బాబు హయాంలో ఆరు లక్షల కోట్లకు పైగా అవినీతి
శ్రీకాకుళం:నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు,వారి అనుచరులు ఆరున్నర లక్షల కోట్లకు పైగా దోచుకున్నారని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆయన బినాామీలు, వందిమాగధుల కు సంబంధించిన అవినీతి అక్రమాలను వివరిస్తూ రూపొందించిన అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన నిధుల అక్రమాలు, గోల్మాల్ లకు సంబంధించి ఆధారాలతో సహా ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకంలో ఉన్నాయన్నారు. 2018 నవంబరు చివరి నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ముద్రించిన ఈ పుస్తకంలో ఆయా ఆక్రమాలు, అన్యాయాలకు సంబంధించిన జీవోలను కూడా పొందుపరిచారన్నారు. రాష్ట్రపతి, పార్లమెంటు సభ్యులకు , విచారణ సంస్థలకు, గవర్నర్లు, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇతరత్రా ఈ అవసరమున్న అందరికీ ఈ పుస్తక ప్రతులను పార్టీ ఎంపీల ద్వారా అందచేసి, చంద్రబాబు అవినీతిని లోకానికంతటికీ చాటతామని స్పష్టం చేశారు.