ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు  ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివి

డబుల్‌ సెంచరీ సర్కార్‌ను స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా..!

నంద్యాల బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధం

రైతు రాజ్యాన్న, మహిళా పక్షపాత రాజ్యాన్ని  అవ్వా తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా వస్తా ఉన్నాయి. 

వీటికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. 

ఇటు వైపున చూస్తే .. జగన్‌ ఒక్కడే ఒక్కడు.. అటు వైపున చూస్తే ఒక చంద్రబాబు, ఒక దత్త పుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ 

బీజేపీ అనే పార్టీ. పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ

మరొకవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు మరొకవైపు

కేవలం ఒకే ఒక్క జగన్‌ను ఎదుర్కొనే దానికి, మీ బిడ్డను, అన్నను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు..

వీరందర్నీ ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నా

మరొకసారి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేసి, వేయించి.. 25కు 25 లోక్‌సభ స్థానాలు, 175కు 175 అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు, 

మొత్తంగా 200 సీట్లు సాధించేందుకు మీరంతా సిద్ధమేనా?అని అడుగుతున్నా..

గతంలో చంద్రబాబు మోసాలు చూశాం

చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి

బాబు మోసాలకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం

బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?

చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుంది

బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయి

గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?

పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?

ఆడబిడ్డ పుడితే రూ. 25 వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?

నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?

మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?

సూపర్‌ సిక్స్‌ అంటూ మరొకసారి మోసం చేయడానికి వస్తున్నాడు

మీకు, మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయండి

ఇంటికి వెళ్లి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి, మీ పిల్లలతో చేయండి, మీ ఇంట్లో ఉన్న అవ్వా తాతలతో ఆలోచన చేయండి
 
ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్‌ అనేది నిర్ణయం అవుతుందనేది గుర్తుపెట్టుకోండి:  సీఎం వైయస్ జ‌గ‌న్‌

నంద్యాల : ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు  ఓ జైత్రయాత్ర అయితే, మోసాల చంద్ర‌బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి  అన్నారు. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామ‌ని సీఎం వైయ‌స్‌ జగన్ పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే.. 
 

*నంద్యాలలో జనసంద్రం...*

మన నంద్యాల ఈరోజు అనంతమైన ఓ జన సముద్రంలా కనిపిస్తోంది. సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు ప్రజల సైన్యం ఇక్కడ ఈరోజు నంద్యాలలో ఒక సముద్రంలా సిద్ధం.. అని అంటోంది. గతంలో చంద్రబాబు చేసిన అబద్ధాలు, మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా 5 ఏళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూశారు. ∙ప్రజాకంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు, ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్లీ సింహాసనం ఎక్కుతానంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో.. అలాగే నారావారి పాలన మళ్లీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. 

 

 

*సంక్షేమరాజ్యాన్ని కూలగొట్టాలని ఏకమైన తోడేళ్లు*

ప్రజల రాజ్యాన్ని, ఇంటింటి అభివృద్ధిని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని, అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తున్నాయి. వీరికి తోడు.. పరోక్షంగా మరోజాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది. ఇటువైపున చూస్తే జగన్‌ ఒక్కడే ఒక్కడు. అటువైపున చూస్తే.. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికితోడు ఒక బీజేపీ అనే జాతీయ పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్‌ పార్టీ.. వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు. కేవలం ఒకే ఒక జగన్ను ఎదుర్కొనేదానికి, ఒకే ఒక మీ అన్నను, మీ బిడ్డను, మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు వీరందరూ తోడయ్యారు. వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా.. సిద్ధమేనా.. అని అడుగుతున్నాను. 

 

పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులమారి, జిత్తులమారి, ఎత్తులమారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తున్నాయి. కుతంత్రాలు చేస్తున్నాయి. ఆ కుట్రలను, ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనా.. అని అడుగుతున్నాను.

 

 

*డబుల్‌ సెంచరీ సాధించేందుకు....*

మరోసారి ఫ్యానుకు రెండు ఓట్లు వేసి, వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు.. మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించేందుకు, సాధించి డబుల్‌ సెంచరీ సర్కార్‌ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా.. అని అడుగుతున్నాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు. ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన 5 ఏళ్ల ఇంటింటి ప్రగతిని, ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళ్తూ కొనసాగించాలా? లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్లాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. 

 

ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించి ఓటేయండి.

ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ అభిమానం అయినా కావచ్చు, నిరుడు ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈ ఎన్నికల్లో వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరినీ అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందన్నది ఆలోచన చేయమని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతున్నాను.

 

 

*ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో... ఇల్లాలు, పిల్లలతో ఆలోచించండి*

రైతులు, వృత్తుల వారీగా, సామాజిక వర్గాల వారీగా, అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్లి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి. మీ పిల్లలతో ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చుని ఆలోచన చేయండి. ఎవరి వల్ల, ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది? మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది? అని ఇంటికి వెళ్లి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని ఈ రోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. 

 

*మోసాల బాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలి...*

ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు అన్నది నిర్ణయం అవుతుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాను. మీరే గమనించండి. మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్‌.. ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పులు తీసుకొచ్చాడో మీకే కనిపిస్తోంది. మీ కళ్ల ఎదుటే మీ గ్రామాల్లో, మీ ఇంటి బయటే కనిపిస్తోంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతున్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని కోరుతున్నాను. మీరే చెప్పండి అని కోరుతున్నాను. 

 

*58 నెలల్లో గ్రామాల్లో సమూల మార్పులు...*

ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగులు పెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్‌ సెక్రటేరియట్, వార్డు అయితే వార్డు సెక్రటేరియట్‌..  ఎప్పుడు వచ్చాయి అంటే ఈ 58 నెలల కాలంలోనే. మీ జగన్‌ వచ్చిన తర్వాతనే.  అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్లు. మన కోసం అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ఎవరు తెచ్చారంటే మీ జగన్‌. ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్‌.. ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవుదినమైనా, ఆదివారమైనా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని ఆరాటపడుతూ మనవళ్లుగా, మనవడిగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్‌ అంటే.. జరిగింది, చేసినది మీ జగన్, ఈ 58 నెలల్లోనే. 

 

 

*మీ జగన్‌ వచ్చిన తర్వాతే లంచాలు, వివక్ష లేని పాలన.*

లంచాలు లేకుండా, వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చిందంటే.. ఈ 58 నెలల కాలంలోనే. మీ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అవునాకాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు. అందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి, గమనించండి. 

 

 

*ఏ గ్రామంలోనైనా నాలుగు అడుగులు వేస్తే....*

ఆ విలేజ్, వార్డు సచివాలయాల నుంచి ఒక పది అడుగులు ముందుకు వేస్తే చాలు.. అదే గ్రామంలోనే మనకళ్ల ఎదుటే కనిపిస్తుంది ఓ రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో మారిన ఇంగ్లీషు మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే విలేజ్‌ క్లినిక్‌ లు. అక్కడే అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్‌. ఇవన్నీ నెలకొల్పింది ఎవరు అంటే మీ జగన్‌. జరిగింది ఎప్పుడంటే ఈ 58 నెలల పాలనలోనే. 

 

పౌర సేవల్లో ఏది కావాలన్నా.. అంటే బర్త్‌ సర్టిఫికెట్, పెన్షన్, రేషన్, ప్రభుత్వ పథకాలు కావచ్చు.. ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టి అందిస్తున్న పాలన.. ఎప్పుడు వచ్చిందంటే అదీ ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాతనే. అవునా కాదా.. ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్లి ఆలోచన చేయండి. నలుగురితో ఆలోచింపజేసే విధంగా చెప్పండి.

 

 

*అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు జమ.*

రూ.2.70 లక్షల కోట్లు.. లక్ష రూపాయలు కాదు.. పది లక్షలు కాదు.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఓ అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్‌ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్కచెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అంటే.. మీ జగన్‌. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని గర్వంగా చెబుతున్నాను. 

 

*అక్కచెల్లెమ్మల ఫోన్లోనే దిశ యాప్‌.* 

బటన్‌ నొక్కితే చాలు.. ఆపదలో ఉన్నప్పుడు అక్కచెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీసు సోదరుడు ఫోన్‌ చేసి నేరుగా అక్కచెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మా ఏమైంది అని అడిగే పరిస్థితి. మన గ్రామంలోనే ఓ మహిళా పోలీసు. తీసుకు వచ్చింది ఎవరు అంటే.. మీ జగన్‌. జరిగింది ఎప్పుడు అంటే ఈ 58 నెలల పాలనలోనే అని గర్వంగా చెబుతున్నాను. అవునా కాదా.. మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారో అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో మీరే చూడండి. ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం.. ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి. ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ఎవరూ కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం, ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటకు వస్తాడు. తలరాతలు మారుతాయని పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

నాడునేడుతో గవర్నమెంట్‌ బడులను మార్చినది, గవర్నమెంట్‌ బడుల్లో గోరుముద్ద, విద్యాకానుక తెచ్చినది, ఇంగ్లీషు మీడియం, బైజూస్‌ కంటెంట్, పిల్లల చేతుల్లో బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్, పిల్లల చేతుల్లో ట్యాబులు, పిల్లల క్లాస్‌ రూముల్లో ఐఎఫ్‌బీ ప్యానల్స్, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, గవర్నమెంట్‌ బడుల్లో మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, 3వ తరగతి నుంచే టోఫెల్‌ మొదలు, ఇంగ్లీషు మీడియం మొదలు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం. అన్నీ కూడా జరిగింది.. ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని గర్వంగా చెబుతున్నాను. 

 

*పెద్ద చదువులకు కొండంత అండగా...*

పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇచ్చే విద్యాదీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలు, ఇంటర్న్‌ షిప్‌లు,  ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కోసం విదేశీ విద్యాదీవెన.. ఇలా పేద పిల్లల భవిష్యత్‌ ను మార్చేందుకు షాదీ తోఫా, కళ్యాణమస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా వంద చదువుల విప్లవాలు ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో కనిపిస్తాయి. 

 

*వైద్య ఆరోగ్య రంగంలోనూ...*

ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్యరంగాన్ని తీసుకోండి. నాడునేడు ద్వారా గవర్నమెంట్‌ హాస్పిటళ్ల రూపురేఖలు మారుతున్నాయి. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో ఈరోజు ఏకంగా 54 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్‌ రిక్రూట్మెంట్‌ అయ్యాయి. ఇంతుకు ముందు గవర్నమెంట్‌ హాస్పటల్‌ కు పోతే అక్కడ మందులుండేవి కావు, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు ఉండేవారు కాదు. ఈరోజు నాడునేడుతో గవర్నమెంట్‌ హాస్పటళ్లు రూపురేఖలు మారుతున్నాయి. గవర్నమెంట్‌ ఆసుపత్రులలో ఈరోజు 54 వేల మంది నియామకం జరిగింది. మందులన్నీ డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ స్టాండర్డ్స్‌ కు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 17 మెడికల్‌ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈరోజు వేగంగా వస్తున్నాయి. మీ నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తున్నాయి. నంద్యాల మెడికల్‌ కాలేజీ కడుతున్నాం. ఇక్కడే కనిపిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 3300 ప్రొసీజర్లకు తీసుకుని పోయాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడయినా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్యశ్రీ లిమిట్స్‌ ఏ పేదవాడికైనా రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి ఈ 58 నెలల కాలంలోనే అడుగులు పడ్డాయి. 

 

*ఆరోగ్య ఆసరాతో తోడుగా...*

ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయడమే కాదు, ఆపరేషన్‌ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్టు తీసుకోమని చెబితే, రెస్టులో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేల చొప్పున రెండు నెలలైతే రూ.10 వేల చొప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్టు ఇస్తే అన్ని నెలలపాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

 

ఈరోజు మొట్టమొదటి సారిగా గ్రామస్థాయిలో దాదాపుగా 10600 విలేజ్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. అర్బన్‌ లో అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. కొత్తగా 1700.. 104, 108 వాహనాలు కొనుగోలు చేశాం. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా 108, 104 నంబర్లకు ఫోన్‌ కొడితే చాలు కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ ఈరోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు 104, 108 వాహనాలు క్యూలు కడుతున్నాయి. 

 

గ్రామ స్థాయిలో మొట్ట మొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్‌ క్లినిక్స్‌ తో అనుసంధానం అయి పేదవాడికి తోడుగా ఉన్నారు. మొట్ట మొదటి సారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడం, ఉచితంగా మందులివ్వడం జరిగింది కేవలం ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. అవునా కాదా.. అని అడుగుతున్నాను. 

 

*రైతన్నకు తోడుగా....*

ఇక మన రైతు.. మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా మొట్ట మొదటి సారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా.. పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ రైతన్నకు తోడుగా ఉంటూ ఆర్బీకేలు పని చేస్తున్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం. రైతన్నలకు మొట్ట మొదటి సారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్‌ లో నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇస్తున్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల కాలంలోనే. ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆదుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

 

*అమూల్‌తో పాల విప్లవం...*

రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని, పాడి రైతులను సైతం ఆ రైతన్నలకు, ఆ అక్కచెల్లెమ్మలకు పాడి పశువులను కొనివ్వడమే కాకుండా అమూల్‌ ను తీసుకొని వచ్చి కాంపిటీషన్‌ క్రియేట్‌ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డెయిరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా రూ.10 నుంచి రూ.22 పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

ఏకంగా 19.17 లక్షల మంది రైతన్నలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ 34.72 లక్షల ఎకరాలకు పూర్తి హక్కులతో.. సర్వ హక్కులనూ ఆ భూముల మీద ఆ రైతన్నలకు కల్పిస్తూ ఆ రైతన్నలకు 22ఏ కింద తీసేయడం గానీ, సర్వ హక్కులు కల్పించడం గానీ జరుగుతున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మొట్ట మొదటి సారిగా అసైన్డ్‌ రైతులకు ఈరోజు పట్టా భూములు వస్తున్నాయి. పట్టాలు చేతికి వస్తున్నాయి. సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. మొట్ట మొదటి సారిగా ఒక పేదవాడిని గౌరవించిన ప్రభుత్వం, పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

*నామినేటెడ్‌ పదవుల్లో చట్టం చేసి 50 శాతం పదవులు....*

మొట్టమొదటిసారిగా నామినేటెడ్‌ పదవుల విషయంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం పదవులు నానానా అని నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు బాగుండాలని ఏకంగా చట్టం చేసి మరీ వారిని పైకి లేపాలి, ఎదగనివ్వాలని 50 శాతం పదవులు వాళ్లకే ఇచ్చట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం. జరిగినది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే.. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వరకూ.. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే, దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే, ఈ 58 నెలల్లో అదనంగా 2.31 లక్షల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఇందులో ఏకంగా 80 శాతం ఉద్యోగాలు నానానానా అని నేను పిలుచుకుంటున్నా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలకే దక్కాయి అంటే ఆలోచన చేయమని కోరుతున్నాను. 

 

*ప్రతి పేదవాడూ బాగుపడాలని...*

ప్రతి పేదవాడూ బాగుండాలి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఏ వర్గాలూ ఉండకూడదు. అన్ని వర్గాలూ రాజకీయంగా, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు.. ఎప్పుడూ జరగని విధంగా.. ఇందులో కూడా ఏకంగా 75 శాతానికి పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మలకుటుంబాల ఖాతాల్లోకి వెళ్లిపోవడం, ఎక్కడా లంచాలు అడిగేవాడు లేడు. ఎక్కడా వివక్ష లేదు. ప్రతి పేదవాడికీ కూడా అండగా, తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి.

 

 

*పేదవాడికి కులం ఉండకూడదని...*

ఇక్కడే మరో విషయం చెప్పాలి. పేదరికానికి కులం ఉండదు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా. ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఎవరూ చూడని విధంగా ఎప్పుడూ జరగని విధంగా విప్లవాత్మకమార్పులు చోటు చేసుకున్నాయి. 

 

*అభివృద్ధి కోసం వికేంద్రీకరణ...*

అభివృద్ధిలో మొట్ట మొదటి సారిగా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు మొదలు.. మరో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా కొత్తగా ఈ 58 నెలల కాలంలోనే మరో 16 వేల కోట్లు పెట్టి 4 సీ పోర్టులు కడుతున్నాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 10 ఫిషింగ్‌ హార్బర్లు మరో రూ.3,800 కోట్లు ఖర్చు చేసి కడుతున్నాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 15 వేల విలేజ్‌ వార్డు సెక్రటేరియట్లు ఈరోజు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 11 వేల ఆర్బీకేలు ఈరోజు గ్రామ స్థాయిలో కనిపిస్తున్నాయి. 11 వేల విలేజ్‌ క్లినిక్‌ లు ఈరోజు గ్రామ స్థాయిలోనే దర్శనం ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నాయంటే దేశ చరిత్రలో కూడా ఇదొక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 58 నెలల కాలంలోనే ఈ మార్పులన్నీ కూడా జరిగాయని ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. 

 

*విశ్వసనీయతకు అర్ధం తీసుకొస్తూ....*

మరి మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు. ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు. కానీ ఎందుకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు మీ బిడ్డ చేసినట్టుగా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. ఇదొక్కటే కాదు.. మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో గొప్ప మార్పు విశ్వసనీయత అన్నపదానికి అర్థం తీసుకొని రావడం.. మీ బిడ్డ తీసుకొచ్చిన ఇంకో పెద్ద గొప్ప మార్పు అని ఈ సందర్భంగా చెబుతున్నాను. 

 

 

*మేనిఫెస్టోను పవిత్రంగా భావించి అమలు చేస్తూ...* 

ఇంతకు ముందు మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో పడేసేవాళ్లు. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల మేనిఫెస్టోలో కనిపించేవి. ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేసేవాళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే సంస్కృతికి పూర్తిగా పక్కన పెడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెబితే మొట్ట మొదటి సారిగా ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్‌ గానూ, ఒక ఖరాన్‌ గానూ, ఒక భగవద్గీతగానూ భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి ప్రతి గడపకూ వెళ్లి చేసించి చూపించి ఆశీస్సులు తీసుకుంటున్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఒకటి ఉంది అంటే అది మీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

 

 

మనం ఈ 58 నెలల్లో తీసుకొచ్చిన ఈ మార్పుల్లో ఒక పది శాతం గానీ లేదా వదిలెయ్‌.. ఒక 5 శాతం గానీ, చంద్రబాబు బాబు నాయుడు గారు.. తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు మనం చేసిన మార్పుల్లో కనీసం ఒక 10 శాతం అయినా చేసి ఉంటే ఇదే చంద్రబాబునాయుడు, ఇదే ఎల్లో మీడియా.. ఎల్లో మీడియా అంటే తెలుసు కదా.. ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5.. ఇదే ఎల్లో మీడియా ఇదే బాబు పోషిస్తున్న ఈ ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లో పెట్టుకున్న ఈ చంద్రబాబు మనుషులు.. వీరంతా కూడా ఏమనేవారో తెలుసా.. మనం చేసిన దాంట్లో చంద్రబాబు 10 పర్సెంట్‌ చేసినా కూడా వీళ్లంతా ఏమనుండేవాళ్లో తెలుసా.. మా చంద్రబాబుకు ఒకటి కాదు.. 10 రంగాల్లో నోబెల్‌ ప్రైజు ఇవ్వాలని, నాలుగు ఆస్కార్‌ అవార్డులు, 16 మెగసెసే అవార్డులు ఇవ్వాలని, యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్, వరల్డ్‌ బ్యాంకు ప్రెసిడెంట్‌ వీళ్లరూ కలిసి జాయింట్‌ గా వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని.. ఇవన్నీ జరగాలని క్యాంపెయిన్‌ చేసుండేవాళ్లు. అవునా కాదా.. 

 

*పేదల సంతోషమే జగన్‌కు అవార్డు–రివార్డు.*

చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడు ప్రపంచంలో లేరని ఢంకా బజాయించేవాళ్లు. కానీ నాకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా.. ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం. వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం, వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం, వారి కుటుంబాల అక్కచెల్లెమ్మల సాధికారత, అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు. ఇవీ జగన్‌ కు కావాల్సిన అవార్డులు, రివార్డులు. దీని కోసమే జగన్‌ ఆరాటపడతాడు. దీనికోసమే జగన్‌ ప్రయాస పడతాడు. 

 

*బాబు వెన్నుపోటుకి బ్రాండ్‌ అంబాసిడర్‌.*

అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. చంద్రబాబు గారి పేరు చెబితే తాను చేసిన ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా?  14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక స్కీమూ గుర్తుకురాదు, ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకురాదు. చంద్రబాబు ఎందుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటే తెలుసా.. చంద్రబాబు పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా.. గుర్తుకొచ్చేది వెన్నుపోటు. 

 

రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగ అన్న బాబు గుర్తుకొస్తాడు. బషీర్‌ బాగ్‌ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రుణ మాఫీ అని రైతుల్ని నిలువునా ముంచేసిన బాబు గుర్తుకొస్తాడు. బాబొస్తే కరువు వస్తుందన్న నానుడి కూడా గుర్తుకొస్తుంది. అందేకాదు.. రెయిన్‌ గన్‌ తో కరువును జయించిన ఓ పిట్టల దొర కూడా గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి. 

 

ఇదే చంద్రబాబు పేరు చెబితే 2014లో.. మీరందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల కిందట మాత్రమే ఫ్లాష్‌ బ్యాక్‌ లోకి పోతున్నా. 5 సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు గారు..ఇంటింటికీ పంపించిన ఈ పాంప్లేట్‌ ఒక్కసారి చూడండి. అందరికీ గుర్తుందా? ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది. మోడీ గారి ఫొటో ఉంది. ఇందులో దత్తపుత్రుడి ఫొటో కూడా ఉంది. 2014లో ఇదే చంద్రబాబు గారు ఇదే పాంప్లేట్‌ మేనిఫెస్టో అయితే పెద్దది.. ఇంటింటికీ పంపించడం కష్టం అని ఇలా పాంప్లేట్‌ కొట్టి..చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి, మోడీ గారి ఫొటో, దత్తపుత్రుడి ఫొటో పెట్టి తన ఫొటోతోపాటు ఇంటింటికీ పంపించాడు. ఇందులో ఏమన్నాడో తెలుసా? టీవీల్లో అడ్వర్టైజ్‌మెంట్లు ఊదరగొట్టాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో ఎక్కడ చూసినా అడ్వర్టైజ్‌మెంట్లు కనిపించేవి. 

 

*ఒక్క హామీ నిలబెట్టుకోని చంద్రబాబు.*

ఇందులో ఆయన చెప్పిన మాటలు.. ముఖ్యమైన హామీలట. ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలు అని ఇలా పంపించాడు. ఇప్పుడు కూడా పంపిస్తున్నాడు. సూపర్‌ సిక్స్‌ అంటాడు.సూపర్‌ సెవెన్‌ అంటాడు. 2014లో పంపించిన ముఖ్యమైన హామీల్లో.. రైతుల రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87612 కోట్లు రైతుల రుణ మాఫీ చేశాడా? ఇలా ఇలా ఇలా.. ఇందులో రెండో ముఖ్యమైన హామీ.. డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14205 కోట్లు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతున్నాను. 

 

ఇందులో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్‌ చేస్తానన్నాడు. ఆ 5 సంవత్సరాల్లో మీ అందరికీ లేదా మీ పక్కింట్లో ఆడ బిడ్డలు పుట్టి ఉంటారు. ఇందులో ఏ ఒక్కరికైనా రూ.25 వేలు డిపాజిట్‌ చేశారా? అని అడుతున్నాను. కనీసం ఆ 2014–2019లో ఒక్క రూపాయి అయినా డిపాజిట్‌ చేశారా అని అడుగుతున్నాను. ఇందులో చెప్పిన ఇంకో హామీ.. ఇవన్నీ ముఖ్యమైన హామీలని చెబుతూ ఇంటింటికీ పంపించాడు. ఇంటింటికీ ఒక ఉద్యోగమిస్తా. ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికీ కూడా ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. 60 నెలల్లో నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి కుటుంబానికి రూ.1.20 లక్షలు ఇవ్వాలి. ఇచ్చాడా? అని అడుగుతున్నాను. 

 

ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఆగిపోలేదు. ఇంకా ఉన్నాయి. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. ఇందులో ముఖ్యమైన హామీ రాశాడు. నేను అడుగుతున్నాను. కనీసం ఏ పేదవాడికైనా ఒక్క సెంటైనా స్థలం ఇచ్చాడా అని అడుగుతున్నా. ఇదే నంద్యాల జిల్లాలో ఇచ్చాడా అని అడుగుతున్నాను. 10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణ కోసం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తోంది హైటెక్‌ సిటీ? 

 

ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలంటూ 2014లో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఒక వైపున ఆయన ఫొటో, ఒకవైపున మోడీ గారి ఫొటో, మరోవైపున దత్తపుత్రుడి ఫొటోతో ప్రతి ఇంటికీ పంపించారు. ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా వీరు నెరవేర్చారా? అని అడుగుతున్నాను. ప్రత్యేక హోదా ఇచ్చారా? అని అడుగుతున్నాను మిమ్మల్నందరినీ. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. ఇవ్వకపోగా మళ్లీ ఇదే ముగ్గురూ కలిసి మళ్లీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్‌ సిక్స్‌ అట. సూపర్‌ సెవెన్‌ అట. కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త పదాలతో మళ్లీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్లు ముగ్గురూ అడుగులు వేస్తున్నారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని చెబుతున్నారు. ఈ సారి ఈ ముగ్గురూ కలిసి సూపర్‌ సిక్స్‌ అట, సూపర్‌ సెవెన్‌ అట, ప్రతి ఇంటికీ కేజీ బంగారం అట, ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

 

 

*నాయకుడు అంటే కార్యకర్త కాలర్‌ ఎగరేసేలా ఉండాలి.*

రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకుడనేవాడు ఎలా ఉండాలంటే.. ప్రతి కార్యకర్తా కూడా అదిగో మా నాయకుడు.. తానే మా నాయకుడు అని కాలర్‌ ఎగరేసుకొని అదిగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. విలువలు ఉండాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి ఏ గడ్డి అయినా సరే తినడానికి సిద్ధం అంటున్న ఇలాంటి అద్వానమైన పాలకులు ఈ రాష్ట్రానికి కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ దీని గురించి లోతైన చర్చ చేయమని కోరుతున్నాను. 

 

*బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం..* 

బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం. బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. వీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారని మన ముందుకు వీళ్లంతా వస్తున్నారు. వీళ్ల వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది అన్నది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. కానీ ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఏ పేద అక్కచెల్లెమ్మ కుటుంబాల్లోకి వెళ్లి వాళ్ల బ్యాంకు ఖాతాలు చూస్తే, ఏ ఒక్కరికి చూసినా లక్షలు లక్షలు వాళ్ల బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తాయి. 

 

 

*చంద్రబాబు ధ్యాస దోచుకోవడం పైనే...*

ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని ఈరోజు పంపించిన చరిత్ర కనిపిస్తుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ 5 సంవత్సరాల్లో తాను చేసింది ఏమిటి? తాను ఎందుకు జగన్‌ లా చేయలేకపోయాడు అంటే కారణం.. వాళ్ల ధ్యాస, వాళ్ల చింత పేదవాళ్లకు మంచి చేయడం గురించి కాదు.. వాళ్ల ధ్యాస, వాళ్ల చింత దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప వాళ్ల ధ్యాస, చింత వేరే లేదు.

 

మరోవంక మీ జగన్‌ హయాంలో మనందరి పాలనను చూడండి. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలను నెరవేర్చి ప్రతి గ్రామంలోనూ ఇదిగో మార్పు, పేదల ఇంట్లో ఇదిగో మార్పు. సామాజిక వర్గాల్లో ఇదిగో మార్పు. అక్కచెల్లెమ్మల జీవితాల్లో ఇవిగో వెలుగులు. పిల్లల భవిష్యత్‌ లో ఇవిగో దారులు.. అంటూ సగర్వంగా ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగే పరిస్థితి.. మన 58 నెలల పాలనలో ప్రతి కార్యకర్తా కూడా గ్రామంలో కాలర్‌ ఎగరేసుకొని వెళ్లి మాట్లాడే పరిస్థితి ఈ 58 నెలల కాలంలో వచ్చింది మీ జగన్‌ వల్ల, జరిగింది ఈ 58 నెలల పాలనలో, మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

*మరో ధర్మ యుద్ధానికి సిద్ధం...*

మంచి చేసిన మీ జగన్‌.. మీ అందరినీ దేవుడిని నమ్ముకుని ఎన్నికల బరిలో ఉంటే, చెడు చేసిన బాబు.. పొత్తుల్ని, మోసాల్ని, అబద్ధాలను, కుట్రల్ని నమ్ముకుని ఈరోజు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒక్కటే మరో ధర్మ, అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైమ్‌ వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపునమీరు నిలబడటానికి, యుద్దం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. జెండాలు జతకట్టిన వారికి, జనం గుండెల్లో గుడి కట్టిన మనకు మధ్య జరగబోయే ఈ ఎన్నికల్లో ఎవరు ఏం చేశారో ఇంటింటికీ వెళ్లి అర్థమయ్యేలా చెప్పడానికి, ఓటు అడిగేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. 

 

 

*చీకటి యుద్ధాన్ని ఎదుర్కునే మహాసేనానులు మీరు.*

వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు మనకు ఒక ఈనాడు, ఏబీఎన్, టీవీ5 ఇలాంటి వారు మనకు తోడుగా లేరు. బాబు మాదిరిగా నాలుగు ఎల్లో చానళ్లు, రెండు పత్రికలు మనం పోషించడం లేదు. కానీ మనకు చానళ్లు లేకపోయినా, సెల్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఎడిటర్‌. సెల్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు చానల్‌ ఓనర్‌. వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహా సేనానులు మీరు. ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడుగుతున్నాను. సిద్ధంగా ఉంటే జేబులోంచి సెల్‌ ఫోన్లు బయటకు తీయండి. ఇందులో లైట్‌ బటన్‌ ఆన్‌ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని గట్టిగా నినదించండి. 

 

*విశ్వసయనీతకు– వంచనకు మధ్య యుద్ధం..*

విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. పేదవాడి భవిష్యత్‌ కు అండగా నిలబడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి 175కు 175 ఎమ్మెల్యేలను, 25కు 25ఎంపీలను గెలిపించుకునేందుకు, పేదవాడి భవిష్యత్‌ కు అండగా ఉండేందుకు, వెలుగుల బాట కొనసాగించేందుకు ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చేందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమేనా అడుగుతున్నాను. 

 

చీకటి అయిపోయింది కాబట్టి మళ్లీ ర్యాంపు వద్దని సెక్యూరిటీ వాళ్లు చెబుతున్నారు కాబట్టి దయచేసి మరోలా ఎవరూ అనుకోవద్దని సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

*మరో విన్నపం..*

మీ అందరితో కూడా మరో విన్నపం. మనందరి గుర్తు ఏమిటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన గుర్తు ఫ్యాన్‌. ఈరోజు మన పార్టీ అభ్యర్థుల కింద ఈరోజు మీ అందరికీ పరిచయస్తుడైన మన బ్రహ్మానందరెడ్డి అన్న పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాడు. మంచి వాడు మీ అందరి చల్లని దీవెనలు బ్రహ్మానందరెడ్డి అన్నమీద ఉంచమని కోరుతున్నాను. 

 

అదే విధంగా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు, నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని సవినయంగా కోరుతున్నాను. అదే విధంగా పాణ్యం ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు రాంభూపాల్‌ అన్నకు కూడా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదే విధంగా బనగానపల్లెకు రామిరెడ్డి అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫున నిలబడుతున్నాడు. మీ అందరి చల్లని ఆశీస్సులు రామిరెడ్డి అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. అదే విధంగా ఆళ్లగడ్డకు సంబంధించి నా సోదరుడు నాని నిలబడుతున్నాడు. నానికి కూడా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. శ్రీశైలం అభ్యర్థిగా చక్రపాణి అన్న నిలబడుతున్నాడు. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు అన్నపై ఉంచాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. అదేవిధంగా నందికొట్కూరు నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, డాక్టర్‌ గా మంచి పేరున్న వ్యక్తి నిలబడుతున్నాడు. చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. రాజా (బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి) గురించి చెప్పాల్సిన పని లేదు. నా స్నేహితుడు. నాకు దగ్గరి వాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు రాజాపై కూడా ఉంచాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. అని సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు

 

Back to Top