చంద్రబాబు శ్రీకాకుళానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా ఇచ్చిన హామీలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు. పాదయాత్రలో భాగంగా సిక్కోలులోకి అడుగుపెట్టిన జన నేత ఈ జిల్లాకు బాబు చేసిన వాగ్దానాలపై ఆరా తీస్తున్నారు. అశేష జన సందోహం ఆత్మీయంగా స్వాగతించగా శ్రీకాకుళంలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయ్యింది.
హామీలేమయ్యాయి బాబూ?
నూతన పారిశ్రామిక నగరం అన్నాడు. భావనపాడు, కళింగపట్నం పోర్టులు అన్నాడు. పైడిభీమవరం పారిశ్రామిక వాడ అన్నాడు. నూతన ఎయిర్పోర్టు నిర్మిస్తామన్నాడు. శ్రీకాకుళాన్ని స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు. ఫుడ్ పార్కు ఏర్పాటు చేస్తానన్నాడు.స్కూల్ ఆఫ్ ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ అన్నాడు. వంశధారనాగావళిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు. తెలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం, బౌద్ధ చారిత్రక కట్టడాలు, శ్రీకూర్మ మరియు అరసవెల్లి దేవాలయాలను కవర్ చేస్తూ పర్యాటక కేంద్రాల అభివృద్ధి అన్నాడు. బారువ బీచ్ అభివృద్ధి అన్నాడు. ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు అన్నాడు. ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్ వేర్ పార్క్ అన్నాడు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ప్రసాదించిన వరాలు ఇవి. వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదన్న సంగతి మనకు తెలుసు. ఐదేళ్ల పాలనా కాలం మరి కొద్ది నెలల్లో పూర్తి కావస్తోంది. ఇన్నేళ్లుగా చంద్రబాబు శ్రీకాకుళాన్ని నిర్లక్ష్యం చేసాడని, సిక్కోలు కష్టాలను కనీసం పట్టించుకోలేదని అంటున్నారు ఆ ప్రాంత వాసులు. 
శ్రీకాకుళం బాధలు పట్టవా?
కిడ్నీ సమస్యలతో బాధలు పడుతున్న సిక్కోలు వాసులకు ఊరటే లేదు. ఫ్లోరైడ్ సమస్య కారణంగా ఉద్దానం ప్రాంతంలో ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలౌతున్నారు. తరతరాలు ఈ వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నాయి. తుఫాన్ల తాకిడికి ఎక్కువగా నష్టపోయేది శ్రీకాకుళమే. పాలకుల నిర్లక్ష్యానికి ఎక్కువగా గురయ్యే జిల్లా కూడా శ్రీకాకుళమే. తాగునీటి సమస్య, కాలుష్యం వంటి మౌలిక విషయాలపట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీస దృష్టి సారించలేదు. మత్స్యకారులను షెడ్యూళ్ల జాబితాలో చేరుస్తానని ఎన్నికల వేళ మాటిచ్చిన ముఖ్యమంత్రి, దానిపై అడిగేందుకు వచ్చిన వారిపై విరుచుకుపడటాన్ని ప్రజలు మర్చిపోలేదు. వలస పోయిన వారిని వెనక్కి రంప్పించి, ఉపాధి అందిస్తనని చెప్పిన మాట కూడా గాలి మాటే అయ్యింది. ఫిష్షింగ్ హార్బర్, డిగ్రీ కాలేజీ ఏర్పాటు, కార్మికుల కోసం ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం లాంటి స్థానికంగా ఇచ్చిన హామీలకూ బాబు తిలోదకాలిచ్చాడు. ఇన్నేళ్లలో శ్రీకాకుళానికి చంద్రబాబు చేసినదేదైనా ఉంటే ఏడాదికో జిల్లాలో జరిపే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది శ్రీకాకుళంలో వేడుకలు నిర్వహించారు. ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టి నగరాన్ని సుందరీకరించారు. అది కూడా తాత్కాలిక పనులే. ప్రజాప్రతినిధులు వెళ్లిపోయాక పేకప్ చెప్పిన షూటింగ్ లా శ్రీకాకుళం యథావిథిగా ఉంది. 
వైఎస్ కు ప్రత్యేకం
శ్రీకాకుళం జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయన ప్రజా ప్రస్థాన పాదయాత్రకు చివరి మజిలీ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం. అభివృద్ధిలో ఆఖరుగా నిలిచిన జిల్లాకు అన్ని విధాలా సాయం అందించింది వైఎస్సారే. అన్నదాతలకు ఆపద్భాంధవుడై ఏకకాలంలో రుణ మాఫీ చేసాడు. 2008లో డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి వేలాదిమందికి విద్యావకాశాలు అందించారు. శ్రీకాకుళంలో 2.92 లక్షల మందికి పింఛన్లు, 2.74 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేసిన మనసున్న మారాజు రాజన్న. పేదలకు ఆధునిక వైద్యాన్ని అందించాలని, సిక్కోలు విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడానికి శ్రీకాకుళంలో రిమ్స్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసారు వైఎస్సార్. ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూ తోటపల్లి ఫేజ్  2, వంశధారపై రెండో దఫా ప్రాజెక్టు, టెక్కలి లో ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు జీవం పోసింది వైఎస్సారే. ఒడిశ్సాలో వర్షాలకు నాగావళి, వంశధారల్లో వరద ఉధృతిని తట్టుకునేలా 300 కోట్లరూపాయిలతో కరకట్టల నిర్మాణం మొదలెట్టింది కూడా ఆయనే. 
రాజన్న రాజ్యంలో సిక్కోలుకు జరిగిన మేలును నేటికీ తలుచుకుంటారు ఆజిల్లా వాసులు. చంద్రబాబు పాలనలో అయితే గతంలో కరువు ఇప్పుడు తుఫాను తప్ప మరోమాటే చెప్పుకునేందుకు లేదని వాపోతున్నారు. ప్రకృతి భీభత్సంలో నష్టపోయిన జిల్లాను కూడా చంద్రబాబు ప్రచారానికి వాడుకున్నాడు తప్ప, జిల్లా వాసుల బాధలను పట్టించుకోలేదని ఆగ్రహిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ప్రజలు. కొత్త నాయకులు తమ జిల్లాపై ఒలకబోసే ప్రేమ ఎందుకోసమో తమకు తెలుసని కూడా అంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో తమ గోడును చెప్పుకుని ఊరట పొందుతామంటున్నారు.  

 
Back to Top