కూటమి పాలనలో ఉద్యోగుల‌కు రక్షణ క‌రువు

వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్‌ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి ఆగ్ర‌హం.  

గ్రామం నుంచి జిల్లాస్ధాయి వరకు బెదిరింపులు

అడుగడుగా వేధిస్తున్న కూటమి నేతలు

ఉద్యోగులు మీ బానిసలు కాదు

ఇలాగే దాడులు కొనసాగితే ఉద్యోగుల ఉద్య‌మం ఖాయం

అధికార కూటమి పార్టీ తీరుపై మండిపడ్డ చంద్రశేఖరరెడ్డి

దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి 

నల్లమారు చంద్రశేఖర రెడ్డి డిమాండ్ 

తాడేపల్లి: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  గ్రామ స్ధాయిలో వీఆర్వో మొదలుకుని జిల్లా స్ధాయి అధికారుల వరకు అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డం, బెదిరింపులకి దిగి ఏకంగా బూతులు తిట్టడంపై మండిపడ్డారు. బదిలీల పేరుతో ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. ఈ రకమైన ధోరణి కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఏకమై ఆందోళనకు దిగడం ఖాయమని హెచ్చరించారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

బదిలీలు పేరుతో వేధింపులు:

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్న కిషోర్ సాధారణ బదిలీలో భాగంగా గౌరవరం ట్రాన్స్ ఫర్ అయ్యారు. అయితే రాజకీయ కక్షలో భాగంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈఈ, డీఈల మీద ఒత్తిడి తెచ్చి... ఏఈ కిషోర్ ను రిలీవ్ చేయడం లేదు. దీంతో దళిత అధికారినైన నన్ను రిలీవ్ చేయకుండా వేధిస్తున్నారని ఆవేదనతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు లేఖ రాసి వాట్సప్ లో పెట్టి కిషోర్ అదృశ్యయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగుల మీద రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉంది. వారి సంక్షేమం కోసం బదిలీలు చేస్తున్నామన్న ప్రభుత్వం.. ఉద్యోగుల ప్రాణాల మీదకు వస్తున్న బదిలీలు అవసరమా.? ఇంత జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదు.? ఉద్యోగులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నా వారు ఎందుకు నోరు మెదపడం లేదు? దీనికి కచ్చితంగా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మీరు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే బదిలీకి సిద్ధమైన ఏఈ కిషోర్ కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన రిలీవ్ కాకుండా అడ్డుపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 

కూటమి పాలనలో అధికారులపై వేధింపుల పర్వం:

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో అధికార తెలుగుదేశం పార్టీ గ్రామస్ధాయి నేత చల్లా నాగరాజు అతని అనుచరులతో కలిసి ఎంపిడీఓ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ ఎంపీడీఓ తహీర్ హుస్సేన్  మీద బూతులుతో దాడి చేయడం అత్యంత అమానుషం. ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి సంబంధం లేకపోయినా... తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ దుర్భాషలాడారు. కేవలం రాజకీయ మదంతో ఉద్యోగులను బెదిరిస్తూ.. చెప్పినట్లు చేయకపోతే దాడులు చేస్తున్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకోచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

రాజమండ్రి రూరల్ లో వెంకటనగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు విమల అనే మహిళ దగ్గర 13 లీటర్లు సారా, సురేష్ అనే మరో వ్యక్తి దగ్గర 18 లీటర్లుతో పట్టుకుని ఎక్సైజ్ స్టేషన్ కి తీసుకునివెళ్లారు. దీంతో సారాతో పట్టుబడ్డ సురేష్ సోదరుడు గుమ్మడి లవకుడు, అధికార టీడీపీ నేత ఎక్సైజ్ స్టేషన్ దగ్గర వీరంగం చేశాడు. సారాతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ రాజకుమార్, పూర్ణచంద్రరావు లను దుర్భాషలాడడంతో పాటు అంతు చూస్తామని బెదిరించారు. అధికార పార్టీ లీడర్లు అయితే చట్టాలు తమకు వర్తించవన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

అదే విధంగా అనంతపురంలో తాడిపత్రి టీడీపీ నేత జే సీ ప్రభాకరరెడ్డి అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి అక్కడ పనిచేస్తున్న జిల్లా పంచాయితీ అధికారి(డీపీఓ) నాగరాజు నాయుడును చెప్పిన పని చేయకపోతే అంతు చూస్తామంటూ... అందరి సమక్షంలో అంతు చూస్తామని బహిరంగంగా బెదిరించాడు. ఏకంగా ఒక జిల్లా అధికారిని మున్సిపల్ ఛైర్మన్ బెదిరిస్తూ ఉంటే... చిన్న ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ రకమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
జిల్లా ఉన్నతాధికారులనే ఏకంగా బహిరంగంగా, బరితెగించి బెదిరిస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని అధికారులపట్ల సవ్యంగా మాట్లాడాలి. ఈ రకమైన చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి...సచివాలయ ఉద్యోగిని అందరు ముందు నువ్వు కార్పొరేటర్ కి బ్రోకర్ వా... అని దూషిస్తూ నోటికొచ్చినట్లు తిడుతూ బెదిరించడం సరికాదు. ఏ అధికారైనా తప్పు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప, నోటికొచ్చినట్లు ధూషించడం సరికాదు. ఈ చర్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగులు మీ కాళ్ల దగ్గర పనిచేసే పనివాళ్లు కాదన్న సంగతి కూటమి ప్రభుత్వ నేతలు గుర్తుంచుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అలా కాకుండా ఉద్యోగులపై భౌతికంగా, మానసికంగా దాడి చేయడంతో పాటు ఇష్టమొచ్చినట్లు నిందిస్తే కచ్చితంగా ఉద్యోగులు ఏకమవుతారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వం తోకముడవడం ఖాయం. ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారులకు ఇస్తున్న గౌరవం ఇదేనా.? అని  కూటమి ప్రభుత్వాన్ని చంద్రశేఖర రెడ్డి నిలదీశారు.

Back to Top