యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్‌లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది. యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్‌కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తోంది. సొసైటీల ద్వారా సరఫరా చేయకుండా పక్కదారి పట్టిస్తున్న టీడీపీ నేతల ఆగడాలకు రైతన్నలే చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ రైతన్నలే విజిలెన్స్ అధికారుల అవతారమెత్తి అడ్డుకుంటున్నారు. చరిత్రలోఎన్నడూ లేనివిధంగా డిమాండ్ మేరకు యూరియా సరఫరా కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు నిరసన బాట పట్టారు. కృష్ణా జిల్లాలో యూరియా కోసం నిరసనలు భగ్గుమంటున్నాయి. దారి మళ్లుతున్న యూరియా.. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సీజన్‌లో 6.22 లక్షల టన్నుల యూరియా అవసరం. ఈ ఏడాది 5.70 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయని చెబుతోంది. అదే నిజమైతే మరి రైతన్నలు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తోందన్న ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం కరువైంది. రైతులకు అందాల్సిన యూరియా పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నట్లు స్పష్టమవుతోంది. పలు జిల్లాల్లో టీడీపీ నేతలే యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నా వారిని కాపాడే యత్నం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు గుడివాడలో గంటల కొద్దీ పడిగాపులు.. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో యూరియా సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించడంతో పీఏసీఎస్‌ల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. విన్నకోట, నందివాడ, రామనపూడి పీఎసీఎస్ వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడితే అరకొరగా మాత్రమే యూరియా అందజేశారని రైతులు మండిపడ్డారు. అధికార పార్టీ నేతల సిఫార్సులు ఉన్న వారికి మాత్రమే ఎరువులు దక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో భారీ క్యూలైన్‌లో బారులు తీరిన అన్నదాతలు ఘంటశాలలో గందరగోళం కృష్ణా జిల్లా ఘంటశాల మండలంలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మండలంలోని లంకపల్లి పీఏసీఏస్‌కు 445 యూరియా కట్టలు రాగా ఘంటశాల గ్రోమోర్‌కు 555 యూరియా కట్టలు వచ్చాయి. లంకపల్లి పీఏసీఏస్ వద్దకు రైతులు భారీగా చేరుకోగా అధికారులు గేట్లు మూసి వేయడంతో ఎండలో బారులు తీరారు. రైతులను అదుపు చేయలేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వలేదు. రైతుల ఆధార్, పాస్ బుక్ జిరాక్సులు తీసుకుని స్లిప్‌లు పంపిణీ చేశారు. పలుకుబడి ఉన్న వారికే యూరియా ఇస్తున్నారని క్యూలో నిలబడ్డ వారు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు, అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రోమోర్, లంకపల్లి పీఏసీఏస్‌ల వద్ద రైతులు కనీసం సేదతీరడానికి కూడా అవకాశం లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఘంటశాలలో అరుగులపై తమ వంతు వచ్చే వరకు కూలబడిపోయారు. యూరియా దొరకని రైతులు ప్రభుత్వ అసమర్థతను తిట్టుకుంటూ వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా గజ్జరంలో యూరియా కోసం రైతుల పాట్లు చిత్తూరులో రైతుల నిరసన టోకెన్లు ఉన్నా యూరియా పంపిణీ చేయడం లేదని చిత్తూరు జిల్లా సదుం మండలంలో రైతులు నిరసన తెలిపారు. మూడు రోజులుగా దుకాణం వద్దకు టోకెన్లతో వచ్చినా యూరియా ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్టాకు లేదంటూ దుకాణం మూసి వేశారని, నాయకులు ఫోన్ చేస్తే పదుల సంఖ్యలో బస్తాలను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లె యార్డులో ఆందోళన యూరియా కోసం రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రెండు రోజులుగా మార్కెట్ యార్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా యూరియా అందించే నాథుడు లేడని వాపోయారు. స్టాక్ ఉందో లేదో తెలి యని పరిస్థితి నెలకొందని, గంటల కొద్దీ గోడౌన్‌ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరిలో తిరుగుముఖం.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని గజ్జరం, అన్నదేవరపేట సొసైటీల వద్ద బుధవారం యూరియా విక్రయాల వద్ద గందరగోళం నెలకొంది. ఈ సొసైటీలకు 1,600 బస్తాల యూరియా వచ్చింది. 500 మంది రైతులకు యూరియా అందజేశారు. మరో 50 మంది రైతులకు అందకపోవడంతో వెనుదిరిగారు. తాళ్లపూడి, వీరభద్రపురం, కుకునూరు, పైడిమెట్ట గ్రామాల రైతులకు యూరియా అందకపోవడంతో తామెక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా సదుంలో నిరసన తెలుపుతున్న కర్షకులు అనకాపల్లిలో కిక్కిరిసిన కేంద్రం.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో యూరియా కోసం మండుటెండలో అన్నదాతలు నరకయాతన అనుభవించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో యూరియా పంపిణీ గురించి తెలియడంతో ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో చేరుకున్నారు. యూరియా నిల్వల కంటే రెట్టింపు సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. క్యూలైన్‌లో గంటల తరబడి నిరీక్షించి రైతులు నానా అవస్థలు పడ్డారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని, ఆధార్, 1 బీ తప్పనిసరిగా ఉండాలని వ్యవసాయశాఖ సిబ్బంది చెప్పడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలో పడిగాపులు.. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. బుధవారం సొసైటీ కార్యాలయం వద్దకు స్టాక్ రావడంతో రైతులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఒక బస్తా మాత్రమే సరఫరా చేస్తుండటంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికే యూరియా ఖాళీ కావడంతో రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా..! ఏలూరు డీసీఎంఎస్ డిపోకు యూరియా వచ్చిందని తెలిసి రైతులు అధిక సంఖ్యలో రావడంతో చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. డీసీఎంఎస్ డిపోకు 18 టన్నుల యూరియా వచ్చినా పంపిణీ చేయకుండా అధికారులు మోకాలడ్డారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని డిపో నిర్వాహకులు మెలిక పెట్టారు. కాంప్లెక్స్ ఎరువులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, అంత డబ్బు తమ వద్ద లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారపార్టీ నాయకుల సిఫార్సు ఉన్న వారికి ఎన్ని కట్టలైనా ఇస్తున్నారంటూ వాపోయారు. గుంటూరు జిల్లా రేపల్లె మార్కెట్‌యార్డు వద్ద రైతుల ఆందోళన అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 55.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం వరి చిరు పొట్ట దశకు చేరుకుంది. ఈ సమయంలో నత్రజని (యూరియా) చాలా అవసరం. యూరియాకు ప్రత్యామ్నాయం కూడా లేదు. ఇలాంటి తరుణంలో సెప్టెంబర్‌లో అంచనా డిమాండ్ 1.55 లక్షల టన్నులైతే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా కేవలం 94 వేల టన్నులు మాత్రమే. యూరియా ఇదిగో వచ్చేస్తోంది.. అదిగో వచ్చేస్తోంది.. అంటూ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఊరిస్తున్నా రాష్ట్రానికి వారు చెబుతున్నట్లుగా నిల్వలు రావడం లేదు. దీంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతులకు సరఫరా చేయాల్సిన యూరియా పక్కదారి పడుతుంటే గుడ్లప్పగించి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధికంగా వాడేస్తున్నారంటూ రైతులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోంది. అసలు తమకు కట్ట కూడా దొరకడం లేదంటూ ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే మితిమీరి వాడేస్తున్నారంటూ వారిని నిందిస్తోంది. అర్ధరాత్రి రోడ్డెక్కి లారీని అడ్డుకున్న రైతులు.. కొరత తీవ్రంగా ఉండడంతో కృష్ణా జిల్లా చినముత్తేవి గ్రామ రైతులు మంగళవారం అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీని అడ్డుకున్నారు. అందులో ఉన్న సరుకు తమకు పంపిణీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఎరువులతో వచ్చిన లారీ (ఏపీ 29 టీబీ 3974) డోకిపర్రులో కొన్ని బస్తాలు, చినముత్తేవిలోని ఓ ఎరువుల దుకాణంలో మరికొన్ని బస్తాలను దింపింది. చినముత్తేవి రైతులు దీన్ని గమనించి లారీని అడ్డుకున్నారు. ఏలూరు డీసీఎంఎస్ ఎరువుల కౌంటర్ వద్ద తోపులాట లారీ డ్రైవర్ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవటంతో ఆగ్రహించిన రైతన్నలు యూరియా కోసం అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు. అక్కడకు చేరుకున్న కూచిపూడి ఎస్సై రైతులతో మాట్లాడి లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి బుధవారం కూచిపూడి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లారీలోని ఎరువులకు బిల్లులు ఉన్నాయని చెప్పారు. ఆ లోడ్‌ను నిడుమోలులోని గంగా ఫెర్టిలైజర్స్‌కు పంపించి ఎకరాకు అరకట్ట వంతున ఏవో ఆధ్వర్యంలో పంపిణీ చేయించారు. గుడివాడలోని వ్యాగన్ నుంచి యూరియా 325 బస్తాలు, ఎంవోపీ (పొటాష్) 200 బస్తాలు, 16–16–16 రకం 80 బస్తాలు పంపామని, నిడుమోలు వెళుతుండగా రైతులు లారీని అడ్డుకుని ఆందోళన చేపట్టారని జేడీఏ పేర్కొన్నారు.