ఇది ప్రభుత్వమా.. భూ మాఫియానా?!


ఈ రోజు టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల ప్రజలు వేలాదిగా నా అడుగులో అడుగులేశారు. నాన్నగారి జ్ఞాపకాలు పంచుకున్నారు. ఆయన సాయం గుర్తుచేసుకున్నారు.  సీతారాంపురానికి చెందిన ఏడు పదుల వృద్ధుడు బెండి రాజ్‌గోపాలరావు ఒకప్పుడు టీడీపీ వీరాభిమాని. ఇప్పుడాయన గుండె చప్పుడులో నాన్నేగారే వినిపిస్తున్నారు. అంతగా అభిమానించడానికి ఆయన చెప్పిన కారణం విని నాకెంతో ఆనందమేసింది. గుండె ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన పరిస్థితిలో.. నాన్నగారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ప్రాణం పోసిందన్నాడు. ఆ కొత్త జీవితం నాన్నగారిచ్చిందేనని పొంగుకొస్తున్న ఆనందబాష్పాలను తుడుచు కుంటూ చెప్పాడు.  

పదమూడేళ్ల దేవ్‌మహాపాత్రో ఆత్మీయత, నన్ను కలవాలన్న ఆరాటాన్ని చూసి ముచ్చటేసింది. నిజంగా అతనో బాల మేధావి. అందరిలా స్కూలుకెళ్లడమే కాదు.. అందమైన చిత్రాలకు ప్రాణం పోసే చిత్రకారుడు. పనికిరాని వస్తువులనే బొమ్మలుగా మలిచే కళాకారుడు. కళలే కాదు.. చదువుల్లోనూ ముందేనట. నేనంటే ఎంత అభిమానమో అతని చేతిలో ఉన్న చిత్రాన్ని చూస్తేనే తెలిసింది. నన్ను, నాన్నను, నవరత్నాలను చిత్రంలో పొదిగాడు. రెండు రోజులుగా బడి మానుకుని తయారుచేసి, దానిమీద నా సంతకం పెట్టించుకోవాలని వచ్చాడు. సంతకం చేశాక ఆనందంతో ఉప్పొంగిపోయాడు. విషాదమేంటంటే.. అం తమంచి లక్షణాలున్న ఆ పసివాడు తలసేమియాతో పోరాడుతున్నాడు. నెలనెలా రక్తం ఎక్కించుకుంటే తప్ప బతకలేని జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఆ పరిస్థితుల్లోనూ.. ఆరోగ్య శ్రీతో తనలాంటి వారిని ఆదుకోవాలన్నాడు.

కొల్లివలసకు చెందిన ఫల్గుణరావు.. సికిల్‌సెల్‌ అనీమియాతో బాధపడుతున్నాడు. ప్రతి నెలా రక్తం మార్చాల్సిందే. దీనికి తోడు తుంటి ఎముక ఆపరేషన్‌ అవసరమైంది. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. సాయం చేయాలని మంత్రిగారిని ప్రాధేయపడ్డాడట. నువ్వయితే ఆపరేషన్‌ చేయించుకో.. సీఎంకు చెప్పయినా ఖర్చుచేసిన మొత్తం ఇప్పిస్తానన్నాడట. ఆయన చెప్పాడని.. ఉన్న ఎకరా 90 సెంట్లు తనఖా పెట్టి, రెండు లక్షలు అప్పుచేశాడట. సాయం రాకపోగా.. అమరావతి చుట్టూ, మంత్రిగారి చుట్టూ తిరగడానికి కూడా అప్పు చేయాల్సి వచ్చిందని బావురుమన్నాడు.. ఆ సోదరుడి తండ్రి జగన్నాయకులు.  

సహజవనరులపై కన్నేసిన తెలుగుదేశం సర్కార్‌.. పేదలను వంచించడానికి ఎంతకైనా తెగబడుతుందని చింతామణి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గిరిజనులు, దళితులు అంటున్నారు. పాదయాత్రలో నన్ను కలిసి అనేక విషయాలు చెప్పారు. సాగు భూములకు నీళ్లివ్వాలని ఎంత అర్థించినా.. టీడీపీ నేతలు ఆలకించడం లేదని ఆగ్రహించారు. కొండవాగుల్లోంచి వచ్చే నీటిని ఒడిసిపట్టి చెరువుల ద్వారా నీళ్లిచ్చినా, వంశధార ఎడమకాల్వ నుంచి ఎత్తిపోతల పెట్టినా.. తమ భూముల్లో బంగారం పండిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించడానికి వాళ్లు చెప్పిన కారణం వింటే ఆశ్చర్యమేసింది. ఆ భూముల్లో విలువైన గ్రానైట్‌ నిక్షేపాలున్నాయట. అందుకే ఉద్దేశపూర్వకంగా నీళ్లు లేకుండా చేసి.. బీళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారట. నిరుపయోగమైన భూములుగా ముద్రవేసి బినామీలకు కట్టబెట్టాలనేది వ్యూహమన్నారు. మంత్రిగారి పీఏ పేరిట ఆ భూముల్ని లీజుకిప్పించే ప్రయత్నా లు జరుగుతున్నాయని వివరించారు. ఇది ప్రభుత్వమా.. భూమాఫియానా?! అనిపించింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు అందుతున్న అరకొర ఆరోగ్యశ్రీ సేవలను సైతం ఆస్ప త్రులవారు ఆపేస్తామంటున్నారు. మీ మంత్రి గారి పంటినొప్పి సింగపూర్‌ చికిత్సకు క్షణాల్లో లక్షలు మంజూరు చేసిన మీరు.. ఇక్కడ పేదవాడి ప్రాణాలను కాపాడే ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయకపోవడం మానవత్వమేనా? 

Back to Top