బాబు సభలకు బలి పశువులు!

అమాయకుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం

జనం రాకపోవడంతో రకరకాల ఎత్తుగడలు

నిజంగా జన ప్రభంజనం ఉంటే విశాలమైన రోడ్లు లేవా?

ఇరుకు సందులో సభ వల్లే కందుకూరులో 8 మంది మృతి

గుంటూరు సభకు 15 రోజుల ముందే ఇంటింటి ప్రచారం..

 కానుకల పేరుతో మభ్యపెట్టి తరలించిన టీడీపీ నేతలు

అమరావతి: తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని తరచూ చెప్పుకునే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వేసిన ఎత్తుగడలు ప్రజల పాలిట శాపాలుగా మారాయి. ఆయన తీరు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఏమాత్రం పట్టనట్లు చేతులు దులుపుకొని వెళ్లిపోతుండడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు సభలకు స్పందన లేదనే విషయం అర్థమవడంతో ఇరుకు ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రజలు వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, అందువల్లే రెండుసార్లు తొక్కిసలాటలు జరిగాయని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. కందుకూరు, గుంటూరు సభలే ఇందుకు నిదర్శనం. 

విశాలమైన రోడ్లు లేవా? 
టార్గెట్లు నిర్దేశించి తన సభకు ప్రజలను తేవాలని చంద్రబాబు ఆదేశిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఎంత ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోకపోవడంతో ఏదో ఒక ఆశ చూపి తరలిస్తున్నారు. ఇందుకోసం ఇరుకు సందులు, చిన్న రోడ్లను ఎంచుకుంటున్నారు. కందుకూరు సభను అను­మతి తీసుకున్న విశాలమైన రోడ్డులో కాకుండా పక్కనే ఉన్న ఇరుకు సందులోకి చంద్రబాబు మార్చారు. అక్కడ తొక్కిసలాట జరిగి 8 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయా­యి. విశాలమైన రోడ్డు పక్కనే ఉండగా దాన్ని కాదని ఇరుకు రోడ్డులో సభ నిర్వహించడంలోనే చంద్రబాబు ఉద్దేశం స్పష్టంగా కనబడుతుతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లు జన ప్రభంజనమే ఉంటే విశాలమైన రోడ్లలో సభ ఎందుకు నిర్వహించడం లేదనే ప్రశ్నకు టీడీపీ ముఖ్య నేతల నుంచి సమాధానం లేదు.  

గుణపాఠం నేర్చుకోలేదు  
కందుకూరు సభలో జరిగిన ఘోరం నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ అదే తప్పులను చంద్రబాబు పునరావృతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గుంటూరులో తాజాగా చంద్రన్న కానుకల పంపిణీ సభకోసం 10–15 రోజుల నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజంగా ప్రజాదరణ ఉంటే ఇంటింటికీ తిరిగి కానుకలు ఇస్తామని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందా? జనం రారని గ్రహించే టోకెన్లు ఇచ్చిమరీ ప్రజలను, పేదలను మభ్యపెట్టారు.  

మొహం చెల్లకే.. 
గుంటూరు ఘటనపై చంద్రబాబు నోరు మెదపకపోవడాన్ని బట్టి ఆయనకు మొహం చెల్లడంలేదని అర్థమవుతోందనే వాదన వినిపిస్తోంది. ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నానని, అక్కడ తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ అది టీడీపీ సభ కాదని అడ్డంగా అబద్ధం ఆడేశారు. అదే నిజమైతే సభకు అనుమతుల నుంచి నిర్వహణ దాకా పూర్తిగా టీడీపీ నేతలే దగ్గరుండి పర్యవేక్షించడం నిజం కాదా?    

Back to Top