యాక్ష‌న్  రియాక్ష‌న్

తాడేప‌ల్లి ఊరి చివ‌ర పోలీసులతో పాటు, రాజ‌ధాని డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ అధికారులు వెయిట్ చేస్తున్నారు. వారి ముందు నుంచే రెండు మూడు బ‌స్సులు, మ‌రో రెండు లారీలు వెళ్లాయి. వాటి నిండా వివిధ వ‌య‌స్కులైన ఆడా, మ‌గా, పిల్లా జెల్లా, ముస‌లీ, ముత‌కా ఉన్నారు వెళ్లిన వాహ‌నాల నెంబ‌ర్లు నోట్ చేసుకున్నారా అధికారులు. 

ఓ రెండు గంట‌లు గ‌డిచిన త‌ర్వాత అవే వాహ‌నాలు తిరిగి వ‌స్తున్నాయి. పోలీసులు ఆ వాహ‌నాల‌ను ఆపారు. ఏమైంది సార్ అడిగాడు ఆ ట్రూప్ అంత‌టినీ తీసుకు వెళ్తున్న మేనేజ‌రు. మీరంతా ఎక్క‌డ నుంచి వ‌స్తున్నారు అడిగాడు ఓ పోలీస్ అధికారి. 

వీళ్లంతా మాజీ ముఖ్య‌మంత్రిగారి అభిమానులు స‌ర్. ఆయ‌న ఓడిపోయారు క‌దా ప‌రామ‌ర్శ చేయ‌డానికి వ‌చ్చారు. జ‌వాబిచ్చాడు మేనేజ‌ర్. 

ఓహో ఎక్క‌డ నుంచి వ‌చ్చార‌య్యా వీళ్లంతా ఆరా తీసారు అధికారులు. 

వీళ్లంతా రాజ‌ధాని ప్రాంత‌ రైతులండీ. రాజ‌ధాని కోసం త‌మ భూములు త్యాగం చేసారు. ఇప్పుడు మాజీ ముఖ్య‌మంత్రిగారికి ఇల్లు లేద‌ని తెలిసి వాళ్లిళ్ల‌కు ర‌మ్మ‌ని పిల‌వ‌డానికి వ‌చ్చారు డాబుగా చెప్పాడు మేనేజ‌రు. 

అలాగా అలా అయితే మాజీ ముఖ్య‌మంత్రిగారి మీద వీళ్లంద‌రికీ చాలా అభిమానం అనుకుంటాను.

అవునండీ వెనక‌నుంచి కోర‌స్ గా అరిచారు వాళ్లు ముందున్న మేనేజ‌ర్ ఇచ్చిన సంజ్ఞ‌ను అర్థం చేసుకుని. 

వీళ్లంతా చందాలు వేసుకుని అయినా మాజీ ముఖ్య‌మంత్రిగారికి ఇల్లు ఏర్పాటు చేస్తామంటున్నారండీ అదీ ఆళ్ల అభిమానం అండీ అన్నాడు మేనేజ‌ర్ త‌న మాట‌ల‌ను మ‌రింత ర‌క్తిక‌ట్టిస్తూ. 

స‌రే అలా అయితే ఆయ‌న‌కు ఇల్లు క‌ట్టించే ముందు ఆయ‌న‌ ప్ర‌భుత్వానికి జ‌మ చేయాల్సిన డ‌బ్బు అంద‌రూ క‌లిసి  చందాలేసుకుని క‌ట్టి ఇక్క‌డ నుంచి క‌ద‌లండి చెప్పారు అధికారులు.

అదేంటండీ అయోమయంగా అడిగాడు మేనేజ‌రు. 

అంతేమ‌రి అక్ర‌మంగా క‌ట్టిన క‌ట్ట‌డాల‌కు, విచ్చ‌ల‌విడిగా చేసిన దుబారాల‌కు లెక్క తేలుతోంది. అవి క‌ట్ట‌కుండా మాజీగారు క‌ర‌క‌ట్ట దాటి వెళ్లిపోతే ఎలా? ఆయ‌న చేత ఆ ప్ర‌జా ధ‌నం ఎలా క‌క్కించాలా అని ఆలోచిస్తున్నం. క‌నుక ఆ చందాలేవో వేసుకుని ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌భుత్వ సొమ్ము మీరు క‌ట్టేయండి. లేకపోతే ఆయ‌న బ‌దులుగా పూచిక‌త్తైనా ఇవ్వండి తేల్చి చెప్పారు అధికారులు.

అంతా విన్న ఓ పెద్దావిడ‌ లారీ దిగొచ్చింది -

ముద‌న‌ష్టం కాక‌పోతే ఆడు జ‌నం సొమ్ము తినట‌మేంది మేం వ‌చ్చి పూచీ ఇవ్వ‌డం ఏంది. ఏదో ఇలా వ‌చ్చి అలా బొట బొటా నాలుగు క‌న్నీళ్లు కార్చేసి కొంగుతో తుడిచేసుకోండి, నువ్వు పోడ‌మేంద‌య్యా అంటూ బైటికెళ్లిపోండి మ‌నిషికి ఐదు నూర్లు ఇస్తామంటే అంద‌రం వొచ్చాం. ఆ మాత్రాకే మాతో పూచీలు, తాక‌ట్టులు ఎట్టించేత్తారా? సాలు సాలు మా దారిన మ‌మ్మ‌ల్ని పోనీండ‌య్యా. మాకే పాపం తెలీదు ద‌ణ్ణం పెడుతూ చెప్పిందా పెద్దావిడ‌. 

ఇగో మేనేజ‌రూ మా అంద‌ర్నీ తెచ్చింది నువ్వే గ‌దా చెప్పు గ‌ద్దించారు ఇత‌ర మ‌హిళా ఆర్టిస్టులు.

అవున్సార్ రోజుకో 200 మందిని తెమ్మంటే తెస్తున్నాం. మాకేం తెలియ‌దు సార్. వ‌దిలేయండి సార్ అంటున్నాడు మేనేజ‌రు ముందున్న డాబు వ‌దిలి గాబ‌రాగా. 

అయితే మీకు ఆ మాజీగారితో ఏం సంబంధం లేదంటారు - రెట్టించి అడిగాడు పోలీసాయ‌న‌.

లేదు సార్ లేదు. వ‌ణికిపోతూ ద‌ణ్ణం పెట్టాడు మేనేజ‌రు. 

స‌రే పొండి అంటూ పోలీసుల‌ను అడ్డు తొల‌గ‌మ‌ని వాహ‌నాల‌కు దారిచ్చారు అధికారులు. 

గ‌బ‌గ‌బా బ‌స్సెక్కి బ‌తుకు జీవుడా అనుకున్నారు ప‌రామ‌ర్శ‌ల ఆర్టిస్టులు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top