వీహెచ్ సమావేశానికి స్పందన కరవు

హైదరాబాద్: అవకాశం దొరికినప్పుడల్లా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, తదుపరి తన గురిని వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై పెట్టారు. వైయస్ఆర్ నూ, జగన్‌నూ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ప్రజాప్రస్థానం వైయస్ఆర్ పాదయత్రపై కేవీపీ రామచంద్రరావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావద్దని వీహెచ్ స్వయంగా వెళ్ళి పార్టీ పెద్దలకు విన్నవించారు. ఆయన మాటను ఎవరూ వినలేదు. సోనియాగాంధీకి సన్నిహితంగా మెలిగే మోతీలాల్ ఓరా, దిగ్విజయ్ సింగ్, ఆర్.కె. ధావన్, తదితరులు కార్యక్రమానికి హాజరు కావడం ఆయనను నిశ్చేష్టుణ్ణి చేసింది. సేవ్ కాంగ్రెస్ పేరిట శనివారం ఆయన హైదరాబాద్‌లో తలపెట్టిన మేథోమధన సదస్సుకు ఇద్దరు మినహా ప్రజాప్రతినిధులెవరూ రాకపోవడం అశనిపాతమైంది.  పార్టీలోని కోవర్టులు, వైఎస్ మద్దతుదారుల మూలంగా పార్టీకి నష్టం వాటిల్లుతోందని ఆయన ఈ కార్యక్రమాన్ని  ఏర్పాటు చేశారు.  వచ్చిన తన మద్దతుదారులతోనే ఆయన సమావేశాన్ని అయ్యిందనిపించారు. 
పార్టీ వరసగా ఎందుకు ఓడిపోతోందనే దానిపై చర్చ జరగాలన్న తన సూచనను పీసీసీ పట్టించుకోకున్నా తానే చొరవ తీసుకుని ఏర్పాటు చేశానని వీహెచ్ చెప్పారు.  నామినేటెడ్‌ పదవులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడం కష్టమనీ, అవినీతి ఆరోపణలతో యూపీయే సర్కారు ప్రతిష్ట దెబ్బతిన్నదనీ వాపోయారు. రాష్ట్రంలోనూ గడ్డు పరిస్థితులే ఉన్నాయన్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం అంశం, సీమాంధ్రలో జగన్‌ ప్రభంజనంతో కుదేలైన కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు  యువ కాంగ్రెస్‌ నేతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరోవంక వీహెచ్ మేధోమధనంపై వివిధ వెబ్ పోర్టల్సు వ్యంగ్య కథనాలను రచించాయి.
వి.హెచ్. పరువు కాపాడిన చిరంజీవి
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి హాజరవడంతో కాస్త పరువు దక్కినట్లయింది. ఆయన కెవిపి రామచంద్రరావు ఢిల్లీలో ఏర్పాటు చేసిన వై.ఎస్.డైరీ ఆవిష్కరణకు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ పై పరోక్ష విమర్శలు కురిపించారు. గతంలోని పధకాలు ఇప్పుడు కూడా అమలు జరుగుతున్నాయని , ఇంకా మెరుగ్గా కూడా చేస్తున్నారని ఆయన చెప్పారు.  బిసిలకు న్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనేనని చిరంజీవి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 


Back to Top