హైదరాబాద్, 21 డిసెంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన మాతృమూర్తి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆశీస్సులు అందజేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని శ్రీమతి వైయస్ విజయమ్మతోపాటు ఆయన సతీమణి శ్రీమతి భారతి, ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడు మాసాలుగా జైలులో ఉంటున్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో వారు కొద్ది సేపు మాట్లాడారు. త్వరలోనే బయటకు రావాలని ఆకాంక్షిస్తూ తల్లి శ్రీమతి వైయస్ విజయమ్మ ఆశీర్వదించారు. దేవుడి దయవలన న్యాయం గెలుస్తుందని, ఆ నమ్మకంతోనే ధైర్యంగా ఉండాలని సూచించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జైలు బయట ఏర్పాటు చేసిన కేక్‌ను శ్రీమతి వైయస్ విజయమ్మ కట్ చేశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని అన్నారు. జై జగన్, జై జై జగన్... అంటూ అభిమానుల నినాదాలతో జైలు పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు, రోగులకు పండ్లు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, రక్తదాన శిబిరాల వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు.గురువారం అర్థరాత్రి నుంచే పార్టీ శ్రేణులు శ్రీ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు చేశారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరగా బయటకు రావాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు.