జగన్‌ను సిఎంను చేయాలని జనం నిర్ణయించారు

 చంద్రన్న రాజ్యం తెస్తానని చెప్పే దమ్ముందా?
చంద్రబాబుకు మేకపాటి ‌రాజమోహన్‌రెడ్డి సవాల్

హైదరాబాద్, 13 అక్టోబర్‌ 2012: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా‌ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన పార్టీ ఘన విజయం సాధిస్తుందని, జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ప్రజలు దృఢచిత్తంతో నిర్ణయించుకున్నారని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం చంద్రబాబుకు అందరికన్నా ముందే తెలుసని ఆయన అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జగన్‌ సిఎం కావడం తథ్యమన్నారు. అధికారం అప్పగిస్తే 'రాజన్న రాజ్యం' తీసుకువస్తామని ధైర్యంగా చెప్పి ప్రజల్లోకి తాము వెళ్ళగలమని మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రన్న రాజ్యాన్ని మళ్ళీ తెస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా అని ఆయన సవాల్‌ చేశారు.


అవిశ్వాసం అంటే ఏమిటో వైయస్ విజయమ్మకు తెలియదని, అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో కూడా ‌అవగాహన లేదని, అసెంబ్లీ జరుతున్నప్పుడు మాత్రమే పెట్టాలన్న విషయం ఆమెకు తెలిదంటూ చంద్రబాబు విమర్శించడాన్ని మేకపాటి తీవ్రంగా ఖండించారు. దివంగత మహానేత వైయస్‌ సహధర్మచారిణిగా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా విజయమ్మకు అలాంటి ప్రాథమిక విషయాలు తెలిసే ఉంటాయన్నది తన అభిప్రాయమన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్వర్తించాల్సిన బాధ్యతనే విజయమ్మ గుర్తుచేశారని అన్నారు. తొమ్మిదేళ్ళు సీఎంగా వ్యవహరించి, ఎనిమిదేళ్ళుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్న చంద్రబాబుకు ఈ మాత్రం తెలియదని తాము అనుకోవడం లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో మేకపాటి మాట్లాడారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా దారుణంగా విఫలమైందని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. రైతులకు నాలుగు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయలేని దుస్థితి నెలకొన్నదని, అది కూడా రెండు విడతలుగా ఈ ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోయాయని, గ్యాస్‌ బండ ధర భారంగా మారిందని, అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వానికి ప్రజల సమ్మతి లేదన్నారు. మహానేత వైయస్‌ తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత పాలకులు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడంలేదని విమర్శించారు. ఆ పథకాలను కొనసాగించి ఉంటే ప్రజలు విశ్వసించి ఉండేవారన్నారు. ఇలా విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానిదే అని ఆయన గుర్తుచేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవిశ్వాసం పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుదే అన్నారు. అంతే గాని విజయమ్మ మాటలకు చంద్రబాబు విపరీతార్థాలు చేయడం ఏమిటని మేకపాటి నిలదీశారు.

తమను అవిశ్వాసం పెట్టమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేయడం ఢిల్లీలో బేరాలు చేసుకోవడానికే అని టిడిపి నాయకులు చేస్తున్న చవకబారు ఆరోపణలను మేకపాటి తీవ్రంగా ఖండించారు. అలాంటి పరిస్థితే ఉంటే ఇప్పటికి నాలుగున్నర నెలలుగా జగన్మోహన్‌రెడ్డి అక్రమంగా జైలులో ఎందుకు ఉండాల్సి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. సిబిఐ, ఈడీ సంస్థల విచారణలతో ఎందుకు ఎందుకు ఇబ్బందులు పడతారని నిలదీశారు. కేవలం తమ పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కై జగన్‌ను జైలులో పెట్టించాయని మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు, కాళ్ళు కట్టేసి మల్లయుద్ధం చేయమన్న రీతిలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని జైలులో నిర్బంధించి చంద్రబాబు పాదయాత్ర, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట పేరుతో యాత్రలు చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. షర్మిల పాదయాత్ర చేస్తున్నారంటేనే కాంగ్రెస్‌, టిడిపిలు వణికిపోతున్నాయన్నారు. జగన్మోహన్‌రెడ్డి సూచన మేరకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని మేకపాటి వివరించారు. షర్మిల పాదయాత్రను ప్రజలు ఎలా ఆదరిస్తారో త్వరలోనే తెలుస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ప్రజాభిమానం అందరికీ తెలిసిందే అన్నారు.

2009 ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఒక్కచోటైనా గెలిచిందా? అని మేకపాటి సూటిగా ప్రశ్నించారు. రెండు పార్లమెంటు ఉప ఎన్నికల్లోను, సగం అసెంబ్లీ స్థానాల్లో కూడా టిడిపికి డిపాజిట్లు రాని విషయం గుర్తుచేశారు. చంద్రబాబు అనవసర విమర్శలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. షర్మిల పాదయాత్ర అనగానే చంద్రబాబుకు అంత భయం ఎందుకని ఎద్దేవా చేశారు. 'మరో ప్రజా ప్రస్థానం'తో షర్మిల చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రెండు మూడు నెలలు ఆలస్యమైనా జగన్‌ బయటికి వస్తారని, ఆ వెంటనే ఆయనే పాదయాత్రను కొనసాగిస్తారని చెప్పారు. ఆయన వచ్చాక ప్రజాభిమానం ఏ మేరకు ఉంటుందో స్పష్టం అవుతుందన్నారు. 

ఐదున్నర సంవత్సరాలు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పరిపాలనను అందించారని మేకపాటి గుర్తు చేశారు. అదే రాజన్న రాజ్యాన్ని జగన్‌ నేతృత్వంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీసుకువస్తుందన్న ధీమాను ఈ రాష్ట్ర ప్రజలకు తాము ధైర్యంగా ఇవ్వగలమన్నారు. 1995 నుంచి 2004 వరకూ చంద్రబాబు అదే పరిపాలనను తాను తీసుకువస్తానని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మేకపాటి ఎద్దేవా చేశారు. రకరకాల వాగ్దానాలు చేస్తూ చంద్రబాబు ప్రజలను ఏమార్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై పనికిమాలిన విమర్శలు చేయడం తగదని మేకపాటి హితవు పలికారు. ఎన్నికలంటే చంద్రబాబుకు ఎందుకంత భయం అని నిలదీశారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వం కూలిపోతే ఎన్నికలు వస్తాయని, అప్పుడు మీకు ఎదురయ్యే దుస్థితి తెలిసే భయపడుతున్నారా అని ఆయన ప్రశ్నించారు.

కాగా, రాష్ట్రపతి ఎన్నికలో తమకు ప్రణబ్‌ముఖర్జీ, పి.ఎ. సంగ్మా రెండే ఆప్షన్లు ఉన్నాయని, వాటిలో ప్రణబ్‌కు ఓటు వేయాలని తమ పార్టీ ఎంచుకుందన్నారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులతో తామేం నిరసన వ్యక్తం చేయగలమని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మేకపాటి జవాబిచ్చారు. ప్రణబ్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తారని‌ తాము భావించామని, అందుకే ఆయనకు ఓటేశామన్నారు. తమ నిర్ణయాన్ని ప్రజలు కూడా హర్షించారన్నారు. ముందులో ప్రణబ్‌కు ఓటు వేస్తామని చంద్రబాబు కూడా చెప్పారని, తరువాత ఎందుకు వెనక్కి వెళ్ళారో తెలియదన్నారు.

రాబర్టు వాద్రా విషయంపై మీ కామెంట్‌ ఏమిటన్న మరో విలేకరి ప్రశ్నకు మేకపాటి బదులిస్తూ, తప్పు ఎవరు చేసినా విచారణ తప్పదన్నారు. చంద్రబాబుకు కూడా త్వరలో అలాంటి పరిస్థితి ఎదురు కావచ్చన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నిర్వాకంపైన కూడా విచారణ తప్పదన్నారు. షర్మిల ఏ హోదాలో వైయస్‌ఆర్‌సిపి తరఫున పాదయాత్ర చేస్తున్నారన్ మరో ప్రశ్నకు.. ఏ హోదాలో బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ టిడిపి తరఫున ప్రచారం చేశారని ప్రశ్నించారు. షర్మిల జగన్మోహన్‌రెడ్డి సోదరిగా, వైయస్‌ కుమార్తెగా పాదయాత్ర చేస్తారని వివరించారు. గత ఉప ఎన్నికల సందర్భంగా తన నియోజకవర్గంలో కూడా షర్మిల ప్రచారం నిర్వహించారని, ఆమె ప్రచారం వల్ల తనకు మరింత అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయని తెలిపారు.

వయస్సు పైబడిన చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు మేకపాటి సమాధానం చెప్పారు. 'I wish him all the best' అని మీడియా ద్వారా చంద్రబాబును శుభాకాంక్షలు చెప్పారు. అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా? లేదా? అన్నది సమస్య కాదని, తద్వారా అయినా, ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైందో ఎండగట్టే అవకాశం వస్తుందని మేకపాటి వ్యాఖ్యానించారు. సభలో పదో వంతు అంటే 30 మంది ఎమ్మెల్యేల బలం లేదు గనుకే అవిశ్వాసం పెట్టలేకపోతున్నామని ఒక విలేకరి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రభుత్వం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే అప్పుడు, లేదా వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అయినా టిడిపి అవిశ్వాసం పెట్టవచ్చని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top