంచే, రేపటి పాలనపై సమీక్షలు చేస్తూ, రాష్ట్ర పరిస్థితి తెలుసుకుంటూ గడిపారు జగన్‌. ఢిల్లీకి వెళ్లారు. ప్రధానమంత్రిని కలిశారు. ప్రత్యేకహోదాపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఢిల్లీలో జగన్‌ పర్యటన...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని చాటింది. గత పాలకుడికి, జగన్‌కు స్పష్టమైన తేడావుందని ఢిల్లీ పెద్దలకు తెలిసేలా చేసింది. పరిణతి చెందిన రాజకీయవేత్తగా, అనుభవశాలిగా...జగన్‌ ముందుకు సాగుతుంటే, సీనియర్‌ అధికారులే ఆశ్చర్యపోయేంత పనయింది. ఆంధ్రరాష్ట్రపరిస్థితులపై జగన్‌ అవగాహనా శక్తి, పరిపాలనాపరమైన అపారజ్ఞానం అధికారులను ఆలోచనల్లో పడేసే వుంటుంది. జగనేంటో ప్రజలకు తెలుసు. ఇప్పుడు అధికారవర్గాలకు, ఢిల్లీనేతలకు కూడా జగన్‌ ఏంటో తెలిసిందనడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.
రాష్ట్రంలోనూ అధికారులందరినీ కలుస్తూపోయారు. మాట్లాడారు. రేపు తన పాలన ఎలా వుండబోతోందో అర్థమయ్యేలా చెప్పారు. ఆ దిశలో దిశానిర్దేశం చేస్తూ పోయారు. ప్రమాణస్వీకారం రోజు దాకా...జగన్‌ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నారు. 
డాబూ లేదు. దర్పం లేదు. ఎదిగిపోయిన వినయశీలిగా అందరినీ కలుస్తూ  పోయిన జగన్‌ నమ్మింది ఒక్కటే.  ప్రజలకోసం...ప్రజలకిచ్చిన మాటకోసం చిత్తశుద్దితో కషిచేస్తే...అనుకున్న ఫలితాలు సాధించవచ్చన్నది జగన్‌ అపారవిశ్వాసం. మనస్సుంటే మార్గం వుంటుందన్నది జగన్‌ గట్టిగా నమ్మిన మాట.  ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన బాట అదేనంటున్నారు. 
ఉందిలే మంచికాలం ముందు ముందునా...
కొత్త రాష్ట్రం. సవాలక్ష సమస్యలు. ఉన్న సమస్యలు చాలక, గత ప్రభుత్వం ఐదేళ్లపాలనా కాలం తెచ్చిపెట్టిన చేటుదనమెంతో. ప్రజాస్వామ్యప్రభుత్వమా, నిరంకుశమా అన్న డౌటు వచ్చిన సందర్భాలెన్నో. నిజంగానే, జగన్‌ చెప్పినట్టుగానే విప్లవాత్మక మార్పులు రావాలి. కొత్తగాలుల పాలన సాగాలి. ఇది సాధ్యం చేసే సత్తా జగన్‌కే వుందన్న నమ్మకం ప్రజలది. చిన్నవయసులో పెద్ద బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. ఆ విషయంలో తనకు తానే సాటి అని ఇప్పటికే అనేకసందర్భాల్లో జగన్‌ నిరూపించుకున్నారు. 
విభజన తర్వాత వాటీజ్‌ ఆంధ్రప్రదేశ్‌ అన్నది అందరినీ ఆలోచనలో పడేసిన విషయం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకైతే ఓ దశలో దిక్కుతోచని స్థితి. పోలవరం అంటూ, అమరావతి అంటూ మాటల గారడీతో ఐదేళ్ల కాలాన్ని హరాయించేసిన బాబు జమానా...ఖజానాను ఖాళీచేసిన సందర్భమిది. అనుభవజ్ఞానంతో, పాలనాదక్షత కలిగిన నాయకులకే పెద్ద బాధ్యతగా అనిపించే పరిస్థితి రాష్ట్రానిది. అలాంటి రాష్ట్రానికి ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి. కానీ, ఆయనలో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. చేసి తీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. చిత్తశుద్దితో కృషి చేసే లక్షణం మెండుగా వుంది. జగన్‌ ఆశయాలకనుగుణంగా, పాలనామార్గానికి అనుగుణంగా అధికారగణం పనిచేయాలిప్పుడు. ప్రజలకోసమే పనిచేస్తానంటున్న ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం ఎవరికైనా సంతోషాన్నిచ్చే విషయమే. అంతకన్నా ఎక్కువగా వృత్తిపరమైన సంతృప్తినీ అందిస్తుంది. ఇక అధికారగణం ప్రజలపక్షం కావాల్సిన సమయమిది. 
 సాధారణంగా ప్రతి విషయమూ సవాలు లాంటిదే. సవాలును స్వీకరించాక, దాంతో పాటే బాధ్యత వస్తుంది. దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదబలంతో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తానని గట్టిగా నమ్ముతున్నాను అంటారు జగన్‌. ఆయన విషయంలో తథాస్తు దేవతలు పనిచేస్తున్నట్టే వుంది. ఇక్కడా తథాస్తు అనాలని...ప్రజలు కోరుకుంటున్నారు. 
సంకల్పమే జయిస్తుంది
రాజన్న రాజ్యం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటూ వచ్చారు. రాజన్న రాజ్యం తెస్తానని జగన్‌ గట్టిగా హామీ ఇచ్చారు. నాన్న చేసినట్టుగానే సంక్షేమపథకాల్ని, అభివద్ది పనులను చేస్తానని మాటిచ్చారు. వైయస్‌జగన్‌ను ప్రజలు బలంగా విశ్వసించారు. ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభ ఎన్నికల్లో, దేశంలోనే శక్తివంతమైన ప్రాంతీయనాయకుడిగా జగన్‌ పుట్టుకొచ్చారు. పాలకుడిగా జగన్‌ సత్తాను రాబోయేకాలమే చాటబోతోంది. ఏపీ నీడ్స్‌ జగన్‌ అన్నది ఎంత కరెక్టో తెలియచేస్తుంది.

Back to Top