ఆవేదన తప్ప ఆనందం లేదు

మర్రిబంధం (నూజివీడు) 12 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ పథకాలేవీ అమలు కావట్లేదు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా రేషన్‌కార్డులు రాలేదంటూ మర్రిబంధం గ్రామస్థురాలు సుజాత శ్రీమతి షర్మిలకు తన గోడు వెళ్లబోసుకుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు ఉండట్లేదు. అర్ధరాత్రి కూడా పోతోంది. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం... అని ఓ దళిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో 36 డ్వాక్రా గ్రూపులు ఉండగా, ఒక్కదానికి కూడా వడ్డీలేని రుణం ఇవ్వలేదు. అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం... అంటున్నారే గానీ, అవి ఎప్పుడు అందుతాయో తెలియట్లేదు... అని ఓ డ్వాక్రా మహిళ తన సమస్యను శ్రీమతి షర్మిలకు వివరించింది. అప్పు తెచ్చి పునాదులు తవ్వి పక్కాగృహం కోసం ఎదురుచూస్తే చివరికి మంజూరు చేయలేదు. నాకు భర్తలేడు. దీంతో తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదని దళిత మహిళ వాపోయింది.

ఎకరాకు రూ.20వేల నుంచి 25వేల వరకు కౌలు చెల్లించి పంటలు సాగుచేస్తే వ్యవసాయ విద్యుత్ రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ ఉండట్లేదు. దిగుబడి రాక మా పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైందని ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.

మహానేత డాక్టర్ వైయస్ ఉన్నపుడు ఎరువుల ధర బస్తా రూ.400 ఉండేది. ప్రస్తుతం రూ.1,300 నుంచి రూ.1,500 వరకు ఉంటోంది. గిట్టుబాటు ధర కల్పించట్లేదు. పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దీంతో వ్యవసాయాన్ని మానేసే పరిస్థితులు వస్తున్నాయని ఓ రైతు తన ఆవేదనను శ్రీమతి షర్మిలకు వివరించాడు. ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలో సమస్యలను నూజివీడు మండలం మర్రిబంధంలో గురువారం జరిగిన రచ్చబండలో శ్రీమతి షర్మిలకు విన్నవించుకుని ఆవేదన వ్యక్తం చేశారు ఆ గ్రామస్తులు.

జగనన్న పాలనలో వడ్డీలేని రుణాలు : షర్మిల

ఈ సందర్భంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని మోస్తున్నాడన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్తు చార్జీలు పెంచగా, కిరణ్ పాలనలో నాలుగుసార్లు పెంచి రూ.33వేల కోట్ల భారం ప్రజలపై మోపారని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందనీ, జగనన్న పాలనలో రైతులకు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేస్తారనీ  భరోసా ఇచ్చారు. పల్లెల్లో బెల్టుషాపులు లేకుండా చేసి మహిళల అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు.

మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం పక్కన పడేస్తోందని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యూక ఆ పథకాలన్నింటినీ పటిష్టంగా అమలుచేస్తారని చెప్పారు. గతంలో చంద్రబాబు పాలనకు, ప్రస్తుత కిరణ్ పాలనకు తేడా లేదని, ప్రజల రక్తాన్ని పిండడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.

Back to Top