తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కేసులు

భూమన కరుణాకర్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ భూమన అభినయ్‌రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సంజయ్‌గాంధీ కాలనీలోని తొమ్మిదో వార్డు సచివాలయం వద్ద నామినేషన్ల దాఖలు సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ హెడ్‌ కానిస్టేబుల్‌ వినోద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 525/2026లో భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు ఇతరులపై, ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 526/2026లో భూమన అభినయ్‌రెడ్డితో పాటు ఇతరులపై కేసులు నమోదయ్యాయి. బైరాగిపట్టెడలోని 15వ వార్డు సచివాలయం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం, బారికేడ్లను తోసివేయడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి అంశాలతో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టించినా వారిపై కేసులు నమోదు చేయకపోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తూ, మరోవైపు నామినేషన్లకు ఆటంకాలు కలిగించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరుతున్నారు.

Back to Top