చంద్రబాబుది చీకటి యాత్ర!

ఖమ్మం 26 ఏప్రిల్ 2013 : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చీకట్లో, ప్రజలతో సంబంధం లేకుండా "మూన్‌వాక్" లాగా సాగిందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. రికార్డుల కోసమే చంద్రబాబు పాదయాత్ర చేశారనీ, అందుకే మైలురాళ్లు దాటినప్పుడల్లా కేకులు కట్ చేసుకుంటూ, పైలాన్లు ఆవిష్కరించుకుంటూ సాగారని ఆమె విమర్శించారు. నాడు మహానేత వైయస్ పాదయాత్ర మండుటెండల్లో మే నెలలో సైతం సాగగా, చంద్రబాబు శీతాకాలంలో పాదయాత్ర సాగించి మే ఎండలకు ముందే అర్ధంతరంగా ఇచ్ఛాపురం దాకా పోకుండా నిలిపివేస్తున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి, ముగించేటప్పటికి టీడీపీకి ఉండిన 90 మంది ఎమ్మెల్యేలలో 74 మందే మిగిలారని ఆమె ఎద్దేవా చేశారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా ఖమ్మం జెడ్‌పీ సెంటర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

ఇచ్ఛాపురం దాకా కాకుండా అర్ధంతరంగా పాదయాత్ర నిలిపి వేస్తున్న బాబు
వైయస్ నాడు మండుటెండల్లో మే నెలలో పాదయాత్ర చేసి చూపారన్నారు. కానీ చంద్రబాబు శీతాకాలంలో పాదయాత్ర మొదలు పెట్టి మేలో ఎండలొస్తున్నాయని ఇచ్ఛాపురం లో ఆపాల్సిన పాదయాత్రను అర్ధంతరంగా ఆపేస్తున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీస పోలీసు భద్రత కూడా కల్పించలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ప్రతిపక్షనాయకుడిగానే పాదయాత్ర కొనసాగిస్తున్నారనీ, అయితే ప్రభుత్వం ఈయనకు జెడ్ ప్లస్ కేటగిరీలో భద్రత కల్పించి సగర్వంగా పంపిందని ఆమె వ్యాఖ్యానించారు. నాడు రాజశేఖర్ రెడ్డిగారు పాదయాత్ర జరిపినప్పుడు ప్రజల మధ్యనే ఉండాలని టెంట్‌లో పడుకోగా, చంద్రబాబు మాత్రం ఏసీ బస్‌లో గడిపి నెత్తిమీద ఒక ఫ్యాన్ పెట్టుకుని మరీ పాదయాత్ర చేశారని శ్రీమతి షర్మిల హేళన చేశారు. చంద్రబాబు పాదయాత్ర రోడ్డు మీద కంటే రోడ్డు పక్కనే ఎక్కువగా సాగిందన్నారు. భూమిని చదును చేయడానికి ఒక జేసీబీ. ఒక రోడ్ రోలర్ వాడారనీ, ఆ తర్వాత దుమ్ము లేవకుండా ఉండేందుకై లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్లతో ఆ రోడ్డును తడిపి చంద్రబాబు పాదయాత్ర చేశారని ఆమె విమర్శించారు. పాదయాత్ర చేసిన గ్రామాలలో తాగడానికి కూడా నీళ్లు లేకపోతే ఈయన నడవడానికి లక్షల లీటర్లు వాడి వృథా చేశారన్నారు. దీనిని బట్టే చంద్రబాబుకు ప్రజల కష్టాల మీద ఏ పాటి శ్రద్ధ ఉందో తెలుస్తోందన్నారు. ఈయన వృథా చేసిన నీటిని ఆ గ్రామలకు తాగడానికి ఇచ్చి ఉంటే కాస్తయినా పుణ్యం దక్కి ఉండేదన్నారు. 

రికార్డుల కోసమే సాగిన యాత్ర
"అర్ధరాత్రి వస్తున్నా మీ కోసమని దొంగలంటారు...కానీ చంద్రబాబు పాదయాత్ర కూడా చీకట్లోనే సాగింది. ఎండిపోయిన పంటలు చూడాలన్నా, ప్రజలు పడుతున్న కష్టాలు చూడాలన్నా వెలుగుండాలి. కానీ చంద్రబాబు మాత్రం సాయంత్రం చీకటి పడ్డాక గ్రామాలు నిద్రపోయాక ఎవరిని పలకరించి ఎవరి కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారో అర్థం కావడం లేదు. ఎలాగూ ఈయన పాదయాత్రలో పాల్గొనేది ఆయన సెక్యూరిటీ, ఆయన పార్టీ నాయకులే కనుక ప్రజలతో సంబంధం లేకుండానే సాగింది ఆయన పాదయాత్ర" అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాదయాత్ర ప్రజలకు సంబంధం లేకుండా రికార్డుల కోసం చేసిన పాదయాత్ర కనుక అది మూన్‌వాక్‌లా సాగిందని అని ఆమె విమర్శించారు. నాడు వైయస్ ప్రజల కష్టాలకు చలించిపోయారనీ, కానీ చంద్రబాబు ప్రజల కడగండ్లను చూస్తూ కూడా చలనం లేకుండా సాగారన్నారు. స్పందించే ఏ నేత అయినా మైలురాళ్లు దాటినప్పుడల్లా కేకులు కట్ చేసుకోడని ఆమె ఆక్షేపించారు. కానీ రికార్డుల కోసం పాదయాత్ర సాగింది కనుక పైలాన్లు పెట్టుకుంటూ సాగారన్నారు. మాట నిలుపుకునే అలవాటు లేదు కనుక చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేస్తూ పోయారన్నారు. ఇప్పుడు చెబుతున్న మాటలన్నీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో చేతల్లోకి ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు వద్ద సమాధానం లేదన్నారు.

జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వైయస్ ప్రతి పథకానికీ జీవం
"మేము ధైర్యంగా చెబుతున్నాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్ రెడ్డిగారి ప్రతి పథకానికీ జీవం పోస్తాం" అని శ్రీమతి షర్మిల ప్రకటించారు. కానీ తన తొమ్మిదేళ్ల పథకాలను తిరిగి అమలు చేస్తాననే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. అందుకే ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్, రైతురుణ మాఫీ వంటి వైయస్ పథకాలనే అమలు చేస్తానంటున్నాడని ఆమె వ్యాఖ్యానించారు. 
బెల్టుషాపులు పెట్టించిన చంద్రబాబు మద్యం ధరలు పెరిగిపోయాయం టూ బాధపడుతున్నారన్నారు. అధికారంలోకి వస్తే సరసమైన ధరలకే మద్యం అందిస్తానంటున్నా డన్నారు. తక్కువ ధరకే ఎక్కువ తాగవచ్చునంటున్న ఈయన ఏ రకం నాయకుడో అర్థం కావడం లేదని ఆమె తూర్పారబట్టారు.

పాదయాత్ర  ముందుకు సాగినట్లా? వెనక్కి సాగినట్లా? 
2009లో టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేలుంటే చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టి ముగించేసరికి 74 మంది మాత్రమే మిగిలారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. 90 మంది ఎమ్మెల్యేలు కాస్తా 74 అయ్యారంటే చంద్రబాబుగారు తన పాదయాత్ర ముందుకు చేశారో, వెనక్కి చేశారో, ఆయన పాదయాత్రతో టీడీపీ ముందుకు వెళ్లిందో, వెనక్కి వెళ్లిందో ఆ పార్టీ నాయకులే తేల్చుకోవాల్సిన విషయమని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షనాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీసేది పోయి ప్రభుత్వానికి అమ్ముడుపోయారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టినా కూడా ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు విప్ జారీ చేశారన్నారు. ఇదే పాదయాత్రలో చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 

ఇదే పాదయాత్రలో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన బాబు
ఇదే పాదయాత్రలో చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్మేసుకున్నారన్నారు. చేతల్లో ప్రజల మీద ప్రేమ నిరూపించుకోలేని చంద్రబాబు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం ఉండదన్నారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా ఎందుకు కాపాడారని నిలదీస్తే చంద్రబాబు దగ్గర సమాధానం లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కుట్రలు పన్ని సీబీఐని వాడుకుని జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి జైలుపాలు చేశారని ఆమె ఆరోపించారు. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ ధైర్యమూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు లేవని శ్రీమతి షర్మిల విమర్శించారు. 

రైతులను వేధించిన చంద్రబాబు 
చంద్రబాబు యూజర్ చార్జీలు వసూలు చేసిన ఘనుడన్నారు. పక్క రాష్ట్రాలు డ్యాములు కడుతున్నా చంద్రబాబు నోరు మెదపలేదనీ దాని వల్ల నేడు సాగునీరు, తాగునీరు లేకుండా పోయిందన్నారు. ప్రపంచబ్యాంకుతో ప్రతి సంవత్సరం కరెంట్ చార్జీలు పెంచుతానని ఒప్పందం చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు పెంచిన కరెంటు చార్జీలు కట్టలేక రైతులు అల్లాడిపోయారన్నారు. కరెంటు చార్జీలు కట్టలేని రైతులను ప్రత్యేకమైన కోర్టులు పెట్టి చంద్రబాబు వేధించారన్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వైయస్ వచ్చాక ఎక్స్‌గ్రేషియా ఇచ్చారన్నారు.

పాలేరు షుగర్ ఫ్యాక్టరీని 'నామా' పరం చేసిన బాబు
పాలేరు షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు తన మనిషి నామా నాగేశ్వరరావుకు కారుచౌకగా కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. 150 ఎకరాలున్న ఆ యూనిట్‌ విలువ ఆ రోజుల్లోనే వందకోట్లనీ, దానిని తొమ్మిది కోట్లకు ధారాదత్తం చేశారనీ ఆమె విమర్శించారు. అందులో షేర్ కేపిటల్ ఉన్న వేలాది మంది రైతులకు డివిడెండ్ ఇవ్వకుండా చంద్రబాబు, నామా ముంచేశారన్నారు. ఆ రైతుల ఉసురు వారికి తప్పక తగులుతుందన్నారు. చంద్రబాబు హయాంలో 5oకి పైగా ప్రభుత్వరంగసంస్థలను ముక్కలు చేసి తనవాళ్లకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని ఆమె దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ప్రధాన వాగ్దానాలైన రెండు రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం కార్యక్రమాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదీ చెయ్యని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అవే వాగ్దానాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మాట ఇవ్వడమంటే ఏమిటో ఆ మాట మీద నిలబడడమంటే ఏమిటో ఈ జన్మకి తెలియదన్నారు. 









Back to Top