జగనన్న హరిత నగరాలకు శ్రీకారం 

జగనన్న హరిత నగరాలకు నేడు శ్రీకారం తొలి విడత కింద 45 పట్టణాలు ఎంపిక

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా పనులు

పల్నాడు జిల్లా కొండవీడులో నమూనాను ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

అనంతరం ‘వేస్ట్‌ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ పైలాన్‌ ఆవిష్కరణ

  అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ‘జగనన్న హరిత నగరాలు’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.

అక్కడే జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను(యూఎల్‌బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. పచ్చదనం పెంపుతో పాటు వాల్‌ పెయింటింగ్‌ తదితర పనులు చేపట్టి.. ఉత్తమ విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు ‘గ్రీన్‌ సిటీ చాలెంజ్‌’ కింద రూ.కోటి చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ సంస్థలు చేపట్టాయి.  

రూ.78.84 కోట్లతో పచ్చందం.. 
మొదటి విడతలో ఉన్న 45 యూఎల్‌బీల్లోని రోడ్లకు ఇరువైపులా, మధ్యనున్న మీడియన్స్‌లలో మొక్కలు నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి, వాతావరణం, నీటి వనరుల లభ్యత ఆధారంగా బతికే వివిధ జాతులకు చెందిన 54 రకాల మొక్కలను ఎంపిక చేసి పెంచనున్నారు. రహదారి వెడల్పును బట్టి ఐదు రకాలుగా విభజించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చదనం, సుందరీకరణ పనులకు రూ.78.84 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

తొలకరి ప్రారంభం నుంచి ఆగస్టు 12లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆయా మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటిన అనంతరం పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు అప్పగిస్తారు. అనంతరం ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌కు చెందిన క్వాలిటీ కంట్రోల్‌ బృందం 3 నెలలకు ఒకసారి పరిశీలించి.. మొక్కల సంరక్షణకు అవసరమైన సూచనలిస్తుంటుంది.  

సీఎం పర్యటన సాగేదిలా.. 
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.40కల్లా గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని సభావేదికకు చేరుకుంటారు. డాక్టర్ వైయ‌స్సార్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడుకు చేరుకుని జిందాల్‌ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జిందాల్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.   

Back to Top