ఆ 'పెద్దమనిషి' గురించి ఏం చెప్పగలం?


తుగ్గలి

(కర్నూలు జిల్లా) 9 నవంబర్ 2012 : రాష్ట్రంలో కరెంటు కష్టాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని షర్మిల ఆరోపించారు. సమయానికి విద్యుత్తును కొనుగోలు చేయకపోవడం వల్లే కరెంటు సంక్షోభం ఏర్పడిందనీ ఆమె అన్నారు." పైగా ఏదో గొప్పగా కరెంటు ఇస్తున్నట్లు చార్జీలట, సర్‌చార్జీలట! ఇంతింత బిల్లులు ఎలా కట్టాలంటూ మహిళలు మొత్తుకుంటున్నారు"అని షర్మిల విమర్శిం చారు. మరో ప్రజాప్రస్థానం 23 వ రోజు పాదయాత్రలో భాగంగా కర్నూలుజిల్లా తుగ్గలి హైవేపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి వైఫల్యాలను ఎండగట్టారు.
"వైయస్ మహిళలను లక్షాధికారులను చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మహిళల బ్రతుకుల మీద కొడుతోంది. కరెంటు కష్టాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యమంత్రి సమయానికి కరెంటు కొనకపోవడం వల్లే మన రాష్ట్రం తీవ్రమైన విద్యుత్తు సంక్షోభం ఎదుర్కొంటోంది. కేవలం ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే ఈ రోజు మన రాష్ట్రంలో కరెంటు లేదు. మళ్లీ ఏదో గొప్పగా కరెంటు ఇస్తున్నట్లు చార్జీలంట..సర్ చార్జీలంట! మహిళలైతే ఇంతింత బిల్లులు ఎలా కట్టాలని మొత్తుకుంటున్నారు. కరెంటుతో పనేముందీ, కిటికీలు, తలుపులు తెరుచుకుని గడిపేయండి, అని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారంటే ఇక ఆ పెద్దమనిషి గురించి ఏం చెప్పగలం?"అని షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి!
"15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ అందులో 10 శాతం కూడా ఇవ్వలేకపోయారు. ముఖ్యమంత్రిగారు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టు బడులు తెస్తామన్నారు. అందులో కనీసం 60 కోట్లు కూడా తేలేదు. కొత్త పరిశ్రమల మాటేమోగాని, కరెంటు సంక్షోభం వల్ల ఉన్న పరిశ్రమలు కూడా మూతబడి ఎంతో మంది ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. పేరుకు పావలా వడ్డీ అంటున్నారు కానీ నిజానికి రెండు రూపాయల వడ్డీ పడుతోందని మహిళలు మొత్తుకుంటున్నారు. ఇలా అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది." అని ఆమె అన్నారు.
రాజశేఖర రెడ్డిగారు హంద్రీనీవా
చేపట్టి 90 శాతం పనులు పూర్తిచేశారనీ, మిగతా 10 శాతం పనులను ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందనీ ఆమె
విమర్శించారు. హంద్రీనీవా
ప్రాజెక్టు పనులు పూర్తయితే ఈ ప్రాంతం ప్రజలకు సాగునీరు, తాగునీరు లభిస్తుందని ఆమె అన్నారు. ప్రభుత్వం ఇలా అన్నిటా విఫలమైతే నిలదీయాల్సిన టిడిపి మూడేళ్లుగా చోద్యం చూస్తోందనీ, ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను విస్మరించిందనీ షర్మిల తూర్పారబట్టారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబునాయుడు, నాడు ఎన్టీఆర్ ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యనిషేధమన్న రెండు ప్రధాన వాగ్దానాలను నిలబెట్టలేకపోయారన్నారు. చంద్రబాబుకు మాట మీద నిలబడలేని దురలవాటు ఉందన్నారు.ఆయన రాసుకున్న 'మనసులో మాట' పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాసుకున్నారనీ, సబ్సిడీలిస్తే జనం సోమరులౌతారన్నారనీ షర్మిల గుర్తు చేశారు. తన హయాంలో చంద్రబాబు ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారనీ, కరువుంది కట్టలేం మహాప్రభో అని జనమంటే, ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టి జైలు పాలు కూడా చేశారనీ ఆమె విమర్శించారు. ఇంత క్షోభ పెడితే అవమానాలు తట్టుకోలేక నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదనీ, ఇది మరచిపోవడానికి వీల్లేని విషయమనీ ఆమె అన్నారు.
"ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్తడ్రామాకు తెరలేపారు. ఒకప్పుడు ఈ గ్రామాలను శ్మశానాలుగా మార్చిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని వెళుతున్నాడో మళ్లీ ఈ గ్రామాలకు! తొమ్మిదేళ్ల పాలనలో ఏ మేలూ చేయకుండా మళ్లీ తనను నమ్మమని పాదయాత్రలు చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు లేనిది రాజన్నకు, జగనన్నకు మాత్రమే ఉన్నది విశ్వసనీయత అని" అని షర్మిల వ్యాఖ్యానించారు. నిజానికి చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదనీ,  ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయవచ్చుననీ, కానీ ఆ పని చేయకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కై నీచరాజకీయాలు చేస్తున్నారనీ ఆమె దుయ్యబట్టారు.
వాళ్ల లక్ష్యం జగన్...
"వాళ్ల లక్ష్యం ఒక్కటే జగన్...ఒక జగనన్న బయట ఉండి మీ కోసం పోరాటం చేస్తుంటే, ఇక కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు మనుగడ ఉండదనీ, తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనీ కుమ్మక్కై కుట్ర చేసి సిబిఐని వాడుకుని బెయిలు కూడా రానివ్వకుండా జగనన్నను జైలుపాలు చేశారు. కానీ రాజన్నలాగా జగనన్న ప్రజల మనిషి. అధర్మానికి ఆయుష్షు తక్కువ. దేవుడనే వాడున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మంచివాళ్ల పక్షాన నిలబడతాడు. ఒకరోజు వస్తుంది. ఆ రోజు జగనన్న బయటకు వస్తాడు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నని కూడా ఎవ్వరూ ఆపలేరు. జగనన్న త్వరలోనే వస్తాడు. అప్పుడు రాజన్నఇచ్చిన ప్రతి మాటనినీ జగనన్న నెరవేరుస్తాడు. రాష్ట్రం మళ్లీ సస్యశ్యామలమౌతుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు...ఇలా అన్ని వర్గాలూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెప్పండి."అని షర్మిల కోరారు. షర్మిల సభతో తుగ్గలి పరిసర ప్రాంతాలన్నీ జనమయమయ్యాయి.

Back to Top