కార్పొరేట్‌ కార్పెట్‌ కింద బాబు పాలన

  • కుళ్లిపోయిన శవానికి కాస్మోటిక్‌ సర్జరీ చేస్తున్న బాబు
  • మహిళా సదస్సును కిట్టిపార్టీలా మార్చిన టీడీపీ సర్కార్‌ 
  • సదస్సులో మొత్తం బాబు అనుచరవర్గం, కుటుంబీకులే
  • ఎమ్మెల్యే రోజా కన్నీటిని పన్నీరులా మల్చుకున్న చంద్రబాబు
  • దేశ సంస్కృతికి మచ్చతెచ్చేందుకు బాబు మరోప్లాన్‌
  • ప్రజల ఆగ్రహజ్వాలల్లో టీడీపీ కాలిబూడిదైపోవడం ఖాయం
  • వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శ భూమన కరుణాకర్‌రెడ్డి 
హైదరాబాద్‌: చంద్రబాబు పరిపాలన మొత్తం కార్పొరేట్ కార్పెట్‌ల కింద నుంచి కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలతో వంచించి కేవలం ప్రచార ఆర్భాటాలతో పాలన సాగిస్తున్నారని బాబుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏ రకమైన బాసటగా నిలకవపోవడంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత సదస్సును చంద్రబాబు కిట్టీ పార్టీలా మార్చారని భూమన దుయ్యబట్టారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యార్థులు, రైతులు, డ్వాక్రామహిళలు నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఆటో కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలను వంచించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిపోయిన శవానికి కాస్మోటిక్‌ సర్జరీ చేసిన విధంగా రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నేను అది చేశా... ఇది చేశా అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని ఫైరయ్యారు. 

సదస్సులో ఒక్క డ్వాక్రా మహిళ గొంతైనా వినబడిందా?
మూడు రోజుల పాటు నిర్వహించిన మహిళా పార్లమెంటరీ సదస్సులో ఒక్కటైనా ఉపయోగపడే చర్చ జరిగిందా అని భూమన టీడీపీ సర్కార్‌ను ప్రశ్నించారు. కేవలం తన అనుచరవర్గం, తన కుటుంబీకులకు సంబంధించిన మామూలే వినబడ్డాయని, మహిళా సదస్సును టీడీపీ పార్టీ కార్యక్రమంగా నిర్వహించారని ఆరోపించారు. తెలుగు రాష్ట్ర మహిళల రోధన అంతా నిన్న జరిగిన సాధికారత సదస్సు యొక్క బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌లా మారిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా వ్యవహరించి తనను విభేదించే వారి గొంతు నొక్కటమే లక్ష్యంగా ప్రజాస్వామ్యానికి చంద్రబాబు కొత్త అర్థం తీసుకొచ్చారన్నారు. ఇంతటి దౌర్భాగ్యం మరొకటి ఉండదన్నారు. చంద్రబాబుకు నచ్చని గొంతు వినిపిస్తే దాన్ని అంగీకరించే స్థితిలో లేకుండా దిగజారిపోయారన్నారు. మహిళా పార్లమెంటరీ సదస్సులో ఒక్క డ్వాక్రా మహిళా గొంతు అయినా వినిపించిందా.. దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి మొహాలు ఒక్కటైనా కనిపించాయా అని చంద్రబాబును ప్రశ్నించారు. పారిశ్రామికరంగంలో దిగ్గజాలైన మహిళలతో వేదికను నింపి గొప్పగా నిర్వహించామని చంద్రబాబు చెప్పుకోవడం అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని చురకంటించారు. 

బాబూ..ఇదేనా మహిళా సాధికారత
వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కార్చిన కన్నీటిని... టీడీపీ ప్రభుత్వం పన్నీరులా సదస్సులో జల్లుకుందని భూమన వ్యాఖ్యానించారు. సదస్సు నిర్వాహకుడు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కడువడు నీళ్లలో చిటుకెడు విషం చిమ్మడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తుందనడాన్ని ఖండించారు. అది కాదు వాస్తవం కడవడు విషంలో చిటికెడు పాలు కలపడానికి వైయస్‌ఆర్‌ సీపీ సదస్సుకు చేరిందన్నారు. గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. కడవడైననేమి కరము పాలు.. అన్నట్లుగా సదస్సును నీరుగార్చారన్నారు. దాదాపు రూ. 13 కోట్లుపైగా సదస్సుకు ఖర్చు చేసి 12 వేల మంది బలవంతపు ప్రేక్షకులను రప్పించారన్నారు. వచ్చిన వారికి కనీస వసతులు కూడా కల్పించకుండా, గొర్రెల్లా ప్రొక్లైనర్‌లలో వాలంటీర్‌లను తీసుకెళ్లారని మండిపడ్డారు. ప్రజాధనం విపరీతంగా ఖర్చు చేసి ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి బాబు తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో మహిళల రక్షణ కోసం ఏ రకమైన సారాంశం బయటకు రాకపోవడం దురృష్టకరమన్నారు. సొంత పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు కుమార్తెనే చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఇదేనా మీరు సాధించిన మహిళా సాధికారత అని ప్రశ్నించారు. 

పాశ్చాత్య సంస్కృతి మాకొద్దు
మన భారతదేశ సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కార్యక్రమానికి పూనుకున్నాడని భూమన ధ్వజమెత్తారు. త్వరలోనే తల్లికి వందనం అనే కార్యక్రమం చేపడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దేశ సంస్కృతిలో తల్లి భగవంతుడికైనా గొప్పది. అలాంటి తల్లికి ఒక రోజు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో అనేక మంది నిత్యం కన్నతల్లికి పాదాభివందనం చేస్తున్నారని చంద్రబాబుకు చురకంటించారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు చనిపోయిన 10 సంవత్సరాల తరువాత తన తల్లి గుర్తుకు వచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. లవర్స్‌డే, టీచర్స్‌ డే, ఫ్రెండ్స్‌ డే అంటూ పాశ్చాత్య దేశంలోని సంస్కృతిని మనకు అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

ప్రచార కళలో బాబు సిద్ధహస్తుడు
ఉన్నది లేనట్లుగా... లేనిది ఉన్నట్లుగా చూపించే ప్రచార కళలో సీఎం చంద్రబాబు విరాట్‌ స్వరూపుడిగా విరాజిల్లుతున్నారని భూమన ఆరోపించారు. రెండు పారిశ్రామిక సదస్సులు పెట్టాను.. ఒక దాంట్లో రూ. 4.5 లక్షల కోట్ల ఒప్పందాలు... మరోదాంట్లో రూ. 10 లక్షల 20 వేల కోట్ల ఒప్పందాలు చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. కానీ గత కొన్ని రోజుల క్రితం జరిగిన పారిశ్రామిక సదస్సులో రూ. 10 లక్షల 25 వేల కోట్లకు పరిశ్రమల శాఖా కార్యదర్శి ఆరోగ్య రాజ్‌ సంతకాలు పెట్టడానికి కూడా నిరాకరించాడని స్పష్టం చేశారు. ఇంతకు ముందు అమరావతి భూములకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంతకాలు పెట్టలేదని గుర్తు చేశారు. అంటే చంద్రబాబు పాలన అధికారుల్లో ఎంత భయాన్ని కలిగిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రజల జీవితాలను దోచుకున్నారు కానీ ఇకనుంచైనా ప్రజల మనస్సు దోచుకునే విధంగా పాలన చేయాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజల్లో రగులుతున్న ఆగ్రహ జ్వాలల్లో చంద్రబాబు పార్టీ కాలిబూడిదైపోక తప్పదని హెచ్చరించారు. 


 
Back to Top