హరిచంద్రబాబు అనే దొంగని కోర్టుకి తీసుకొచ్చారు. అతనే దొంగతనం చేస్తున్న సీసీ ఫుటేజిని, వాయిస్ రికార్డ్‌ని కోర్టుకి సమర్పించారు.

దొంగతనం చేశావా లేదా? అని జడ్జి అడిగాడు
సార్ 64 కళల్లో చోరకళ కూడా ఒకటి. తాళం పుట్టినపుడే దొంగతనం కూడా పుట్టింది. అసలు తాళం కనుకున్న వాడే సిసలైన నేరస్తుడు . తాళాలు రెండు రకాలు.... తలుపుకి బిగించే తాళం. సంగీతంలో వచ్చే తాళం. రాజకీయాల్లో వుండాలనుకుంటే దొంగకి తాళం చెవి ఇవ్వాలి. చెవులు రెండు రకాలు... తాళం చెవులు, మనిషికి వుండే చెవులు. చెవులున్నంత మాత్రాన అందరూ వినలేరు. తాళం చెవులు, చెవులున్నంత మాత్రాన అందరూ వినలేదు,...తాళం చెవులున్నంత మాత్రాన అందరూ తాళాలు తీయలేదు.......

జడ్జి ప్రశ్న) నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పిన దానికి సంబంధముందా?
ప్రశ్నకు సరైన సమాదానాన్ని పరీక్షల్లో కూడా రాయరుసార్. అలా రాస్తే అందరూ పాసై పోవాలి, కానీ ఎందరో ఫెయిలవుతున్నారు. ఫెయిల్యూర్స్ ఎదుర్కున్నవారు సక్సెసవలేరు. సక్సెస్‌లో వున్న వాళ్ళు ఫెయిలవుతారు.

జడ్జి బుర్ర గోక్కుంటూ, ** నువ్వు దొంగతనం చేసినట్టు కెమెరాల్లోనూ టేపుల్లోనూ వుంది. అవునా కాదా?
కళ్ళతో చూసినవే నిజాలో కాదో తెలియనపుడు కెమెరాలను మాత్రం ఎందుకు నమ్మాలి? అదంతా గ్రాఫిక్స్, టేపులన్నీ కట్‌పేస్ట్. పేస్ట్ రెండు రకాలు టూత్‌పేస్ట్, మామూలు పేస్ట్ అంటే అతికించడం, టాఫిక్స్‌లాగా గ్రాఫిక్స్ పలురకాలు,కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి.

జడ్జి ప్రశ్న) కళ్ళు చెవులు కాదు, నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు, డొంక తిరుగుడు వద్దు, స్ట్రెయిట్‌గా చెప్పు
తీగలాగితే డొంక కదులుతుంది. వెదకబోయిన తీగ ఒక్కసారి కాలికి తగులుతుంది. తీగతెగితే వీణ పలకదు. తీగలకు కాచినంత మాత్రాన ప్రతీదీ బీరకాయకాదు. అందరు చుట్టాలు బీరకాయ పీచు కాదు. పీచు పదార్థం తింటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యమే మహాబాగ్యం, భాగ్యవంతుడు కావాలంటే రాజకీయాల్లో చేరాలి.

జడ్జి తలపట్టుకొని ఇతనేం మాట్లాడుతున్నాడో అర్థంకావడం లేదు అని అరిచాడు
దొంగతనం చేశావా లేదా అని అడిగిన ప్రతిసారి ఇతను ఇలాగే చెపుతున్నాడు సార్ అని చెప్పాడు లాయర్

జడ్జి ప్రశ్న) ఏమయ్యా జనాల్ని చంపకుండా నిజం చెప్పు, నువ్వు దొంగవా? కాదా?
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు భుజాలు తడుముకునేవాడు ఈ కాలంలో లేదు. దొంగతనం చేసి కూడా తన భుజాల్ని తానే చరుచుకునేవాడు దొర, దొంగల్లో దొరలుంటారు. దొరల్లో దొంగలుంటారు. ఎవరో తెలుసుకోవడమే ఫజిల్. పోలీసులు విజిల్ వూదితే శిక్షలు పడవు. ఇంతకూ జడ్జిగారూ మీరేం అడిగారు.

జడ్జి ప్రశ్న) నువ్వు వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేస్తున్నావు
ఈ రోజుల్లో వేలుకి విలువేముంది సార్, ఎవర్ని కొనాలన్న లక్షలు కోట్లు కావాలి అన్నాడు హరిశ్చంద్రబాబు
సార్, దారికొస్తున్నాడు,అసలు విషయం రాబట్టండి అన్నాడు లాయర్

జడ్జి ప్రశ్న) "నేనడిగింది అదే. లక్షలు, కోట్లు ఎక్కడ దొంగతనం చేశావు"
"లక్షలున్నవాడు లక్షణంగా వున్నాడు. చలికాలంలో కోట్లు కావాలి". నాలాంటి వాడు కోటి కొక్కడు వుంటాడు. కోటి కొక అంటే దాని దగ్గర కోట్లువున్నాయని కాదు....
"జడ్జి సుత్తితో తల బాదుకుని" ....ఆ హరిశ్చంద్రుడితో అబద్ధం ఎలా చెప్పించలేమో.... ఈ హరిశ్చంద్రబాబుతో నిజం అలాగే చెప్పించలేం అన్నాడు.