Printed on 26-09-2017 13:04:39 PM

కోడెల టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించడం దారుణం
  • గతంలో ఎవరైనా ఇలా వ్యవహరించారా..?
  • పార్టీ కండువాలు కప్పుకొని టీడీపీ మీటింగ్‌లకు హాజరు 
  • గతంలో మాదిరి సభలో ప్రతిపక్ష గొంతునొక్కేస్తారేమో
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
అమరావతి: గౌరవప్రదమైన స్పీకర్‌ హోదాలో ఉన్న కోడెల శివప్రసాదరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడం దారుణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, గౌరు చరితారెడ్డి, పుష్పశ్రీవాణి, రాజన్నదొర, సునీల్‌లతో కలిసి ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. గతంలో స్పీకర్‌ పదవి చేపట్టిన నాదెండ్ల మనోహర్, సురేష్‌రెడ్డిలను చూశామని, వారు ఎన్నడూ పార్టీ మీటింగ్‌లకు హాజరైన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడున్న స్పీకర్‌ కోడెల అమెరికాలో, సత్తెనపల్లిలో, నర్సరావుపేటలో జరిగిన పార్టీ మీటింగ్‌లకు టీడీపీ కండువాలు కప్పుకుని హాజరయ్యాడన్నారు. అంతే కాకుండా క్యాబినెట్‌ మీటింగ్‌లకు కూడా హాజరవుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రితో కలిసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడం సరైన పద్ధతి కాదన్నారు. స్పీకర్‌ స్థానానికి గౌరవం ఇచ్చి పోటీ పెట్టకుండా సపోర్టు చేశామన్నారు. కానీ కోడెల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించడం దారుణమన్నారు. గతంలోలా భవిష్యత్తులో కూడా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా తొక్కేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు.