ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు యథాతథం...

 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు
 
మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

 తాడేప‌ల్లి:  రాష్ట్రంలో ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ వెల్లడించారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం వైయ‌స్ జగన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.  ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24కి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అయితే, 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం పూర్తయిందని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటివరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో పాటిస్తూనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతామని మంత్రి స్ప‌ష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top