అభివృద్ధికి దిక్సూచి.. వైయస్‌ రాజశేఖరరెడ్డి

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించిన మానవతామూర్తి

జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు జీవం పోసిన రాజకీయవేత్త

మండుటెండలో 1,475 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ప్రజానేత

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేసిన రైతు బాంధవుడు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నిరుపేదలకు సరస్వతీ కటాక్షం

పారదర్శక విధానాలతో పారిశ్రామికాభివృద్ధి.. పెట్టుబడుల ఆకర్షణలో అగ్రగామిగా రాష్ట్రం.. 

మహానేత ఒక అడుగు వేస్తే.. నాలుగు అడుగులు ముందుకేస్తున్న సీఎం జగన్‌

 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. వైయస్ఆర్.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత.

పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించిన వైయస్ఆర్.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చారు. ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి సాధించారు. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పి, అభివృద్ధికి సరైన నిర్వచనం చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలనే కేంద్రం, అనేక రాష్ట్రాలు చేపట్టాయి. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. 

అమరావతి: వైయస్ఆర్ జిజిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న వైయస్‌ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన వైయస్‌ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి.. రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైయస్‌ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. 

సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలలే పని చేశారు. మంచి చేయాలన్న మనసుంటే.. ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే చేసి చూపించారు. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటి చెప్పారు. అందుకే ఆ మహానేత భౌతికంగా దూరమై 14 ఏళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

పేద బిడ్డల చదువులకు పెన్నిధి.. పేదరికానికి విద్యతో విరుగుడు
పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి.. దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.

దీనివల్ల లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ని హైదరాబాద్‌ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదవులు దక్కేలా చేశారు. నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఆ తర్వాత అనేక రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి.

పారిశ్రామికాభివృద్ధితో పుష్కలంగా ఉపాధి అవకాశాలు
ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 వరకు పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతికి కేంద్రంగా మార్చారు. దాంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం, సమృద్ధిగా సహజవనరులు, పుష్కలంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నా పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానానికి పరిమితమైంది. వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చాక పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. దాంతో రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.

భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించిన వైయస్ఆర్.. యుద్ధప్రాతిపదికన గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి.   

జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు పాదయాత్రతో జీవం 
అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్‌ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైయస్‌ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్‌ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్‌ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైయస్ఆర్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను,  అటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగల మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. 

పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన నేత
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైయస్‌ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్‌ ఛార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేయడం ద్వారా పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు.

దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తే విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు.

వైఎస్సార్‌ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో  పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.

మాంద్యం ముప్పును తప్పించిన ఆర్థికవేత్త
2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైయస్ఆర్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేశారు. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. వైయస్ఆర్ ఆర్థిక ప్రణాళికను చూసి అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు.

 

అజేయుడు.. రాజశేఖరుడు
1978లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రంవిపక్షంలో ఉన్నా.. అధికారం చేపట్టినా ప్రజల కోసమే పోరాడిన యోధుడుమూడు దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని ధీరుడుపులివెందుల నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికకడప లోక్‌సభ స్థానం నుంచి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం

 సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు. అలాంటి నాయకుల్లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముందువరుసలో నిలుస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసం ఎందాకైనా పోరాడే ధీశాలికి జనం వెన్నంటి నిలిచి అజేయుడిని చేశారు. 

మదిలో పదిలం.. ఎన్నటికీ మరువలేం: 
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జయమ్మ దంపతులకు 1949, జూలై 8న జన్మించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కర్ణాటకలో గుల్బార్గాలోని ఎమ్మార్‌ వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారు. పులివెందులలో 1973లో తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పేరుతో 70 పడకల ఆస్పత్రిని ప్రారంభించి.. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేశారు. రూపాయికే వైద్యం చేస్తూ ప్రజలకు చేరువ­య్యారు.

తక్కువ సమయంలోనే రూపాయి డాక్టర్‌గా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1978లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. శాసనసభకు ఎన్నికైన తొలి సారే అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకుని 1980 నుంచి 83 వరకూ గ్రామీణాభివృద్ధి, విద్య, ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు.

ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ..
సినీనటుడు ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రం చేసి.. టీడీపీని స్థాపించి 1983 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ పులివెందుల శాసనసభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లోనూ పులివెందుల నుంచి విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్‌ కొట్టారు.

వైఎస్‌తోపాటు 1978లో చంద్రగిరి నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్‌పైనే పోటీచేసి విజయం సాధిస్తానని బీరాలు పలికారు. కానీ.. ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్‌ గాలిలో కొట్టుకుపోయి టీడీపీ పంచన చేరి.. 1985 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పానికి వలస వెళ్లడం గమనార్హం.

వైరిపక్షాలు ఏకమైనా..
రాజీవ్‌గాంధీ సూచన మేరకు 1989 ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. 1.66 లక్షల మెజార్టీతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి 4.18 లక్షల రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించారు.

ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. 1996 లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఓడించడానికి అధికార దుర్విని­యో­గానికి పాల్పడి.. కాంగ్రెస్‌లో వైఎస్‌ వైరిపక్షాలతో బాబు కుట్రలు చేశారు. కానీ.. ఆ కుట్రలను  చిత్తు చేసి విజయకేతనం ఎగురవేసి, ఎంపీగానూ హ్యాట్రిక్‌ కొట్టారు. ఆ తర్వాత 1998 ఎన్నికల్లోనూ కడప లోక్‌సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు.

డబుల్‌ హ్యాట్రిక్‌
పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్‌ కొట్టిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి రెండోసారి హ్యాట్రిక్‌ సాధించారు. 

జనం మెచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉభయ రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణించి 14 ఏళ్లు గడిచినా ఆయన పాలనను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే.. ఆయన ఎంత ప్రజారంజకంగా పాలించారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఓట్ల రాజకీయాలకు వైఎస్సార్‌ స్వస్తి చెప్పారు. ఎన్నికల్లోనే రాజకీయాలు తప్ప.. తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉండేవారు. ఓటు వేయని వారితోపాటు ప్రజలందరికీ ముఖ్యమంత్రిననే రీతిలో వైఎస్సార్‌ పాలన సాగించారు. అర్హులైన వారందరికీ పథకాలను సంతృప్త స్థాయిలో అందించారు. ఇతర పార్టీల వారికి పథకాలు ఇస్తున్నారని స్వపక్ష ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా.. ప్రజలందరికీ ముఖ్యమంత్రిని గానీ కొందరికే కాదనే సమాధానం వైఎస్సార్‌ నుంచి వచ్చేది.  
– రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఎంజీవీకే భాను

భవిష్యత్‌ తరాల మేలు కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన అరుదైన నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గొప్ప ఆలోచనలతో ధైర్యంగా ముందుకు సాగిన రాజనీతిజ్ఞుడు. హైదరాబాద్‌లో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆయన దార్శనికతకు నిదర్శనం. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వెడల్పు పెంచి రాయలసీమ గొంతు తడిపింది కూడా దివంగత మహానేతే. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి సాయం చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల్లో వైఎస్సార్‌కు ఎవరూ సాటిరారు. తారతమ్యాలు లేకుండా ఎవరికైనా సాయమందించేవారు. – విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌రెడ్డి 

రాజన్న రాజ్యంలో రైతే రారాజు
 
 వైఎస్సార్‌ వేసిన ప్రతీ అడుగు, చేసిన ప్రతీ ఆలోచన రైతుల కోసమే. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో అమలుచేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలలో చెరగని ముద్రవేశాయి. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకంతో మొదలైన తన పాలనలో అడుగడుగునా రైతులకు తోడుగా నిలిచారు.

రుణమాఫీతో రైతుకు వెన్నుదన్ను..
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రుణమాఫీని అమలుచేయగా, దేశంలోనే అత్యధికంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 64లక్షల మంది రూ.11,100 కోట్ల లబ్ధిపొందారు. రుణమాఫీ దక్కని 36 లక్షల మంది రైతులకు “ప్రోత్సాహం కింద’ ఒకొక్కరికి రూ.5వేల చొప్పున రూ.1,800 కోట్లు అందించారు. పునరావాస ప్యాకేజీ కింద.. వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన భూ యజమా­నులు, కౌలుదారుల కుటుంబాలకు సైతం రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా అందించారు. అలాగే, ఉమ్మడి ఏపీలోని 23 డీసీసీబీల్లో 18 డీసీసీబీలు దివాళ తీసే స్థాయికి చేరుకోగా, వైద్యనాథన్‌ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800 కోట్ల సాయం అందించి సహకార రంగం పునరుజ్జీవానికి బాటలు వేశారు. ప్రపంచంలోనే తొలిసారి పావలా (3 శాతం) వడ్డీకే రుణాలకు శ్రీకారం చుట్టారు.

కనీస మద్దతు కనీవినీ రీతిలో పెంపు..
1999లో క్వింటాల్‌కు రూ.490 ఉన్న ధాన్యం కనీస మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550కు చేరింది. ఐదేళ్లలో పెరిగిన ఎమ్మెస్పీ కేవలం రూ.60 (12.5%) మాత్రమే. అలాంటిది 2004–09 మధ్య రూ.550 నుంచి రూ.1,000కు అంటే అక్షరాల రూ.450 (78.5%) పెరిగిందంటే అది ఆ మహానేత కృషి ఫలితమే. ధాన్యంతో పాటు ఇతర పంటల మద్దతు ధరను భారీగా పెంచగలిగారు.

తండ్రి బాటలో తనయుడు
రైతుల కోసం ఆ మహానేత ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానంటూ అధికారంలోకి వచ్చింది మొదలు నాలుగేళ్లుగా రైతు సంక్షేమం కోసమే సీఎం జగన్‌ అహరహం శ్రమిస్తున్నారు. మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవంగా రైతుల మధ్యలో జరుపుకుంటున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించేలా ఆర్బీకేలు తీసుకొచ్చారు. సహకార రంగ బలోపేతానికి రూ.295 కోట్ల మూలధనంగా సమకూర్చారు.

ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇక సంక్షేమ పరంగా చూస్తే.. వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా రైతు సంక్షేమం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం అక్షరాల రూ.1,70,769.23 కోట్ల లబ్ధిని చేకూర్చింది.

అపర భగీరథుడు
 దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల 1995 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కదిలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆయన బాస చేశారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే.. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుతోసహా అనేక ప్రాజెక్టులను జలయజ్ఞం కింద కార్యరూపంలోకి తెచ్చారు.

2004–05లో రాష్ట్ర బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. 2014 మే 14 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు అంటే ఐదేళ్ల మూడు నెలల్లోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25  ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 19.53 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 3.96 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు.  

సాగునీటి రంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టం: వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తండ్రి వైఎస్సార్‌ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్‌ హయాంలో అడ్డుతగిలిన తరహాలోనే ఇప్పుడూ చంద్రబాబు సైంధవుడిలా అడ్డుతగులుతున్నారు. అయినా సీఎం జగన్‌ వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా ద్వారా కర్నూలు పశ్చిమ మండలాల్లో 68 చెరువులను నింపే పథకం, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తి కావొస్తున్నాయి.

నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్‌ వాల్‌తో అడ్డుకట్ట వేశారు. బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ 2019, 2020, 2021, 2022లలో ఏటా సగటున కోటి ఎకరాలకు నీళ్లందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణ, ప్రణాళికా సంఘం సహా అవసరమైన అన్ని అనుమతులను సాధించారు. భారీ వ్యయమయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి.. కేంద్రం ఇచ్చే 90 శాతం వాటా నిధులతో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేశారు.

ఆ ప్రయత్నాలన్నీ సఫలమై ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చే సమయంలోనే వైఎస్సార్‌ హఠాన్మరణం చెందారు. విభజన నేపథ్యంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అప్పటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చంద్రబాబు పాపం ఫలితంగా గోదావరికి వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు.  

 

నా అనుకున్న వాళ్లకోసం ఎంతవరకైనా
  ‘నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిది. అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడు. మమ్మల్ని కూడా నవ్వుతూ ఉండమనేవారు. ఒక్కోసారి చిన్నపిల్లాడిలా మారిపోయేవారు.

నా లాంటి ఎందరికో రాయకీయ పునాదులు వేసిన నాయకుడు’ అంటూ మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ‘వైఎస్సార్‌ కేవలం మంచి వాడే కాదు.. అంతకు మించిన వాడు’  అని ‘సాక్షి’కి చెప్పారు. వైఎస్సార్‌ తనను ఎంతగానో ప్రోత్సహించేవారని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top