అమరావతి: ఏ అన్నదాతకూ ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి రాకూడదు. అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడితే... పాలకులు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాలి. కానీ చంద్రబాబు హయాంలో... పరిహారం కోసమే ప్రాణాలు తీసుకుంటున్నారని వారిని ఎగతాళి చేశారు. సాయాన్నీ గాలికొదిలేశారు. ‘ప్రశ్నిస్తా!’ అని పదేపదే అరిచే జనసేనాని పవన్‌కల్యాణ్ ఈ దురాగతంపై నోరెత్తితే ఒట్టు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలపై రీసర్వే చేయించారు. చంద్రబాబు హయాంలో మరణించిన 469 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచి మరీ అందజేశారు. దీన్ని ప్రశ్నించలేని జనసేనాని కొత్త రాగం అందుకున్నారు. రైతుల ఊసెత్తకుండా.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం సాయం చేయలేదంటున్నారు. ఏం! కౌలు రైతుల వివరాల్ని గ్రామ సచివాలయాల స్థాయిలో నమోదు చేసుకుని లక్షల మందికి సీసీఆర్‌సీ (గుర్తింపుకార్డులు) ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? వారందరికీ రైతు భరోసా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏపీ కాదా? పంటల బీమా సహా రైతులకిచ్చే అన్ని పథకాలనూ కౌలు రైతులకూ వర్తింపజేసింది ఈ ప్రభుత్వం కాదా? ఎవరు చనిపోయినా కౌలు రైతే అంటే ఎలా? కౌలురైతులు కాని సామాన్యులు ఆత్మహత్యకు పాల్పడినా వైఎస్సార్ బీమా కింద ప్రభుత్వం సాయం అందిస్తుండటం మీకు తెలీదా? చంద్రబాబు హయాంలో రైతులకు సైతం సాయం ఎగవేస్తే ప్రశ్నించలేదు ఈ దత్తపుత్రుడు. ఇపుడు కౌలు రైతులంటూ ఎందుకీ డ్రామా అన్నదే అందరి ప్రశ్న!!. ► మట్టినే నమ్ముకుని సేద్యం చేస్తున్న కౌలు రైతుల కడగండ్లను గుర్తిస్తూ దేశంలోనే తొలిసారిగా రైతు భరోసా నుంచి పంటల బీమా దాకా అన్ని రకాల ప్రయోజనాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందచేస్తోంది. లక్షల మంది కౌలు రైతులకూ గ్రామ సచివాలయాల ద్వారా సీసీఆర్సీ కార్డులను ఇచ్చి పంట రుణాలు సమకూర్చి వెన్ను తడుతోంది. గత సర్కారు హయాంలో వంచనకు గురై ఆత్మహత్యలకు ఒడిగట్టిన 469 మంది అన్నదాతల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం కింద రూ.23.45 కోట్లను చెల్లించింది. రుణమాఫీ పేరుతో మోసపోయిన రైతన్నలకు సాంత్వన చేకూరుస్తోంది. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి అన్ని సేవలను అక్కడే అందచేస్తోంది. విత్తనం నుంచి నూర్పిళ్ల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా ఉండే బాధ్యతను సంతోషంగా స్వీకరించింది. సాయంపై సేనాని బుకాయింపు గత సర్కారుకు రైతుల ఆత్మహత్యలను గుర్తించేందుకే మనసు రాలేదు. రుణమాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే ఆ డబ్బుల కోసమే చనిపోతారని వ్యాఖ్యానిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో పరిహారాన్ని చంద్రబాబు ఎత్తివేశారు. రైతుల ప్రాణాలకు వెల కట్టి చులకనగా మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కౌలు రైతులతో సహా రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటం, తాను వచ్చాకే సాయం అందుతోందంటూ బుకాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాపరికం లేకుండా.. పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2019 జూన్ 1వతేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వతేదీ వరకు ఆత్మహత్యలు చేసుకున్న 41 మంది రైతన్నల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. గత సర్కారు రైతుల ఆత్మహత్యలను కనీసం నమోదు చేయకపోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాపరికం లేకుండా పారదర్శకంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తోంది. ఎప్పటికప్పుడు వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకుంటోంది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా.. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతు శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల వివరాలు సేకరించి ఆదుకోవాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మే 31 వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డ 773 మంది రైతులకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని నిర్దేశించారు. విచారణ అనంతరం 469 రైతు కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు అర్హులని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పన మొత్తం రూ.23.45 కోట్లను చెల్లించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 19 మంది కూడా ఉన్నారు. పరిహారం పెంపు.. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 2019 అక్టోబర్ 14న జీవో 102 జారీ అయింది. పెంచిన పరిహారాన్ని 01–06–2019 నుంచి వర్తింప చేసేందుకు వీలుగా 20–02–2020న మరో జీవో 43 జారీ చేశారు. ఈ జీవోల ప్రకారం 01–06–2019 నుంచి 31–12–2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న 308 మంది రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.21.56 కోట్లను ఎక్స్‌గ్రేషియాగా చెల్లించారు. ఇదే ప్రకారం 2020 సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకున్న 260 రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.18.20 కోట్లను పరిహారంగా చెల్లించారు. ఇక 2021 సంవత్సరంలో 126 రైతు కుటుంబాలకు రూ.8.82 కోట్లను అందచేశారు. గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలతో కలిపి 2021 వరకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.72.145 కోట్లను చెల్లించారు. కలెక్టర్ల వద్ద కార్పస్ నిధి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను తక్షణం ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లా కలెక్టర్ వద్ద కార్పస్ నిధిగా కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచింది. 2021–22 బడ్జెట్‌లో బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రూ.20 కోట్లను కేటాయించగా రూ.15.345 కోట్లు వ్యయం చేసింది. 2022–23 బడ్జెట్‌లోనూ పరిహారం కోసం రూ.20 కోట్లను కేటాయించారు. పశ్చిమలో 41 కుటుంబాలకు పరిహారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 జూన్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 2 వరకు 41 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా ప్రభుత్వం అందరికీ పరిహారం చెల్లించింది. సాగు చేస్తున్నట్లు నిర్థారించిన 26 మందికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా ఇతరులకు అలాంటి రుజువులు లేకున్నా మానవత్వంతో వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించారు. ఇందులో నాలుగు రైతు కుటుంబాలకు రూ.రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించగా 11 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. పరిహారంతో పాటు పథకాలూ.. బాధిత కుటుంబాలకు కేవలం ఎక్స్‌గ్రేషియా మాత్రమే కాకుండా వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఒక్కో కుటుంబానికి కనిష్టంగా రెండు.. గరిష్టంగా ఏడు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, రైతు భరోసా, వైయస్సార్ చేయూత, జగనన్న తోడు, వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ తదితర పథకాలను ఆ కుటుంబాలకు వర్తింప చేస్తున్నారు.